Friday, November 26, 2010

ఆరెంజ్‌కు ముందొచ్చిన రంగులు / మాగిన పండ్లు

ఆరెంజ్ !!
బావుందంటున్నారు బాలేదంటున్నారు
నేనైతే ఇంకా చూడలేదు
ఇంకో వారం వరకూ చూడలేను కూడా
కాకపోతే ఇప్పటివరకూ వచ్చిన సమీక్షలు , అందులో వెలిబుచ్చిన "కథాంశం" , "కథానాయకుడి పాత్ర" చదివితే... హృద్యంగా తీసారు అనిపించిన ఒక ఇంగ్లీషు చిత్రం మూలమా అనిపిస్తోంది. అసలు ఇది హిందీలో "బచ్ నా ఏ హసీనో" ప్రేరణ అన్నమాటే నిజం అయితే , అదే కనుక కొనుక్కుని ఈ కథ చేసుకుని ఉంటే , పాపం అనిపిస్తుంది! ఎందుకో ఆ హిందీ చిత్రం నే ఉదహరించబోతున్న ఇంగ్లీషు చిత్రాల ఆధారంగా రూపొందినదే మరి.
ఇంతకీ ఇప్పుడు నే చెబుతున్నది ఆరెంజ్ చిత్రం , లేదా ఆ హిందీ చిత్రం ఈ ఇంగ్లీషు సినిమాకు కాపీ అని accuse  చెయ్యడానికి కాదు. స్థిరమైన ప్రేమ ఉంటుంది అనే నమ్మకం లేక , వేరేవేరే ఆడవారి మోహంలోపడే ఒక అబ్బాయి పాత్ర , పర్యవసానాలు ఇలాంటి కథాంశం నచ్చేవారు తప్పక చూడాల్సిన ఇంగ్లీషు సినిమాగా పరిచయం చేస్తున్నాను. సినిమాటిక్‌గా అప్పట్లో ఈ స్క్రీన్‌ప్లే ఒక సంచలనం. "breaking the fourth wall" techniqueను అద్భుతంగా ఉపయోగించుకున్న స్క్రీన్ ప్లే.
ఇంతకీ బ్రేకింగ్ ఫోర్త్ వాల్...ఏమిటంటే , ప్రధానంగా నాటకం నుండి వచ్చిన ప్రయోగం.  నాటకం జరుగుతున్న స్టేజీకీ మూడు గోడలు ఉంటాయి కదా, background, two sides. మనం చూస్తున్నది నాలుగవ గోడ నుండి అన్నమాట. అది కేవలం ఒక ఊహాజనితమైన గోడ. అంటే , అక్కడ కూడా ఒక గోడ ఉన్నట్లే , తమను ఎవరూ గమనించనట్లే నాటకంలోని పాత్రధారులు నటిస్తారు. కానీ ఒకవేళ పాత్రధారులు , ప్రేక్షకుల వైపు తిరిగి , వాళ్ళనే ఉద్దేశ్యించి మాట్లాడితే/నటిస్తే , అది ఆ నాలుగవ గోడను విచ్ఛిన్నం చేసినట్లు. తద్వారా నాటకం interactive అయినట్లు.
 సినిమావరకూ ఆ నాలుగవగోడ కెమెరా.
అంటే కెమెరావైపు ఆడియన్సు ఉన్నారు కనుక. కెమెరావంకే చూసి ప్రేక్షకులతో డైరెక్టుగా మాట్లాడినట్లు నటించడం బ్రేకింగ్ ఫోర్త్ వాల్ అవుతుంది.
     ఆ తరహా స్క్రీన్‌ప్లేను అత్యుత్తమంగా వాడుకున్న సినిమాల్లో ఒకటైన ALFIE , (ఒక నాటకంనుండి తెరకెక్కించబడిన చిత్రమే మరి) 1966లో వచ్చిన బ్రిటిష్ చిత్రం . భార్యతో నిలకడగా ఉండలేక ఇతర స్త్రీలను ప్రేమిస్తూ , ఆ స్త్రీలలో కూడా ఎక్కువసేపు ప్రేమను చూడలేక confusedగా ఉండే పాత్రలో నటుడు michael caineను ఆస్కార్ నామినేషన్ వచ్చింది కూడా. తర్వాత్తర్వాత తన భార్య గర్భం దాల్చగా, ఒక బిడ్డకు తండ్రిగా మారేప్పుడు అతనిలో బంధం , కట్టుబాటు అనే భావాలు పెరుగుతాయి.

కేన్స్‌లో స్పెషల్ అవార్డు కూడా పొందిందీ చిత్రం!


ఇదే కథాంశంతో , ఆ పెళ్ళీ/తండ్రీ/బిడ్డా ఎలిమెంట్స్ తీసేసి ఒక playboy bachelorగా ప్రధానపాత్రను మార్చి రీమేక్ చేసారు అదే చిత్రాన్ని 2004లో. ఇది హాలీవుడ్ / అమెరికన్ వెర్షన్.  బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యింది ఈ సినిమా. కారణం : ఒరిజినల్ అంత గొప్పగా లేకపోవడమే అని ఒక వాదన.



బచ్నా ఏ హసీనో దాదాపు ఈ రీమేక్‍నే అనుసరిస్తుంది. మరి ఇప్పుడు వింటున్న ప్రకారం ఆరెంజ్ కూడా దాన్నే అనుసరిస్తున్నట్లు తోస్తోంది. అవునో కాదో పక్కన పెడితే , ఆరెంజ్ తరహా కథ నచ్చేవాళ్ళు , ముందుగా2004రీమేక్ చూస్తే ఖచ్చితంగా నచ్చుతుంది.
స్క్రీన్ ప్లే ఇంట్రెస్టు ఉండేవారు, ఒకే కథను రీమేక్ చెయ్యాలంటే ఎలా మోడ్రనైజ్ చేసి అడాప్ట్ చెయ్యాలో తెలుసుకోవడానికి ముందుగా 1966 original చూసి తర్వాత 2004 సినిమా చూడడం బెటర్.
 మళ్ళీ చెబుతున్నా ఇది ఆరెంజ్‍కు మూలమనీ , లేదా దీని కాపీ ఆరెంజ్ అనో చెప్పడం లేదు ,  ఇదీ ఆరెంజ్ లాంటి చిత్రమే.కాకపోతే కొన్ని సంవత్సరాలు ముందొచ్చినవి. చాలా బాగా తీసినవి.

డబ్బులున్నోడా !

 "పీప్లీ లైవ్" !ఈ ఏడాది , భారతదేశపు ఆస్కార్ ఎంట్రీ . విడుదలకు మునుపే ఎంతో క్రేజ్‌ను సంపాదించుకుని , విడుదలయ్యాక అంతటినీ నిలుపుకున్న చిత్రం. అటువంటి చిత్రాన్ని నేను చూడకూడదు అని నిర్ణయించుకుని చాలాసార్లు "avoid" చేసాను! కారణాలు వ్యక్తిగతం. సిద్ధాంతాల వైరుధ్యం.
 కానీ ఆ కారణాలు , సిద్ధాంతాలు పక్కనపెట్టి చూడాల్సిన సందర్భం వచ్చింది. ఒక reference కోసం. "ఈ సినిమా నాకు నచ్చదు" అనే premeditated thoughtతో చూడడం మొదలెట్టినా కూడా , మెల్లమెల్లగా నచ్చడం మొదలయ్యింది.  సినిమాలో కథా, కమామీషూ కాదు..నటులను డైరెక్ట్ చేసిన పద్ధతి. అప్పుడప్పుడూ దూరదర్శన్ టీవీ డ్రామా చూసినట్లు అనిపిస్తున్నా , మెల్లగా సినిమాలో లీనం అయ్యాను. కానీ , కొన్ని సన్నివేశాల్లో ఏదో అనుమానం వచ్చింది. సినిమాలో ఏదో తేడా జరుగుతున్నట్లు తోచింది.  మధ్యలోనే సినిమా ఆపేసి , వెంటనే నా అనుమానం నిజమేమో అని గూగుల్ చేయడం మొదలుపెట్టాను.
 ఖచ్చితంగా నిజమే అని చెబుతూ కొన్ని వార్తా కథనాలు దొరికాయి.
ఇంతకీ ఆ అనుమానం ఏమిటంటే , ఒక flowలో వెళుతున్న ఆ స్క్రీన్‌ప్లేలో హఠాత్తుగా ఎవరో ఆత్రంగా ఎడిట్ చేసినట్లు, కొన్ని సన్నివేశాలు షూట్ చేసి డిలీట్ చేసినట్లు అనిపించింది. అదేమిటీ డిలీట్ చేసిన సన్నివేశాలు ఎలా తెలుస్తాయి అని అడగకండి. తెలిసిపోతాయి. స్క్రీన్‌ప్లేలు చదవడం అలవాటయితే.  వంట బాగా నేర్చిన కుక్ దూరంగా వాసనను బట్టే ఉప్పు ఎక్కువవుతోందని చెప్పగలిగినట్లు .
 ఇలా ఎడిట్ అయి ఉండకూడదే , అని గూగుల్ చేస్తే , ఈ షాకింగ్ న్యూస్:
 "ఆస్కారు అవార్డుల దగ్గర పీప్లీ లైవ్ చిత్రాన్ని represent చేయడానికి ఇష్టపడని దర్శకురాలు అనూషా రిజ్వీ"
తాను తీసిన చిత్రం ఆస్కారు అవార్డుకు ఎంట్రీగా వెళ్ళడం అనేది చాలామంది (అందరికీ కాకపోయినా) ఒక అందని కల. ఒక సువర్ణావకాశం. అలాంటిది చేతికి వచ్చాక వదులుకోవడమే !! ఏందుకు ఏమిటీ అని ఆ వార్త గురించి మరింతగా అన్వేషిస్తే :
 " ఈ చిత్రాన్ని తాను అనుకున్నట్లు తీయలేకపోయాననీ , final edit/cutలో తాను ముచ్చటపడి షూట్ చేసిన సన్నివేశాలు మార్చబడ్డాయనీ, నిర్మాతగా అమీర్ ఖాన్ తను చెప్పినట్లే ఎడిట్ చెయ్యాలి అన్నాడనీ , అదెలా అని అడిగితే , ముందుగా సంతకం చేసిన కాంట్రాక్ట్‌లో ఆ clause ఉందని చెప్పడంతో విధిలేక ఊర్కుండిపోయాననీ. కనుక ఇది తాను అనుకున్న "తన" సినిమా కాదనీ , అందుకే తనది కాని సినిమాకు దర్శకురాలిగా రెప్రజెంట్ చేసుకోవడం ఇష్టం లేక తప్పుకుంటున్నాననీ " అనూషా రిజ్వీ చెప్పినట్లు ఆ వార్తల సారాంశం.
 విచిత్రం ఏమిటంటే , ఇంత "పెద్ద" అవమానాన్నీ , గాయాన్నీ పొందిన ఆ దర్శకురాలి ఆవేదనను పెద్దగా పట్టించుకోలేదు మీడియాకూడా . ఇంత సెన్సేషనల్ న్యూస్‌ను ఛానెల్సు , పత్రికలు కూడా తూతూమంత్రంగానే వేసి కప్పెట్టేసాయి. అచ్చంగా తను తీసిన సినిమాలో పెద్దవారి చేతుల్లో మీడియా కీలుబొమ్మ అయినట్లు , తన్ సినిమాకు సంబంధించీ మీడియా ప్రొడ్యూసర్ అమీర్‌ఖాన్ చేతిలో కీలుబొమ్మ అవుతుందని పాపం ఆమె ఊహించలేకపోయింది !!
http://www.inclusiveplanet.com/en/channelpost/731765
  అలాంటి సందర్భంలో ఆమె అలాంటి నిర్ణయం తీసుకుందో లేదో , వెంటనే అమీర్‌ఖాన్‌కు మద్దతుగా ఎన్నో గొంతులు. అసలు అమీరే లేకుంటే ఈ సినిమా ఇలా నిర్మించబడేదా , నిర్మింపబడినా అంత గొప్పగా " మార్కెంటింగ్" చేయబడి , అంతగా ప్రజలకు చేరువయ్యేదా..కాబట్టి ఇవ్వేళ అసలు ఈ సినిమా గురించి ఇంత గుర్తింపు వచ్చిందీ అంటే అందుకు ఖచ్చితంగా అమీరే కారణం అని.
 ఆ మాటలు నిజమే . కానీ , మార్కెటింగ్, ప్రొడక్షన్ చేసినంత మాత్రాన కళాత్మక వస్తువు అయినా సినిమా డబ్బులు పెట్టిన, అమ్మిన "ఓనర్" ది అయిపోతుందా! అలా అయితే సూపర్ మార్కెట్‌లో దొరికే సోపుకూ , సినిమాకూ అట్టే తేడాలేనట్లే.
పైగా, ఇదంతా తన "పబ్లిసిటీ" కోసం చేస్తోందని దర్శకురాలిపై నిందలు!
http://www.imdb.com/name/nm0944834/news

ఆ మాటా నిజమే అయినా కూడా , ఆస్కారు వచ్చే అవకాశం ఉంటే దాన్ని వదులుకోవడం ద్వారా పబ్లిసిటీ పొందాలని యోచించేంత బుద్ధి తక్కువగా ఎవరైనా ఉంటారా?
  ఇక అమీర్‌ఖాన్ గురించి ఇలాంటి ఆరోపణ రెండవసారి కాదు. తారే జమీన్ పర్ విషయంలోనూ ,అసలు ఆ కథకు మూలపురుషుడు , స్క్రిప్టును చాలాభాగం చేసి, దర్శకత్వం చేద్దాం అనుకున్న వ్యక్తీ అయిన అమోల్ గుప్తె కూడా ఇలాగే ఆ చిత్రం నుంచి నిష్క్రమించాడు. కాబట్టి ఇలాంటి ఘనచరిత్ర కలిగిన నిర్మాతను నమ్మాలో , ఏ చరిత్రా లేని దర్శకురాలిని నమ్మాలో తేల్చుకోవడం మీడియాకు పెద్ద కష్టమేమీ కాదు . కానీ అసలు ఆ విషయాన్ని కప్పెట్టడమే దానిపని అయినప్పుడు చేసేదేముంది.
 ఇంతకూ బదులుగా అమీర్‌ఖాన్ చెప్పింది :
"The film is neither mine nor Anusha Rizvi’s. It belongs to the audience, which has accepted it so well. If Anusha Rizvi feels that she has been neglected and wants to distance herself from Peepli Live, it is her discretion. I am seriously considering withdrawing the film from the Oscars."
     నాకైతే కళ్ళు తెరుచుకున్నాయి. సినిమా దర్శకుడిదీ కాక , నిర్మాతదీ కాక ప్రేక్షకులది అనడం !! ఆహా... రాజకీయ నాయకుల టైపు డైలాగు. నిజ్జంగా ఆస్కారు నుంచి అతను సినిమాను డ్రాప్ చేస్తే , వెర్రివెంగళప్పలు ఎవరయ్యా అంటే , ఓ పది సినిమాలు చూసి "ఇదైతే ఆస్కారు వస్తుంది" అని నిర్ణయించిన మన భారతదేశపు ఆస్కారు సెలక్షన్ కమిటీ మెంబర్లు. తర్వాత ఈ సినిమా వల్ల తమ సినిమాలకు ఆ ఛాన్సు పోగొట్టుకున్న ఇతర భాషల సినిమాలు!

   ఏది ఏమైనా ఈ మొత్తం వ్యవహారంవలన నేర్చుకోదగినది ఒక్కటే : " డబ్బు పెట్టేవాడి చేతికెళ్ళాక నీ సినిమా ఇక నీ సినిమా కాదు "
కామెడీగా అనిపించినా నాకిప్పుడు గుర్తొస్తున్న సందర్భం , "చంటబ్బాయ్" సిన్మాలో పత్రిక ఎడిటర్ అయిన పొట్టి ప్రసాదు , ఓనరు కోడలయిన శ్రీలక్ష్మి "కళాపోషణ" తట్టుకోలేక " అలాగేనమ్మా, మీరు చెప్పాక చేసేదేముందీ! ఇన్నాళ్ళూ ఈ వారపత్రికను నా స్వంతపుత్రికలా చూసుకున్నాను, ఇకనుండి దీన్ని వారపుత్రికలా తయారు చేస్తానమ్మా" అంటాడు.   దర్శకులంతా ఇక "ఆ పని"కి సిద్ధపడిపోవడక తప్పదేమో !
p.s : డబ్బులున్నోడా ! (రక్తచరిత్రలో పాట గుర్తొచ్చి ఆ టైటిలు పెట్టా )

Sunday, November 21, 2010

ఐస్క్రీమ్

ఐస్క్రీమ్ చూస్తే చాలు
గుర్తుకొచ్చేస్తావు
కరిగిపోయేదానివని కాదు
దాచుకోలేనిదానివి కనుక
ఏళ్ళొచ్చినా చావని పిల్లతనం
మోడర్నిటీలో ఎంత శాపం
ఇదొద్దు అదొద్దు అదీఇదీకలిపీ ఒద్దు
ఏదీ ఒద్దు
ఇవి కాక ఇంకేదో కావాలి
ఎంతఎంత ఆశలు నీలో
ఊడిపడిపోయేంత విచ్చుకున్న ఆ కనుగుడ్లలో
ఒక నేను
రెండు నేనులై నీ ఆ కనుబొమ్మల్లో
ఎన్నోకోర్కెల నిన్ను
ఇముడ్చుకునే ఒకే ఒక్క చూపునై
కరిగె కరిగె ఆశలా కరిగె
ఙ్ఞాపకాల హిమములో
కొనేది కేవలం ఒక నోటు
ఇచ్చేది వాడెవ్వడో
నాకూనీకూ ఏమీ కానివాడు
మిగిలింది కేవలం ఒక చెమ్మటి
వేదన
పోయావుగనుక
ఐస్క్రీమ్ చూస్తే నువ్వే గుర్తుకొస్తావు !

Wednesday, November 17, 2010

ONLY FOR SELECTED READERS from next week

అనుకున్నంతా అవుతోంది
ఒకప్పుడు..ఈ లేఖిని, బరహా కూడా రాకమునుపు ఈ అంతర్జాలంలో వ్రాయడం బాగా అలవాటైన నాకు, వ్రాతకంటే అందుకొచ్చే అఙ్ఞాతవ్యక్తుల అభ్యంతరకర మాటలు చాలా ..నొప్పించాయి అనలేను కానీ , చిరాకు తెప్పించేవి. అవి ప్రచురించడమూ ప్రచురించకపోవడమూ నా ఆధీనంలోనే ఉన్నప్పటికీ అసలు చదివితేనే చిరాకు తెప్పించేంత బ్యాఖ్లు వస్తుంటే నా వ్రాతలే ఆపేసాను.
 ఈ మధ్య అవి ఇక్కడా ఎదురవుతున్నాయ్.
 నేను చెప్పదల్చుకున్నదేదో , నా స్వంత పేరుతో ధైర్యంగా చెబుతున్నప్పుడు చాటుమాటునుండి బాణాలు వేసేవారంటే నాకు చాలా విసుగు.
అసలు కామెంటు సెక్షన్ తీసేద్దాం అనుకున్నా. కానీ , అసలంటూ అలాంటివారికి నా వ్రాతలు చదివించాల్సిన అవసరం నాకేమిటీ అనే ఆలోచనతో , ఇకనుంచీ ఈ బ్లాగును కొంతమందికే పరిమితం చేస్తున్నాను.

 నా బ్లాగులో ఎటువంటి వ్రాతలూ, అవాకులూ చవాకులూ ఉంటాయో ఈ సరికే తెలిసినవారు ఇక నుంచి అవి చదవగోరితే , తమ ఈ మెయిల్‌ అడ్రస్సును నాకు iamviplove@yahoo.co.inకు పంపండి. మిమ్మల్నీ ఆ లిస్టులో చేరుస్తా.

 ఈ గోల వొద్దు అనుకుంటే రాం రాం.

Tuesday, November 16, 2010

కాపీ కొట్టుకోవడానికో సిన్మా కథ : పూర్తిగా ఫ్రీ !!!

 సినిమా తీయాలి అనుకుంటున్నారా?
అట్టే డబ్బులు పెట్టలేరా ?
నటీనటులను కూడా afford చేసుకోలేరా ?
పెద్ద సెట్లూ , లొకేషన్లూ కష్టమా ?
అయితే.... ఇలాంటి ఒక కథ దొరికితే ?
ఈ కథలో..తెరపై కనిపించేది కేవలం ఒక వ్యక్తి. పాతికముప్ఫయ్యేళ్ళ వయస్సు మగవాని పాత్ర,
అంతే!
తెరపై కనిపించక గొంతులో మాత్రమే పలికే పాత్రలు  ఐదోఆరో మీ ఇష్టం.
ఇక సెట్టింగు:
నాలుగు చెక్క ముక్కలు...కలిపి చేస్తే ఒక పెట్టె. కెమెరా కదలికల కోసం మీ ఇష్టం వచ్చినవి విడగొట్టుకోవచ్చు.
ఆ ఒక్క నటుడూ వేసుకున్న బట్టలు కాక
props : ...అగ్గిపెట్టె ( విత్ పుల్లలు ) , టార్చ్ లైట్ , వీడియో కెమెరా ఉన్న సెల్ ఫోన్ . కొన్ని చీమలు.

అంతే
ఇవి చాలు ఒక సినిమా తీయడానికి.
మరీ అన్యాయం..ఇంత తక్కువలో సినిమా ఎలా తీయొచ్చు ..కథాకమామీషు ఏమిటీ అంటారా?
కథ నేను ఇస్తున్నా...
ఉచితంగా...
" ఒక యువ పోలీస్ ఆఫీసర్ , కళ్ళు తెరచేసరికి తానొక పెట్టెలో ఉన్నానని తెలుసుకుంటాడు. మెల్లగా ఆ పెట్టెతో సహా నేలలో పాతిపెట్టబడ్డాను అని తెలుసుకుంటాడు. నల్లమల అడవుల్లో కూంబింగ్ నిర్వహించడానికి వచ్చిన తనను ఇలా ఎవరు చేసారా అని అతను తనను ప్రశ్నించుకుంటుండగానే..అతని జేబులో ఒక సెల్‌ఫోన్ మోగుతుంది. అది అతనిది కాదు. ఆన్సర్ చేస్తే , అతడిని అలా పాతిపెట్టిన వ్యక్తి చెబుతాడు : ముఖ్యమంత్రి తప్పిపోతేనే వెతుక్కోలేని మీరు మమ్మల్ని ఏరివేద్దామని వస్తారా...చేతైతే నిన్ను కాపాడుకోమ్మని మీ డిపార్ట్‌మెంటుకు చెప్పమని.
 తన సీనియర్స్‌కు ఫోన్ చేసి , తనను కాపాడమని ఆ పోలీసు అభ్యర్థనలు , అతనెక్కడున్నాడో చెప్పుకోలేని యంత్రాంగ వైఫల్యం , ఆఫ్ట్రాల్ అతనొక్కడి ప్రాణానికి ఫోర్స్‌ను ఎందుకు పణంగా పెట్టాలి అనే bureaucracy మధ్య అతను నలగిపోతూ , ఒకవైపు ప్రాణవాయివు అందక నిముషాల్లో చావుకు దగ్గరపడుతుంటే , తనను పాతిపెట్టిన వ్యక్తినే అభ్యర్థిస్తూ , జనం , ప్రభుత్వం , నక్సలిజం అంశాలలోని నిజాలు అబద్ధాల గొడవల మధ్య అసలతను నక్సలైటే కాదని తెలియడం.... ఇవన్నీ కలిసి...చివరికి అతనే మవుతాడు ?
  ఇదీ కథ?
చాలదా సినిమాకు ?
 నమ్మరా ?
మూడువారాలు నేనూ , నా స్నేహితుడూ ఎంతో చర్చించుకుని చేయకుండా మానేసుకున్న , వదిలేసుకున్న కథ ఇది.
ఎందుకు వదిలేసుకున్నామో తెలుసా ?
కథ నేను వ్రాసినదే అయినా.. "పెట్టెలో పాతిపెట్టబడిన ఒక వ్యక్తి తన జీవితంకోసం వ్యవస్థతో చేసే యుద్ధం.."అనే మూలకథ/ కాన్సెప్ట్ / ఐడియా... మూడునెలల క్రితం వచ్చిన స్పానిష్ చిత్రం "BURIED" నుంచి ప్రేరణ పొందినది.నిజంగా ఈ కాన్సెప్టుతో అతను తొంభైనిముషాల చిత్రం తీసేసాడు.
మేము ఆ సినిమా చూడలేదు. చూస్తే influence అవుతామని. కేవలం ఈ ట్రయిలర్

చూసి , వికీలో కథ చదివి ఉత్సాహపడిపోయాం. అసలు కేవలం ఒక్క వ్యక్తితో అలా తీసేసాడు కదా ఆ దర్శకుడు , మనమూ ప్రయత్నిద్దాం అని , మన నేటివిటీకీ సరిపడేలా కథ వ్రాసుకున్నాం. ఎన్నో సన్నివేశాలు స్వంతంగా వ్రాసుకున్నాం. కానీ , ప్రతిక్షణం మనసులో ఏదో ఒక మూల ఒక ప్రశ్న.
 "మనం ఎంత చేసినా , ఎంత ప్రయత్నించినా ఈ basic idea కాపీ కొట్టినట్లే కదా. మనమేంటీ కాపీ కొట్టేంతగా దిగజార్చడమేమిటీ ?"
మాకు మేమే ఎన్నో సమాధానాలు చెప్పుకున్నాం
" అసలు ఈ వ్యక్తి ఒరిజినల్‍గా తీసాడు. kill bill2 లో ఈ సన్నివేశం నుంచి ప్రేరణ పొందలేదా ?

"అయిన కేవలం ఒక్క సన్నివేశం నుంచి ప్రేరణ పంది సినిమా తీసాడు అతను , మనం సినిమానే సినిమాగా మారుస్తున్నాం. ఇది ప్రేరణ కాదా? " అనే ప్రశ్న అంతరాత్మను భలే ఇబ్బందిపెట్టింది.
అంతలో నా కథ వ్రాసినకొద్దీ , "అరే..ఇది పూరీ జగన్నాధ్ తీసిన 143 సినిమాలోని క్లైమాక్స్‌లా లేదూ " అనిపించింది.
అంతలోనే.. కానీ ఆ క్లైమాక్స్ కూడా 2001లో మన లగాన్ చిత్రాన్ని తొక్కేసి ఆస్కారు తెచ్చుకున్న బోస్నియన్ చిత్రం NO MANS LAND నుంచి "కాపీ" కొట్టారుగా "మనవాళ్ళు" అనిపించింది.
 అంతలోనే.. మనవాళ్ళు కాదు..అసలు మనం ఏ చిత్రాన్ని చూసి మనం ఇంత ఇన్స్పైర్ అయ్యామో ఆ BURIED చిత్రమే hitchcock చిత్రాలనుంచి అరువు తెచ్చుకున్న సన్నివేశాలతో , PHONE BOOTH ,NO MAN'S LAND తరహా plot structureతో , KILL BILL2 సన్నివేశాన్ని వాడుకుని కలగూరగంపలా తయారు చేసినట్లు అనిపించింది. అక్కడితో ఆగామా ? అసలు ఇంతటి సింపుల్ ఐడియాతో ఇంతవరకూ ఎవ్వరూ షార్ట్ ఫిలిం అయినా తీలేదా అని కాస్త సర్చ్ చేస్తే...అబ్బో ఎన్ని బయటపడ్డాయో!!:
http://www.imdb.com/title/tt0534695/
http://www.imdb.com/title/tt0565985/
http://www.imdb.com/title/tt0879450/
http://www.imdb.com/title/tt0508674/
imdbలో buried alive అనే keywordతో చూస్తే కేవలం అమెరికన్ చిత్రాల్లోనే ఇన్ని కనిపించాయి. ఇక ఇంగ్లీషు కాక మిగతా భాషల సినిమాల్లో ఎన్ని ఉన్నాయో మరి.
బాబోయ్.. ఈ ప్రేరణలూ , కాపీలూ!! తిరిగి తిరిగి మొదటికే మోసం తెచ్చాయిగా.
 ఇప్పుడు మన స్క్రిప్టుకు ప్రేరణ buried ,no man's land, kill bill2 లో ఏదైనా కావొచ్చుగా.
అసలు , ఇంత పాతబడిన కాన్సెప్టును అతనెవరో స్పానిష్‍లో తీస్తే ఆహా ఓహో అని పొగుడుతారే , అదే మన తెలుగులోనో , ఇండియాలోన తీస్తే "కాపీ కాపీ" అని గోల చేస్తారేల అంటే ...సినిమా అనేది కేవలం ఒక ఐడియా కాదు , ఆ ఐడియాను ఎలా develop, treatచేసి , మిగతా 24 craftsతో ఎలా "కొత్త"గా PRESENT చేసారు అనేదే చూసే సంస్కారం, బుద్ధీ అక్కడ ఉన్నాయి ఇక్కడ లేవు. ఇక్కడ ఎంతసేపైనా పక్కవాడు చేసిన పని ఏం పెద్ద గొప్పది కాదు, అదొక కాపీ అనేసి సంతోషిద్దామమే sadistic pleasure ఎక్కువ కనిపిస్తుంది మరి. 
ఇలా మాకు మేమే ఎన్నో విధాలుగా నచ్చజెప్పుకున్నా... చివరాఖర్లో ఎక్కడో ఏదో అసంతృప్తి.
" ఊహు లాభం లేదు. ఇంతగా సమాధానపరుచుకుని , ఎవడో స్పానిష్ వాడి చిత్రాన్ని చూసి మనం తీయడం ఏమిటీ ?! ఏదో ఒక రోజూ మనమే ఒక ఒరిజినల్ ఐడియాతో తీస్తాం. హాలీవుడ్ అయినా దాన్ని చూసి కాపీ కొట్టాల్సిందే "
 అహంకారమో ఆత్మవిశ్వాసమో పొగరో మరి, అలాంటి ఆలోచనతో మా ప్రాజెక్టును పక్కన పెట్టేసాం.
 కానీ...
లోపల్లోపల ఒక చిన్న సందేహం పుట్టింది.
ఇంకొన్ని నెలల్లో వేరే భాషలో ఎవరో ఈ సినిమా చూసి , మళయాళ్ళ మమ్ముట్టో , తమిళ ఎస్.జె.సూర్యో , హిందీలో సంజయ్ దత్‌(మొన్నీమధ్య ఇతనితో PHONE BOOTH సినిమాకు ఒక కాపీ చేసి అద్వానీక్కూడా చూపించారట బాలీవుడ్ ఘనులు) లాంటి వాళ్ళతో తీసి , ఓ అని తెగ మీసాలు మెలేసుకుని , అప్పుడు మనం మాత్రం అలా నోరెళ్ళబెట్టుకుని చూస్తూ.. " ఛ , మన తెలుగువాళ్ళం వేస్టు" అని బాధపడిపోకుండా , అదేదో మనలోనే ఎవరో తీస్తే బెటర్ అనిపించింది.
 అందుకే ... వీలైనంతమంది ఔత్సాహిక తెలుగు సినీ దర్శకులు/నిర్మాతలకు ఇది అందితే బావుణ్ణని , ఇలా బహిరంగంగా నా aborted project ideaను ఇచ్చేస్తున్నాను.
  ఏ మాత్రం ఆసక్తి కలిగినవారైనా వెంటనే ఈ అవకాశాన్ని వినియోగపరుచుకోగలరని ఆశిస్తున్నాను.

ముఖ్య గమనిక : ఒక పరభాషా చిత్రాన్ని ప్రేరణగా తీసుకుని ఇంకో సినిమా తీస్తున్నప్పుడు , మనం తీసే చిత్రం మనం ప్రేరణ పొందిన చిత్రం కంటే అద్భుతంగా ఉండాలి. లేకపోతే కాపీ/ప్రేరణ ఏ మాత్రం క్షమార్హం కాదు. దొంగల మధ్య కూడా ఒక నీతి ఉండాలి అన్నట్లు , కాపీ సినిమాల్లో అప్రచురితమైన నీతి ఇది.

Thursday, November 04, 2010

దేవుడి సాక్షిగా

"అయామ్ సారీ , వి డిడ్ ఆల్ ది బెస్ట్ వి కెన్. బట్..."
డాక్టర్ల మాట విన్నాక అతనికి ఏమీ తోచట్లేదు.  అంతాపోయింది. అయిపోయింది.
 తను ఇక ఉండదు.
" తను మాట్లాడలేదు. బట్..వి థింక్ , మే బీ, నువ్వేమైనా చెబితే తనకు వినబడొచ్చు. అర్థం కావొచ్చు కూడా. వి ఆర్ నాట్ ష్యూర్. ఏమో! మీరేమైనా చెప్పాలి అనుకుంటే... " ఎంతో పరిణితి చెందిన వైద్యశాస్త్రం అంతాచేతులెత్తేసి నాకిస్తున్న బంపర్ ఆఫర్ అదీ.
ఏ నిముషం అయినా తన ఊపిరి ఆగిపోవచ్చు. ఆ గుండె.
"లబ్‍డబ్, లబ్‍డబ్.." ఇప్పుడే అప్పుడే ఆగిపోవచ్చు
"హే నీ హార్ట్ బీట్ భలే వినిపిస్తోంది"
"ఛా..అలా డైరెక్ట్‌గా బ్రెస్ట్‌ మీద పడుకుంటే వినపడదేంటి..లేవరా బరువు"
"నే లేవను..కదలకు..కొరికేస్తా"
"ఒద్దురా..ప్లీజ్. ఇప్పటికే మంట. నిన్న నీ కొరుకుడు మంటకు ఆఫీస్‌లో ఎంత ఇబ్బంది అయ్యిందో తెలుసా"
"ఏం ఇబ్బంది ?"
"నీకేం తెలుసురా మోటువెధవా. కాన్ఫరెన్స్ మధ్యలో లేచి బ్రా తీసేయ్యాలి అన్నంత నొప్పి పుడుతుంది "
అదేమిటో.. అంత సెక్సువల్ మెమరీ వచ్చింది మొదట. అంతేనా ఆమె నాకు. ఆ మెత్తటి గుండెలు. నన్ను దాచుకున్నవి.
"డాడీ.." ఇంకా విషయం అర్థం కాని అమ్మాయ్ భయంగా అడుగుతోంది. ఈ పిల్లను ఎవరు చూసుకుంటారు ?
"బెటర్ బీ క్విక్ సర్ " తెల్లటి మృత్యుదేవతలాంటి డాక్టర్ భుజం తట్టాడు.
అమ్మాయిని బంధువులకు అప్పజెప్పి, ఐసీయూ గదిలోకి అడుగుపెట్టాను.
అంతా ఒకటే వాసన. చావు వాసన.
అదిగో ఆ మంచంలో..ఆమె శరీరం.
ఎంత పని చేసాడు , ఆ తీవ్రవాది ? లంజకొడుకు. మా ఫ్యామిలీ , నేను , తను..మాకేం సంబంధం..పాకిస్తానుకో, త్ తాలిబానుకో, అమెరికాతో ఆయిల్ వ్యాపారానికో. మాకేంట్రా సంబంధం ?
"యాక్..పింక్ డ్రస్సులు ఇష్టమా నీకు ?"
"అవునూ..తప్పేంటి , అమ్మాయిని కదా"
"అమ్మాయ్ అయితే పింక్ నచ్చాలా ?"
"సెక్స్ ఛేంజ్ చెయ్యిచ్చుకో , నీకప్పడు అర్థమౌతుంది"
"నేను అలా అయిపోతే..మరి.. నీ పరిస్థితి ? " పింక్ చీరను లాగేస్తూ హత్తుకున్న ఙ్ఞాపకంలో ఛాతీకు ఆమె ఎద తగిలినట్లే అనిపించింది.
"నాకేం తేడా రాదు. నువ్వు అమ్మాయివి ఐతే నేను అప్పుడు లెస్బియన్ అయిపోతే"
"అబ్బో..భలే మాటలు నేర్చావ్ " కొరికాను. మెత్తటి చోట. అరిచింది. ఇప్పుడు ఆమె గొంతు పెగలదట.
ఏం చెప్పాలి ? ఏం చెప్పాలి ?
ఇంకాసేపట్లో చచ్చిపోయే తనకు ఏమని చెప్పాలి?
నువ్వు లేకపోతే నేను ఉండలేను , అనేది అబద్ధం. ఉంటాను. ఉండాలి. అమ్మాయ్ ఉంది. ఇంకా చాలా లైఫ్ ఉంది. అది ఎంత దుర్భరమైనదైనా జీవితమే. ఉట్తిమాటలూ ప్రగల్భాలూ ఒద్దు .నిజం చెప్పాలి. అమ్మాయ్‍ని గొప్పదాన్ని చేస్తాననా? అదెలాగూ జరిగేదీ తనకు తెలిసినదే కదా. మళ్ళీ మరే ఆడదాన్నీ ప్రేమించననా? అది నిజమా ? ఏమో..భవిష్యత్తు ఎవరికి తెలుసు. ఆమె గుండెచప్పుడును తెలియజేస్తున్న..అదేదో మిషను.. తన్నుకు ఛస్తోంది. అది ఎప్పుడైనా ఆగిపోవచ్చు. చెప్పు. చెప్పు. త్వరగా ఏదో చెప్పు.
రేకులన్నీ ఊడిపోయిన గులాబీ పువ్వులా , కరిగిపోతున్న స్ట్రాబెర్రీ ఐస్క్రీమ్‍లా , వడలిపోతున్న బెలూన్‍లా...పీలబడిపోతున్న పింక్‍గా తను. నాకు ఏడుపు.
ఒక్కటే చెప్పగలను.
మెల్లగా ముఖాన్ని సమీపించాను.కళ్ళు మూసుకున్నాను.
" మొదటి ముద్దు ఎక్కడయితే బావుంటుంది?"
"ఎక్కడేమిటీ.. లిప్స్ మీదే. ఫ్రెంచ్ టైప్?"
"ఒరే కామపిశాచీ, నేనడిగింది అది కాదు. ఏ లొకేషన్‌లో మనం ఫస్ట్ కిస్ పెట్టుకుందాం అని. జీవితాంతం ఆ ట్రిప్ , ప్లేసూ గుర్తుండిపోవాలి కదా?"
"హనీమూన్ ఎక్కడ పెట్టుకున్నా, ఆ..విషయాలన్నీ హోటల్ రూంలోనే కదా"
"టేస్ట్ లేదురా నీకు"
"మరి ఎక్కడ చేద్దాం?"
"గుడిలో.."
"వాట్ ?"
"హ్మ్మ్.. ఇదేదో పాపంలా ఎందుకు? గర్భగుడి ఎదురుగా..దేవుడు చూస్తుండగా?"
"పిచ్చా నీకు?"
"ఎవ్వరూ లేని టైంలో ఎర్లీ మార్నింగ్ వెళదాం. అర్చనకు డబ్బులిచ్చాక పూజారి మనమొహం కూడా చదవడు. తను మన పేర్లతో మంత్రాలు చదువుతుండగా..ఆ కర్పూరపు సువాసనల్లో.."
"నీకు పైత్యం ఎక్కువే తల్లీ. దొరికాం అంటే పిచ్చకొట్టుడు కొడ్తారు. అయినా తప్పు. అపచారం"
" అయితే కుదరదా? "
కుదరలేదు.
చెవి దగ్గరకు వెళ్ళాను.
"దేవుడు ఇప్పుడు చూస్తుండడూ ? ఇక్కడే ఎక్కడో.."
నా పెదవులు అమె చెవి మీదే అద్దుకున్నాయి.
చప్పుడు ఆగిపోయింది,  మిషనులో.
కానీ నాకు వినిపిస్తోందే:
"వొద్దురా..చక్కలిగిలిగా ఉంది" నవ్వుతూ తను.

Tuesday, November 02, 2010

స్మోకర్ పొగల ఊసులు

STATUATORY WARNING :
TOBACCO CAUSES CANCER
SMOKING IS INJURIOUS TO HEALTH


statuatory reminder :
live for the moment

ఆ పొగలో చూశా నిన్ను
రూపం లేని మనస్సులా
ఎగెరెగిరిపోతున్నావు
ఇప్పుడున్నట్లు అప్పుడుండవు కదా
         
  *****


అరచేతులెందుకు నాకు
నిన్ను దాచలేనప్పుడు
చెంపలెందుకు నీకు
నా చేతుల్లోకి రానప్పుడు

      *****

నెత్తురోడే పెదవేసుకుని
కోపమెందుకలా చిమ్ముతావు
పీల్చేందుకు నా గుండె అంతా ఇస్తున్నా కదా

   *****



ప్రేమించినకొద్దీ కరగిపోతావు
ఇంకిపోతావు
ఆవిరౌతున్నావ్
నశించిపోతున్నావు
పోతే పో
ఘడియైనా చాలు బ్రతికావు కదా
నా కోసం
మరచిపోతానా ఆ ఘడియను

      *****

శివుడైనా ఏమిటట
నువ్వురాల్చే బూడిదలో ఓ రేణువు
చితిచేరాక నేనైనా ఇంతే కాదా

    *****


నవంబరొచ్చింది
రామరి పెదవులమధ్యకు
శ్వాసంతసేపు  ప్రేమిస్తా
వెచ్చగా చచ్చిపో
భగ్న ప్రేమతో భగభగమండే సిగిరెట్టూ
మనకు మనమే ఈ పొగసాక్షిగా

Wednesday, October 27, 2010

నిక్కరు రోజుల సినిమా

"అమ్మాయిలతో ఆడుకుంటావేంట్రా ఆడంగి వెధవా "
"తప్పేంటి..వాళ్ళూ మన క్లాస్‍మేట్సే కదా"
"కాదురా. వాళ్ళు వేరే "
"ఎలా? "
"ఎలా ఏంటీ వాళ్ళు లేడీస్.. మనం మొగాళ్ళం. మనకు మీసాలొస్తాయ్"
"వాళ్ళకు?"
"హి హి..అది కూడా తెలీదా, వాళ్ళకూ ఛాతీమీద రెండు బాల్స్ వస్తాయి, వాటిల్లోంచి పాలు వస్తుంది. వాళ్ళతో ఆడుకుంటే నువ్వూ మాతో కలవడానికి వీల్లేదు"
బాలబకాసురుడి సైజులో ఉండే ఒక పన్నెండుపదమూడేళ్ళా బాలుడు , తన స్నేహితుడిని తమ గ్యాంగులోంచి వెలివేస్తూ చెప్పే మాటలివి.




ఆడామగా తేడా తెలియక పక్కపక్క ఇళ్ళలో పెరిగిన ఒక అబ్బాయి , అమ్మాయిల స్నేహంలో వీడో పే...ద్ద విలను
మీసాలు రాని ఆ అబ్బాయి హీరో
రెండు జళ్ళేసుకుని పీచు మిఠాయి తినే పిల్ల హీరోయిన్.
ఇప్పుడు హీరోయిన్ కావాలా , మగతనం కావాలా అనే సందిగ్ధంలో మన హీరో ఏం చేసాడు, ఏం గెల్చుకుని ఏం ఓడాడు అనేది కథ.
చిన్నతనంలో మచ్చటపడి చేసుకున్న గాలిపటాన్ని చేజార్చుకుంటే , మళ్ళీ ఓ పదిహేనేళ్ళ తర్వాత అది మనకు దొరికితే ??
ఎంత తియ్యటి అనుభవం. అలానే ఈ కథానాయకుడు ఆ చిన్ననాటి స్నేహితురాలి పెళ్ళికార్డు చూసి , ఆమెకోసం ఊరెళ్తూ తలుచుకునే బాల్యం ఈ చిత్రం.
ఇక ఆ చిన్న పిల్లలు..సినిమాను ఆడేసుకున్నారు. ముఖ్యంగా తిండిపోతుగా వేసిన లావు పిల్లాడు , మనం చెప్పుకునే ఏ విలన్ , క్యారెక్టర్ నటులకూ తీసిపోడు. సినిమాను రెండు  చేతుల్లో తినేసి తన నిక్కరుకు తుడిచేసుకున్నాడు.

2003లో తైవాన్ బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమా" FAN CHAN"ను world moviesలో వచ్చిన ప్రతిసారీ చూసుంటాను. అయినా ప్రతిసారీ ఏదో కొత్తదనం కనిపిస్తుంటుంది. వాళ్ళా భాష మన సాగతీతల్లానే ఉండటమో , ఆ కథాంశం దాదాపు ప్రతి పిల్లాడికీ ఎదురయ్యే ఙ్ఞాపకం లాంటిది కావడమో , ఇవేమీ కాక కేవలం ఆ పిల్లల అద్భుత నటన, అందమైన చిలిపి చేష్టలో , కన్నీళ్ళు పెట్టించే సున్నితమైన సన్నివేశాలో..లేక ఇవన్నీనో.. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ఒక cute movie.
నచ్చకపోయే సమస్య లేదు
భార్యాభర్తలే చూస్తారో , పిల్లలతో కలిసి చూస్తారో , చిన్నపటి స్కూల్ స్నేహితుల రీ యూనియన్ వేసుకుని చూస్తారో..ఎలా అయినా సరే తప్పక చూడండి.
నేను పైరసీకి పచ్చి వ్యతిరేకిని.
తీవ్రంగా ఖండిస్తాను.
కానీ... ఈ సినిమా ఎక్కడ అమ్ముతారో నాకు తెలియదు. youtubeసహా అన్నిచోట్లా దొరుకుతోంది. కాబట్టి , పైగా.. ఏడేళ్ళనాటి సినిమా, ఎక్కడో నలుగురు తెలుగువాళ్ళం అయిన మనం చూస్తే ఈ సినిమా హక్కుదారులకు పెద్ద నష్టం వస్తుందనుకోను కనుక , ఇవిగో నాకు దొరికిన లింకులు ఇస్తున్నాను. అయినా పైరసీ పాపమే.
కాకపోతే ఈ పాపం చెయ్యకతప్పదు. తప్పక ఏదోలా ప్రాయశ్చితమో , పరిహారమో చేస్కోండి. లేకపోతే ఆ పిల్లల కష్టం మనం దోచినట్లే.

http://kobunagaplace.blogspot.com/2009/07/fan-chan-aka-my-girl-2003-thai.html

సినిమ డౌన్లోడ్ చేసుకునేదాకా ఆగలేకుంటే ఈ పాట చూస్కోండి.


మనతో సైకిలు తొక్కిన స్నేహితుల్లు ఎక్కడున్నారో ఏమో కదా!


ఇక స్కూలులో స్టెజెక్కి డ్యాన్సు చేసిన చిన్ననాటి అప్సరస ఎక్కడుంటుందో! 

సినిమా అంతా పిల్లల నటనే కదా, ఇక ఇందులో film making , script brilliance ఏముందిలే అనుకున్న నాకు , ఆఖరి సన్నివేశం... ఒకే ఒక్క SHOTలో ముగించి , ఊహించనంత అద్భుతమైన క్లైమాక్స్ ఇచ్చాడు దర్శకుడు. చిన్ననాటి స్నేహితురాలు ఎక్కడున్నా మనకంటికి ఆనాటి చిన్నదే కదా...అని భలే చెప్పాడు. మీకు బా...........గా...నచ్చిన పిల్ల స్నేహతురాల్ని గుర్తుకుచేసుకుని ఆ క్లైమక్స్ మళ్ళీ చూడండి. ఎంత అర్థవంతమైనదో తెలుస్తుంది.

Tuesday, October 26, 2010

రెప్పపాటు జీవితం

సరే ఆత్మహత్య గురించి ఓ తెగ వ్రాసేసాను కదా , అప్పుడే గుర్తుకువచ్చింది నేను చూసిన ఒక అద్భుతమైన సినిమా.
ఇది సినిమా కాదు,, నిజజీవిత గాథ.

elle fashion magazine journalist అయిన అతను , స్ట్రోక్‌కు గురై , శరీరం అంతా చచ్చుబడి locked-in syndrome అనే అవస్థలో ఉండిపోతాడు. అతను తన శరీరంలో కదల్చగలిగినది, ఎడమకంటి రెప్ప మాత్రమే!
అలాంటి వ్యక్తి జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో ఊహించుకోవడానికి భయం వేస్తుంది. ఆ భయాన్ని అతని కంటినుంచే చూపించే అద్భుతమైనpoint of view shotsతో మొదలవుతుంది ఈ సినిమా :the diving bell and the butterfly.
అతను తను ప్రపంచానికి , తనవాళ్ళకు చెప్పాలి అనుకున్న కొన్ని విషయాలను చెప్పడానికి , ఒక పద్ధతిని ఆశ్రయిస్తాడు. ఒక నర్సు , అతని ఎదురుగా, alphabets అన్నిటినీ పలుకుతుంది. తను చెప్పాలి అనుకున్న పదంలోని అక్షరం రాగానే రెప్ప మూస్తాడు. ఆమె ఆ అక్షరం వ్రాస్తుంది. ఒక మూడు అక్షరాలు వ్రాయగానే , మన సెల్‍ఫోన్‍లో డిక్షనరీలా , ఆ అక్షరాల కాంబినేషన్‍లో వచ్చే పదాలను ఊహించి అడుగుతుంది. సరి అయినది రాగానే అతను రెప్ప మూసి అవునంటాడు. రెండు నిముషాలకో పదం చొప్పున్న రెండు లక్షల రెప్పమూతలతో ఆ పుస్తకం రాయించాడు అతను.
ఇదంతా నిజజీవితపు కథ అయితే, ఆ మనిషి ధైర్యానికి , ఆ జీవితపు బలానికి ఒళ్ళు జలదరించడం అటుంచితే ,ఆ సినిమాలో ఒక సీను ఉంటుంది. ( ఇక్కడ ఈ సన్నివేశం మొదలు మాత్రమే ఉంది మూడు నిముషాల దగ్గర..పూర్తి సన్నివేశం చూడాలంటే సినిమా డౌన్లోడ్ చేసుకోవలసిందే)

మొట్టమొదటిసారి అతనికి అలా రెప్పతో communicateచేయడం నేర్పిస్తున్న నర్సు, ఏం రాయమంటావు అని అడితే. అతను ఒక్కో అక్షరమే..
I
w
a
n
t
d
e
a
t
అనగానే..ఆమెకు అర్థమవుతుంది
you want to die?
అని..ఆమె కళ్ళల్లో కోపం
పట్టలేనంత కోపం.
"ఎంత పొగరు నీకు? ఎంత కఠినాత్ముడవు నీవు? నీకోసం ఇక్కడ ఇంతమంది వైద్యులు నిన్నెలా బాగుచెయ్యాలా అని అహర్నిశలూ తపనపడుతున్నారు...నేనొకదాన్ని ఇంటికివెళ్ళినా నీ గురించే ఆలోచిస్తుంటాను , నువ్వు ఎలా ఉన్నావో ఏం చేస్తుంటావో అనే ధ్యాసలో ఉంటున్నాను , నీ కోసం ఇన్ని హృదయాలు వెర్రిగా ఆశిస్తుండగా " చచ్చిపోతాను" అంటావా?? ఎంత తలపొగరునీకు ? ఛావు పో, మళ్ళీ నీ మొహం చూడను"
 అంటూ ఏడుస్తూ తిడుత వెళ్ళిపోతుంది.
వెనక్కు పిలిచి సారీ చెప్పాలన్నా గొంతు పెగలని అతను, కన్నటి పొరను తుడుచుోలేని అతను రెప్ప కొట్టుకుంటూ చూస్తుండిపోతాడు.
 చావు బ్రతుకులగురించి నేను చూసిన /అనుభవించిన అత్యద్భుతమైన shot అది.
ఆ సినిమాలో వాడుకున్న ఒక పాట..సందర్భోచితమైన సాహిత్యం

ఆత్మహత్య ప్రాధమిక హక్కు కాదా?!

ఆత్మహత్య మహా పాతకం , ఘోరం , దైవద్రోహం...ఎక్సెట్రా ఎక్సెట్రా అని ఎన్నో మతాలు చెబుతుంటాయని విన్నాం
అలాగే చచ్చి , ఏం సాధిస్తాదు ? బ్రతుకు గొప్పదనం , జీవించడంలోని ఔన్నత్యం, ఉదాత్తం గురించి చాలా కథలూ, మాటలూ, సినిమా డైలాగులూ విని ఉంటాం
కానీ, నిజానికి ఆత్మహత్య అంత తప్పుడు విషయమా?
నాకైతే అలా అనిపించడం లేదు
మొన్నీ , ఒక న్యూస్‍పేపర్లో గత ఏడాదీ , ఈ ఏడదీ జరిగిన ఆత్మహత్యల గణాంకాలు చూస్తే, మనసు చివుక్కుమంది. అరే ఇంతమంది అనవసరంగా ప్రాణాలు తీసేసుకుని విలువైన జీవితాన్ని పోగొట్టుకున్నారే అని.
కానీ కాసేపు ఆలోచిస్తే ,వాళ్ళగురించి అలా judgement ఇవ్వడానిక నాకేం హక్కు ఉంది ?
ఇంకొకడి జీవితం వాడి ఇష్టం. వాడికి బ్రతకాల అనిపించలేదు , చచ్చాడు, he did what he wanted. అది గొప్ప విషయమే కదా .
 చెయ్యాలనుకున్నది చేసేసెయ్ , ఎవరేమనుకున్నా అని అన్ని విషయాల్లోనూ positive approachను ప్రోత్సహించే ప్రపంచం మనిషికి తన జీవితాన్ని తన ఇష్టం వచ్చినట్లు బ్రతికే అవకాశం ఉండాలి అన్నట్లే చంపుకునే "హక్కు" కూడా ఉందని మరచపోతుందే ?

కాళ్ళుచేతులూ చచ్చుబడి, లేదా బ్రైన్ డెత్ కేసుల్లా మిగిలిపోయిన మనుష్యులకు mercy killing (euthanasia) హక్కును ఇవ్వాలని ఎన్నో దేశాల్ల ఉద్యమం జరుగుతోంది. కొన్ని దేశాలు మంజూరు చేసాయి . మన దేశంలో ఇంకా ఆ ఉద్యమం నడుస్తూనే ఉంది.అరుణా షాన్బాగ్ కోసం ముఫ్ఫైఏళ్ళనుంచి ఈ పోరాటం సాగుతూనే ఉంది.
కానీ ఆత్మహత్యను మాత్రం ఇంకా నేరంగానే పరిగణిస్తుంది చట్టం. చట్టం ఎక్కడైనా పోనివ్వండి , అదెలాగూ నామమాత్రమే కదా మన దేశంలో . కానీ మనం కూడా అలా నేరంగానే చూస్తామే?!
 ఒక మనిషి ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటే దాని వెనుక ఎంతో బలమైన కారణం , జీవితం మీద విరక్తి , మరణంపై ప్రేమ.. ఏదో ఉండాలి కదా ( సరే క్షణికావేశంలో పిచ్చిపనిలా ఆత్మహత్య చేసుకోవడం అనేది వేరు..అది  momentary hysteria ).అలా ఒక వివేకవంతుడైన మనిషి ఎంతో నెమ్మదిగా , కూలంకషంగా ఆలోచించి తన జీవితాన్ని తానే అంతం చేసుకో నిర్ణయించుకుంటే... అది తప్పు అనే హక్కు ప్రపంచంగా మనకు ఉందా ?
నాకైతే లేదు అనిపిస్తోంది మరి.
suicide should be made a fundamental right.

Thursday, October 21, 2010

పెళ్ళాం - 2

రాత్రి కేం పన్లేదు
ఎప్పుడూ రాత్రవుతూనే ఉంటుంది
కానీ ఈ రాత్రి , ఆమె ఫోను రావాల్సిందే
పదికి చేస్తుంది
నా జేబులోనే మ్రోగుతుంది
నేను ఆన్సర్ చెయ్యను
పదిన్నరకు చేస్తుంది
నేను ఆన్సర్ చెయ్యను
పదకొండుకు చేస్తుంది
నేను టీవీలో హర్రర్ సినిమా చూస్తూ ఉండిపోతాను
మెసేజ్ పెడుతుంది:
ఆర్యూ ఆల్రైట్ అని
లేదా , ఎనీథింగ్ రాంగ్ అని
ఈజ్ ఎవ్విరిథింగ్ ఓకే అని
నేను రిప్లై ఇవ్వను
ఈసారి యాక్షన్ సినిమా మొదలు పెడతాను
మంచి బికినీ అమ్మాయిలు ఉండే సినిమా
ఈ అమ్మాయి జీవితంలో ఎప్పుడైనా బికినీ వేసుకుంటుందా
చా..ఇంపాజిబుల్
పోనీ ఫోటోషాప్‍లో తన ఫోటోను morphe చేసి చూస్తే
ఆ ముఖానికి angelina jolie ఒంటిని అతికించి చూస్తా
ఎవరడ్డుకుంటారు నన్ను..పొద్దున్న డిలీట్ చేసేసేదేగా
హమ్మో తెలిస్తే.. pervert అనుకోదూ
కానీ నేను కాదే ! అస్సలు కాదే. ఏదో సరదా కోసం
ఏంజెలినా కాదు తన ముఖానికి నయనతార బాడీ అయితే బావుంటుంది
ఒళ్ళు కోయించుకోకముందటి నయనతార
అసలు అప్పుడామె బికిని వేసుకుందా ?
ఎవడిని అడిగితే చెబుతాడు?
ఛీ..పెర్వర్ట్ బుర్ర...తప్పు తప్పు
ఆ ( ఒంట్ గంటకూ ఫోన్ చేస్తుంది
నేను యాక్షన్ సినిమా చూస్తూ ఉంటాను
మూడుగంటలకు మెసేజ్ పెడతాను
"sorry , slept off. I am good. sorry "
రెండు సార్లు సారీ ఎందుకూ ? ఒకటి చాల్లే
"sorry"
ఆహా..సారీలో అంత కరెక్టు స్పెల్లింగ్ అవసరం లేదు , చెప్పీ చెప్పనట్లు ఉండాలి
కిందపడ్డా మనమే కింగులా ఉండాలి
"srry"
ఇది కరెక్టు
ఒక్క అక్షరం మింగిస్తే మన వేల్యూ ఎంత పెరుగుతుందో కదా!
"srry. slept off, I am good. how are you ? "
సారీలో అక్షరం మింగేస్తే , అది అలవాటులా ఉండాలి కదా మరి
యూ కు మూడెందుకు , ఆర్ కెందుకు అన్ని అక్షరాలు

"srry. slept off. i am good.how ru ?"
శభాష్.. మూడింటికి ఈ మెసేజ్ చేస్తాను
తను మేల్కోనే ఉంటుంది
మెసేజ్ చూస్తుంది
సంతోషిస్తుంది
కానీ పొగరు కదా
బదులివ్వదు
రేప్పొద్దున కాల్ చేస్తుంది
తనూ నిద్రపోయానని
హ్మూ. నాకు తెలీదా..ఆడబుద్ది..అలాగే చేస్తుంది , అలాగే చెబుతుంది


5:40 a.m
హర్రర్, యాక్షన్ , తర్వాత డిస్కవరీ చానెల్ కూడా చూసేసా
బల్లుల పునరుత్పత్తి ప్రక్రియ క్షుణ్ణంగా అర్థం అయ్యింది
ఈ పిల్లకు ఏమయ్యింది ?
మెసేజ్ ఇచ్చాను
"good morning "
బదుల్లేదు
ఎనిమిది కయినా ఫోన్ రాదా ?
-౦-౦-౦-౦-౦-౦-౦-౦-౦౦

ఆరెంజ్ పిల్లాడు

హ్మూ..
మరచిపోయాను
నాకో బ్లాగుందని
తల్లులు బిడ్డలను మరచిపోతారని అంటే నమ్మలేదు
ఇక నమ్మకతప్పట్లేదు
ఒకేరోజు నాలుగైదు కామెంట్లేసి , నా బ్లాగు ఉనికిని గుర్తుచేసిన సదరు వ్యక్తికి ధన్యవాదాలతో మళ్ళీ మొదలెడుతున్నా...

మొదటగా.. ఈ మధ్య నేన్జూసిన మరచిపోలేని "ఇమేజ్ "నా కళ్ళనుంచి మెదడులోకి చిత్రించుకుపోయిన ఫోటోను పదాల్లో ప్రింటు తీసి చెప్పజూస్తాను.

     ఒక హైవే పక్కన చిన్న ఊరు. ఊరంతా కలిస్తే యాభై ఇళ్ళు ఉంటాయేమో, అంతే. పెద్దవాళ్ళంతా ఏ పనీ లేనట్లు రోడ్డు పక్కన ఉన్న చెట్ల క్రింది అరుగుల మీద. రోడ్డువారనే ఉన్న గుడిసెల అంచున పేళ్ళు చూసుకుంటూ , మిరపకాయలు ఎండపెడుతూ ఆడవాళ్ళు. ఇదీ బ్యాక్‍గ్రౌండ్.
 సమయం సాయంత్రం మూడున్నర. సూర్యుడు ఫెడేల్మంటున్నాడు. (నాకైతే చెమటలు కారిపోతున్నాయి ) అప్పుడు చూసాను .. ఆ పిల్లవాడిని.
 ఏడెనిమిదేళ్ళుంటాయ్ .
 ఒంటిపై చొక్కాలేదు. సన్నగా ఉన్నాడు. గోధుమరంగు చర్మం. ముదురుపచ్చ నిక్కరు. బహుశా ఏదో గవర్నమెంటు స్కూలు యూనిఫారం అనుకుంటా. రోడ్డు వారగా ఒక ఐస్‍క్రీమ్ బండి దగ్గర నిల్చుని , తాతో ఎవరో మరి ఒక పెద్దాయన కొనిస్తుంటే ఆగలేగ ఎగురుతున్నాడు. నేను నా కెమెరా వెదికేలోగా , వాడి చేతుల్లోకి మూడు "పుల్ల ఐసులు " రెండు ఆరెంజ్ , ఒక గ్రేప్. వాడి ముఖం ఇంకా ఆరెంజ్‍. అసలే సూర్యుడూ ఆరెంజ్.
ఎడమచేతిలో ఒక ఆరెంజ్ , ఒక గ్రేప్ పట్టుకుని , (ఒక చిన్నపిల్లవాడి చిన్నచేతివేళ్ళలో రెండు పుల్లైసులు ఇమడడం అంత సులభం కాదని మనవి) , కుడిచేతిలోని ఆరెంజ్ ఐసును ఆబగా చప్పరిస్తూ, నవ్వేస్తూ, కేకలేస్తూ , అప్పుడే జారిపోవడం మొదలెట్టిన నిక్కరు పూర్తిగా జారే లోగా వేగంగా పరిగెడుతూ, చెప్పుల్లేని కాళ్ళతో వేడిగా ఉండే నేలను తొక్కేస్తూ , తన గుడిసెను చేరుకుని , తల్లి ( ? అవునో కాదో నాకు తెలియదు..తల్లే అనుకుంటాను) దగ్గర కూర్చుని మిరపకాయలు ఎండబెడుతున్న చెల్లెలు ( ? ఇదీ నా ఊహే కావొచ్చు)కు ఒక ఆరెంజ్ ఇచ్చి , పక్కన ఎవరో మరి , దిసమొలతో ఉన్న ఒక చిన్న పాప దగ్గర ఆయాసపడుతూ కూర్చుని  గ్రేప్ ఆ పిల్ల పెదవులకు అంటించి , తను ఆరెంజ్ తింటూనే ఉన్నాడు.
    కేవలం కొన్ని ఘడియల్లో మూడు ఐస్‍క్రీములో కరిగిపోయాయి. వాళ్ళా ముఖాల్లో వేల రంగులు విరుస్తున్నాయ్.
 కెమెరా కోసం వెదికితే కళ్ళు ఏం కోల్పోతాయో అని భయపడుతూ అలానే చూస్తుండిపోయాను నేను.
 Life so so beautiful when its simple , అనిపించింది మరి. కానీ ఉండలేం కదా.. అంత సింపుల్‍గా, సంతోషంగా.

Thursday, September 09, 2010

మనిషి ప్రశ్న మనిషి

 ఒక posh restaurantలో పార్టీ తర్వాత మిగిలిపోయిన అత్యంత రుచికరమైన , ఖరీదైన శాఖాహార,మాంసాహార, తీపి వస్తువులన్నిటినీ పార్సిల్ చేయించి , రెస్టారెంట్ బయటే పేవ్‍మెంటు మీద చెత్తతో నింపిన టార్పాలిన్ సంచులను ఆన్చి , వాటికి జారిగిలబడి , బీడీ త్రాగుతున్న , తైలసంస్కారమూ,క్షవరమూ , శుచీ శుభ్రతలను వెలివేసినట్లున్న బక్కటి మనిషికి ఆ ప్యాకెట్ ఇస్తే ..
" వొద్దు..నా భోజనం అయిపోయింది " అని సమాధానం.
" తీస్కోవయ్యా.. పొద్దున్నకూడా తినొచ్చు " వెనకనుండి పార్టీలో తిన్నదాన్ని పళ్ళ సందుల్లోంచి శుభ్రపరుచుకుంటూ స్నేహితుల ఉచిత సలహా.
" లేదన్నా. ఈ పూటకు తినేసా " అదే సమాధానం . ఆ కళ్ళల్లో తృప్తి. తృప్తిలోంచి పుట్టిన ఆత్మవిశ్వాసం. రేపైనా తిండి సంపాదించుకోగలననేమో!
 ఆ మనిషి అలా బీడీ తాగుతూ , sodium vapour lamps నీడల్లో పడుకుని , దారినపోయే కుక్కలనే టీవీ ప్రోగ్రాములా చూసి అరమూడ్పు కన్నులతో సుఖాన్ని తెలియబరుస్తుంటే .. వేల వేల తాత్విక ప్రశ్నలు పుడుతున్నాయి. మనిషికెంత కావాలి ? సుఖమేమిటి ? మనిషి బ్రతుకు ఇంత సింపులా ?! అతని వల్ల ఎవ్వరికేం ఉపయోగం?! ఏమో ఉందేమో! existenceకు మించి మనిషి సాధించేదేముంది ? అతని అస్థిత్వమే అతనివల్ల ప్రపంచానికి ఉపయోగం. existence is what he does !

-౦--౦౦-౦-౦-౦-౦-
ఏవో కారణాల వల్ల, అంతగా రుచించిన సాధారణ భోజనాన్ని , ప్యాక్ చేసి , ఇస్త్రీ పెట్టె , ఒక తోపుడు బండి, తన చేతులో ఆస్తులుగా బ్రతికేస్తున్న చాకలిమనిషికి ఇస్తే... "అయ్యో భోజనమా సార్ " అంటూ , పక్కనే ఆడుకుంటున్న తన పిల్లలను పిలిచి తినడానికి ఉపక్రమిస్తూ , "ఇంతకుముందే మా భోజనం తినేసాం సార్ , కానీ ఇలాంటి తిండి ఎప్పుడో కానీ దొరకదు కదా " అంటూ మారు తినబోతున్నానని చెబితే...
 ఛ... ఈ మాత్రం భోజనం ఇతనికీ , ఇతని పిల్లలకూ ఎప్పుడూ కొనేంత తాహతు లేదా ? అతనికి ఇది కూడ దొరకకపోవడం ఎంత అన్యాయం ?! ఆ పిల్లలు పాపం పెద్దయితే ఏమయిపోతారో. వాడెప్పుడైనా ఒక dessert / pizza రుచి చూడగలడా ? ఆ షాపులు రోడ్డు మీదే ఉన్నా. అయినా ఈ వేళ ఇది రుచి చూపించాను, మరి మళ్ళీ రేపు నేను కనిపిస్తే ఆశగా చూస్తే , ఏమివ్వగలను ? ఎందరికివ్వగలను ? ఇవ్వడం , దానం చెయ్యడం నా అహంకారాన్ని పెంచవా ? గుండెల్లో క్యాపిటలిజం , కమ్యూనిజం , ఎక్సిస్టెన్షియలిజం ..ఎన్నీ "ఇజాల" సంఘర్షణ.
 ఒకరి తిరస్కారంలో తృప్తి , ఇంకొకరి స్వీకారంలో వేదన. 
మనుష్యులు ఊరుకోరు.. ఏవో ప్రశ్నలు రేకెత్తిస్తూనే ఉంటారు .

Wednesday, September 08, 2010

ప్రొఫైల్ బొమ్మలూ..వాటి పిసైకాలజీ

పి.సైకాలజీ : సరదా కోసం విడదీసుకున్న p-sychology. కాబట్టి దీని ఉద్దేశ్యమూ సరదా అని గ్రహించ మనవి.

( ఆర్కుట్ , ఫేస్‍బుక్ , బ్లాగులు , గ్రాఫిటీ...ఎక్కడైనా కానీ ఒక రకం మనుష్యులు నిరంతరం కనిపిస్తుంటారు.
తమ పేరు / ఐడీల పక్కన కొన్ని అద్భుతమైన ఫోటోలు పెట్టుకునేవారు. నాకెప్పుడూ అలాంటి ప్రొఫైల్స్‌ first impresionలోనే ఏదో తేడాగా అనిపించేవి. వీళ్ళు అసలు పెట్టుకుంటే తమ ఫోటో పెట్టుకోవచ్చు , లేకపోతే ఏ ఫోటో లేకుండా ఉండొచ్చు కదా వేరే ఫోటోలు ఎందుకు పెడతారు అనుకుని చిరాకు పడేవాడిని.
తమ ఫోటో పెట్టుకోవడం లేదు అంటే రెండు కారణాలు :
1. తమ ఫోటోనూ , పేరునూ ఎవ్వరితోనూ షేర్ చేసుకోవడం ఇష్టం లేదు అని. సరే , అంటే అసలు ఆ మనిషి ఈ ఇంటర్నెట్ పరిచయం / స్నేహం గురించి అసలు నమ్మకం లేదు.. కేవలం time pass చేయడమే ఉద్దేశ్యం అని అర్థం అవుతుంది. అది దృష్టిలో పెట్టుకుంటే మనమూ టైంపాస్ చేయొచ్చు
2. తమ ముఖం చాలా చెత్తగానో  , దరిద్రంగానో ఉంటుందనీ తమకే ఒక అభద్రతా భావం ఉండటం. ఆ మొహం చూస్తే తనతో ఎవ్వరూ స్నేహం చేయరు అనే దిగులు / భయం ఉండటం.
  నేను రెండు రకాల భావాలున్నవారినీ సమానంగానే చూస్తున్నాను.
 మొదటి రకంతో పెద్ద డేంజర్ లేదు కానీ , రెండో రకం వారితోనే కొన్ని ప్రమాదాలు.
 తమ ముఖం బావోలేదు అనుకునేవాళ్ళు , దాన్ని accept  చేసే రకాలు ఉంటారు , depressedగా ఉండేవాళ్ళూ ఉంటారు.

వీళ్ళ గురించి చెప్పబోయే ముందు, ఈ కోవలోనే కనిపిస్తూనే ఏ కోవకు చెందని వారు ..అంటే EXEMPTIONSను చెప్పుకోవాలి కదా. వీళ్ళకు తమ ముఖం గురించి కానీ , appearance గురించి కానీ ఏ పట్టింపూ ఉండదు. నిజజీవితంలో కూడా చూస్తామే, నలిగిన బట్టలు ,చెదిరిన జుత్తు ఏమీ లెక్క చెయ్యకుండా హుషారుగా తిరిగేసే happy-go-lucky రకాలు. అందుకే తమకు నచ్చిన ఏ చింపాజీ , గ్రహాంతరవాసి , హీరోయిన్ ,  తమాషా వస్తువు, కార్టూన్, ష్హిరిడీ సాయిబాబా ..ఏదో ఒకటి పెట్టుకుని , తమ మూడ్‍ను అనుసరించి ఆ బొమ్మలు మారుస్తుంటారు. పైన చెప్పిన 2వ రకానికీ వీరికీ తేడా ఏమిటంటే : వీరు కార్టూన్ నుంచి సైన్సు నుంచి గణిత శాస్త్రఙ్ఞులు లేక దేశ నాయకులు లేక వ్యాంపులు..ఇలా ఒకదానికొకటి సంబంధం లేని రకం ఫోటోలు పెట్టుకుంటే , అభద్రతా భావం ఉన్నవారు మాత్రం ఎప్పుడూ ఒకే styleను అనుసరిస్తారు. అంటే ఎప్పుడూ hallmark / annegeddes లాంటి సైట్ల నుంచి వచ్చే గ్రీటింగు కార్డు బొమ్మలాంటి cute / romance అనిపించే బొమ్మలే పెట్టుకునే రకం. అంటే తాము cute / romantic అనీ , కానీ ఆ విషయం తమ ముఖారవిందాల్లో గోచరించదనీ సదా బాధలో ఉంటారని పి.సైకాలజీ. అల్లు అర్జున్, హృతిక్ రోషన్ , ఆర్నాల్డ్...ఇలా అందరూ కండలవీరుల ఫోటోలు , తప్పితే జేమ్స్ బాండ్ , గాడ్  ఫాదర్‍..ఇలా "మగాడు" అనిపించుకునే ఫోటోలు పెట్టుకునే మగవాళ్ళలో ఏం insecurity ఉంటుందే ఇక వివరించక్కర్లేదు కదా. ఇక రవివర్మ లేక బాపు చిత్రణలో ఉండే ప్రౌఢల బొమ్మలు పెట్టుకునేవారికీ తమ సొంత feminity మీద అనుమానమేమో అనిపిస్తుంది. ఇంకా ఉదాహరణలు అనవసరం , ఎవరికి వారు అర్థం చేసుకోవచ్చు.
 ఏతావాతా నే చెప్పొచ్చేదేమంటే...పాపం , ఆత్మవిశ్వాసం లేనివాళ్ళు తమ ముఖాలపైన ఆ విషయం పచ్చప్పొడుచుకున్నట్లు , ఇలా బహిరంగంగా తమ low esteemను ఎందుకు తెలియజేసుకుంటారా అని!!! గొప్ప తెలివిగలవాళ్ళు కూడా under-confidenceతో నలిగిపోవడం ఎప్పటికి ఆగుతుందో మరి.

గమనిక : ఏమైనా చెబితే " మరి నీ సంగతేమిటి? " అని చెప్పినవాడి పీక పట్టుకునే కాలాల్లో ఉన్నాం మనం. నేను ఒక్కోచోట ఒక్కోరకంగా ఉంటాను. కానీ ఏ బొమ్మ వాడినా , అది ఖచ్చితంగా "ఇది నేను" అని తెలిపేట్లే ఉంటుంది. ఉదాహరణకు నా గ్రాఫిటీ : ఒక పందిపిల్ల షేపులో ఉంటుంది. పరీక్షగా చూస్తే అర్థం అవుతుంది అది నా ఐడీకు అర్థం అని. ఆ ఐడీ ఒక కంపెనీ పేరులాంటిదని . అంతేకానీ నేను పందికంటే అందంగా ఉంటాననో / ఉండననో కాదు!!!!!

Tuesday, September 07, 2010

వానొచ్చినప్పుడు ఆమె కోరిక

కిటికీలోంచి వానను చూస్తున్నాడు అతను. జల్లు దెబ్బలకు మట్టి వాసనతో వెర్రెత్తిస్తుంటూ అరచేతులు వెచ్చబరచుకున్నాడు. ఈ వర్షంలో ఒక అందమైన అమ్మాయి డ్యాన్సు చేస్తూ కనిపించదెందుకో , సినిమాల్లో చూపించినట్లు , అనుకున్నాడు అతను. స్త్రీ ఊహ పుట్టగానే ఆమె గుర్తుకు వచ్చింది. సెల్‍ఫొన్ అందుకుని ఆమెకు డయల్ చేసాడు.
" మీ దగ్గర కూడా వర్షమా ? " ఫోన్‍లో ఆమె మాటే కాల్చిన మొక్కజొన్నలా రుచించింది అతనికి.
"శబ్దం వినబడట్లేదా ? " చెవికి చినుకులు తగులుతుంటే కిటికీకి దూరం జరిగాడు అతను.
"ఊ...ఫన్నీ.. ఇక్కడ మా దగ్గర వర్షం సౌండు, ఫోనులో మీ వర్షం సౌండూ..డీటీఎస్ ఎఫెక్ట్‌లా ఉంది " నవ్వింది
" నీ మొహం ..నీ వర్షం నా వర్షం ఏంటీ ? అంతా ఒకటే కదా "
"లేదు మీ ఊరి మబ్బులు వేరు కదా"
"సరే ఆర్గ్యుమెంటెందుకు కానీ..ఏం చేస్తున్నావ్ ?"
" ఏంలే! చూస్తున్నాను. వర్షాన్ని "
ఆమే , తనూ కలిసి తడిస్తే బావుంటుంది కదా అని ఊహించాడు అతను. మబ్బులకున్నంత దూరం వారివురి మధ్య.
" ఓయ్.. నాకో చిన్న విష్ " గుసగుసగా అడిగింది ఆమె.
" ఆఙ్ఞాపించండి మహరాణీ " అల్లరి చేసాడు అతను.
" రేపూ ఎల్లుండీ కూడా ఇలానే వానలు పడ్తాయట"
"అవును..న్యూస్‍లో విన్నా"
" ఇక్కడకు రాకూడదూ ? "
"వస్తే...?" ఆమె గొంతులో శృంగారం హోరుమని కురుస్తుండటం అతను కనిపెట్టేసాడు.
" నాకు..నాకూ.. "
"నాకకుండా చెప్పు "
నవ్వుతో కొట్టింది ఆమె. " నాకు సిగిరెట్ త్రాగాలని ఉంది "
"వ్వాట్ ? " అతనికే ఆ అలవాటు లేదు. వాళ్ళ మధ్య ఎప్పుడూ ఆ ప్రసక్తే రాలేదు.
" ఏమో..ఎప్పుడూ సినిమాల్లో చూట్టమో , రోడ్ మీద మగాళ్ళను చూడటమే కానీ ఎప్పుడూ ఎక్స్‌పీరియెన్స్ చెయ్యలేదు కదా. ఒకసారి ట్రై చేద్దాం అని ఉంది. ఈ వర్షంలో అలా పొగ ఊదితే ఎలా ఉంటుందో.." మాటలను ఊహల్లోకి వదిలేసింది ఆమె.
 " హ్మూ..బానే ఉంది. ఎవరైనా బ్యాడ్ హాబిట్స్ మానెయ్యమంటారు. నువ్వేంటీ ఎంకరేజ్ చెయ్యమంటావ్ ?" అతనికి చిత్రంగా ఉంది.
"నీకేం బాబూ అబ్బాయివి. ఎక్కడైనా ఎప్పుడైనా కొనుక్కోగలవ్. నేనసలు ఎక్కడ కొనగలను ? కొన్నా నీలాగా ఫ్రీగా రోడ్ మీద వెలిగించలేను కదా..  ఆమె ఏమిటేమిటో చెప్పుకుపోతోంది.
 ఆమె అమ్మాయి అయినందుకు "పాపం" అనిపించింది అతనికి. మొట్టమొదటిసారిగా !

Monday, September 06, 2010

కులం మతం ప్రాంతం దేశం..తొక్కా తోలూ మట్టీ మశానం !!!!

 సరే నేనెప్పుడూ ఇండియా బోర్డర్ దాటినవాడిని కాదు...కానీ నాకు తెలిసినంత అవగాహనలో ఇది రాస్తున్నా..
మనవాళ్ళకో ప్రత్యేకత ఉంది అనిపిస్తోంది.

ఇక్కడ మనవాళ్ళు = we, the indians

(అసలు ఈ "భారతీయులు" అనేదే mythical పదమేమో అనిపిస్తుంది.
ఏవేవో దేశాలు...కళింగ, కురు, చోళ , మాండ్య , పల్లవ, శిఖ్ , మరాఠా...అబ్బో ఎన్నెన్నో దేశాలున్న ఈ ఉపఖండంలో అరబ్బులు, యూదులు , ఫ్రెంచి , పోర్చుగీసులు ఎందరెందరో దాడి చేసాక , చివరాఖరికి బ్రిటిషువాళ్ళ పరిపాలనలో బోర్డర్లు గీసుకుని భారత దేశం అనిపించుకుని, మళ్ళీ పాకిస్తానూ , బంగ్లాదేశమూ విడి ఇప్పుడు ఒక మ్యాపు వేసుకుంటున్న మనకు అసలు "భారతీయులు" అనే identity ఎలా నప్పుతుందో నాకు అర్థం కాదు )

ఆ...మనవాళ్ళు... ఏ బెంగాలీ వాడో బ్రిటన్‍లో కోటానుకోట్లు సంపాదించి ప్రపంచ ధనికుల్లో ఒకడైతే చాలు " అయ్..అదీ మన ఇండియన్ పవర్ " అంటారు. ఒక కర్నాటక అబ్బాయి ఏ ఆటలోనో గెలిస్తే... " మా south indian తడాఖా" అని జబ్బలు చరుచుకుంటారు. అదే హైద్రాబాద్ అమ్మాయి ఎందులోనో ఛాంపియన్ అయితే " ఇదీ మన రాష్ట్రపు ఆడపడుచుల ప్రతిభ " అని కాలరెగరేస్తారు. మళ్ళీ ఓ తమళ ముస్లిమో ఆస్కారు కొడితే.." వాడురా భారతీయుడు అంటే" అని టపాకులు పేల్చుకుంటారు.మళ్ళీ తమ జిల్లావాడు పేద్ద..హీరో అయితే " మా జిల్లా రక్తం" అంటారు.  వాళ్ళ కులం మనిషి ఏదైనా సాధిస్తే " అందుకే మా కులం గొప్పది " అంటారు.
 ఎవ్వడైనా సక్సెస్ అయితే చాలు.. ఏదో రకంగా వాడిని కలుపుకోవాలి...దేశస్థాయిలోనో, ప్రాంతస్థాయిలోనో, రాష్ట్రస్థాయిలోనో, జిల్లాలెక్కనో,కులంలోనో..... success అయినవాడు ఎలా అయినా "మనవాడే"

లేకపోతే మాత్రం.. వాడు పరాయి....
ఈ మధ్య ఒకటే కులాల గొడవలు , ప్రాంతీయ విభేదాలు చూస్తుంటే అనిపిస్తోంది... చిన్నప్పుడు స్కూలులోనూ....ఇప్పుడు కూడా టెన్త్ / ఇంటర్ కాలేజీల్లో....70% మార్కులో ఏదో కటాఫ్ పెట్టుకుని ఆ పై వచ్చినవాళ్ళందరినీ " A" అనే సెక్షను వేసి...మిగతావారిని బీ లు సీలు అని విభజించి పోటీ పెడతారు..
ఇదేదో దేశస్థాయిలో పెడితే బావుణ్ణు... పిల్లాపీచూముసలీముతకా అంతటికీ ఒక కామన్ ఎంట్రన్స్ పెట్టి , అన్ని రాష్ట్రాలూ,కులాలూ,మతాలూ కలిపేసి "successful" "not-successful" అనే రెండు తెగలు చాలేమో!!

 ఏదో.. నా పిచ్చి ఆలోచనే కానీ... ఈ మాట రాసిన నా పుట్టుకనూ, వంశ/జాతి మూలాలనూ వెతికి మరీ తిట్టరూ... నేను success అయ్యేవరకూ!!!!

Saturday, August 28, 2010

my review about chalam's AMEENA

"చలం " గురించి కానీ , అతని ( ఆయన / గారు అని నేను అనను .
సమీక్షించేటప్పుడు కోర్టులో జడ్జీ అంత నిష్పాక్షికంగా వ్యవహరించాలి కనుక,
మర్యాద మొదలెడితే విమర్శ నిఖార్సుగా రాదు కనుక)  రచనాశైలి గురించీకానీ,
philosophy గురించైనా ఇవ్వాళ నేను రాయడం అంటే ఒకట్రెండు జీవితకాలాల
లేటుగా జరుగుతున్న వ్యవహారం. కానీ నేను చదివిన అతని రచనలు కొన్నిటిని
గూర్చి సమీక్షలూ, విమర్శలూ గట్రా చదువుదామని మూడునాలుగు సంవత్సరాలుగా
గూగుల్‍లో చూస్తున్నా ఎప్పుడూ ఏవీ కనపడలేదు. కొంచెంలో కొంచెం మైదానం
గురించైతే వాడివేడి discussions , arguments జరిగాయ్ తప్పితే. నాకు అర్థం
అయినంతలో , అర్థం చేసుకుంటూ చెబుతున్న అర్థాలే ఈ సమీక్షలనీ ,
విభేదించేవారు బాహాటంగా తిట్టిచ్చని confess  చేస్తూ...మొదటగా " అమీనా"
గురించి :
   ఒక్కమాటలో కథ గురించి చెప్పాలీ అంటే ,
 "పన్నెండూపదమూడేళ్ళా బాలికపట్ల ఆకర్షితుడై ఆ అమ్మాయి కోసం తపించిన ఒక మగవాడి కథ"
 ఇలా ఇంత క్లుప్తంగా చూస్తే , ఇదేదీ అనైతిక సంబంధం గురించి , అసాంఘిక
అక్రమ వ్యవహారమనీ ,tale of perversion in lust అనీ , pedophilic themes
అనీ...ఎన్నో రకాలైన వెగటు భావాలు తోస్తాయి. సరిగ్గా , ప్రపంచ
ప్రసిద్ధిపొందిన "LOLITA" నవల కూడా ఇదేలాంటి కథాంశంతో అప్పట్లో (1950s)
సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఈనాటికీ ఆ నవలగురించి మంచిగానూ
చెప్పొచ్చు, చెడుగానూ చూడొచ్చు అని interpretations  జరుగుతూనే ఉన్నాయి.
కానీ , సాంస్కృతికంగా అంతగా బరితెగించని , పరాయి దేశస్థుల పాలనలో ఉన్న మన
దేశంలో దాదాపు ముప్ఫై ఏళ్ళ క్రితమే అదేలాంటి నవల వచ్చి ఉంటే మనం
దాన్నిగురించి అట్టే analyze  చేసుకోకపోవడం చాలా విచారకరం.
     కథా వస్తువు నేను పైన చెప్పిన ఒక వాక్యంలో ఉన్నదే అయినప్పటికీ , ఆ
కథను వ్రాసిన తీరు , పాత్రలను సన్నివేశాలను మలచిన తీరు చూస్తే ఈ నవల చాలా
వరకూ abstractగానే ఉంటుంది.
 కొన్ని పాత్రలకు అసలు పేర్లు ఉండవు, వారి ముఖాలూ , పర్సనాల్టీల గురించి
అట్టే వర్ణనలు లేవు . అసలు కథ జరిగే ప్రదేశం గురించైనా విపులంగా
చెప్పలేదు .  కొన్ని పాత్రల పేర్లు తక్కిన చలం రచనల్లో లాగానే మారుపేర్లు
రహస్యాలు. నిజానికి అయినా అబద్ధానికి అయినా భావం ఉంటుందే కానీ రూపం ఉండదు
అన్నట్లేమో  , కథ చెప్పడంలో రూపాలగురించి వివరాలు చెప్పకపోవడం వలన భావం
మాత్రమే ఆవిష్కరింపబడి భరించలేనంత impact  కలిగిస్తుంది.
 కథ detailed synopsis :
  ఎందుకో ఏమిటో కానీ , కథానాయకుడు ( అది చలమో లేక మరొకరో తెలీదు) ఒక
ఊర్లో , తన స్నేహితులతో ఉంటాడు. అతని narrationలో సాగే కథలో , అతనితో
పాటు ఉన్న స్నేహితులు రకరకాలవాళ్ళు. కొందరు వస్తుంటారు . కొందరు
వెళ్తుంటారు . 1970s లో ప్రాచుర్యం పొందిన హిప్పీల్లా అనిపిస్తుంది వాళ్ళ
జీవనశైలి, ఇవ్వాళ 2000s దాటిన మన మనస్తత్వంతో చూస్తే. కాకపోతే హిప్పీలు
తిరుగుతూ ఉంటారు. వీరు ఒకచోట ఉండిపోతారు. వీరి స్నేహితుల్లో కొందరికి
ప్రేమ సమస్యలు ఉంటాయి. అది అక్రమమో సక్రమమో తెలియని , తేల్చుకోలేనట్టివి.
కథానాయకుడికీ చాలామంది స్త్రీ-స్నేహితులు. వాళ్ళల్లో అతనికి కొందరంటే
ఇష్టం ఉంది, ఇంకొందరంటే ఇష్టం పోయింది. దాదాపు ఇలా polyamorousగా
"దినానికి ఇరవైనాలుగు గంటలూ చాలని " రోజుల్లో , "మొండిగోడల" ఇంట్లో
బ్రతికేస్తున్న అతనికి ఒకరోజు , ఊరిచివర పాకలో ఉండే ముస్లింల ( చలం భాష
ప్రకారం అయితే తురకల... ఇవ్వాల్టికంటే ఆరోజుల్లోనే ఫ్రీడం ఆఫ్
ఎక్స్‌ప్రెషెన్ ఎక్కువేమో ) అమ్మాయి పరిచయమౌతుంది. ఇతను అన్నా, ఇతని life
style నచ్చిన ఆ అమీనా అతనితో వచ్చేస్తాను అంటుంది. అన్నం లేక చాపలు
కాల్చుకు తినే ఆ అమ్మాయిని , అన్నం చేసుకునే ఓపికా , ఆసక్తీ లేక హోటలు
అన్నం తెచ్చుకుని తినే తమ జీవనశైలిలోకి ఆహ్వానిస్తాడు కథానాయకుడు. ఆ
అమ్మాయి మాట , తీరూ మాత్రమే కాదు పాట కూడా నచ్చుతుంది అందరికీ. అమీనా పాట
వినాలనీ , ముఖం చూడాలనీ సరే అంటారు అందరూ.సేవకురాలిగా అతని దగ్గర
ఉండిపోతుంది. అది డబ్బు , జీతం కోసం చేసే ఉద్యోగంలా చేసే సేవ కాకపోగాట ,
ప్రేమతో చేసే సపర్యలలా ఉంటాయి.  అతనికోసం "జీవం" , విమల, శ్యామల,
సుబ్బులు ఇలా ఎందరో స్త్రీలు వస్తూ పోతూ ఉంటారు. వాళ్ళందరూ అతనికి ఇష్టమే
కానీ , అతనిలో ఏదో అసంతృప్తి. ప్రేమ చాలదన్నట్లు , ఇంకా కావాలన్నట్లు. ఆ
వచ్చే స్త్రీలు ఇతడిలో ఏదో ఆశిస్తూ ఉంటారు లేదా ఇతనే వారి నుంచి ఏదో
ఆశిస్తూ ఉంటాడు. కానీ ఏదీ ఆశించకుండా అమీనాను మాత్రం చూస్తే చాలు , ఆ
అమ్మాయి పక్కన ఉండి కనిపిస్తూ వినిపిస్తూ ఉంటే చాలన్నట్లు ఉంటాడు. ఎంత
ప్రవిత్రంగా ఉండజూసినా శరీరంలో రేగే కోర్కెలు , మనసులో ,ఎగసే వికారాలు.
అవన్నిటినీ ఇంకే స్త్రీ పైనో చూపించదలుస్తాడు కానీ , అమీనా దగ్గర మాత్రం
పసివాడిలానో , తండ్రిలానో మాత్రమే ఉండబుద్ధేస్తుంది.  వయస్సుకూ,genderకూ
అంటని ,అసలు ఇదీ అని చెప్పలేని "relationship"లో అతను రగిలిపోతుంటే అసలు
అతనికీ మిగతావారికీ ఉన్న సంబంధం ఏమిటో define చెయ్యమనీ నిరంతరం పోరుతూ ,
చూఛాయగా తనూ ఒక నిర్వచనాన్ని కోరుకుంటున్నట్లు తెలియజేస్తుంటుంది అమీనా.
అలా నిర్వచించ ఇష్టపడని అతని నుండి ఆమె దూరమౌతుంటే ఆమె కోసం అర్రులు
చాస్తూ , అసహాయంగా మిగిలిపోతాడు అతను.
  ఇది , చదివితే తెలిసే కథ. అరటిపండు వొలిచి నోటికందినట్లు అర్థమయ్యే
కథ. కానీ చలం రచనాశిల్పంలో  దాగి ఉన్న కథ మరొకటి ఉంటుంది. ఈ అమీనాలో ఆ ,
hidden story ఏమిటంటే : its a story of man's (or human's) relationship
with "change". మార్పు అంటే ఇష్టపడని మనిషి , మార్పు లేనిదే జీవితం లేదనే
సత్యం తెలిసీ ఆ మార్పుకు దూరంగా ఉండాలని వెర్రిగా యత్నించీ చుట్టూ
ప్రపంచం అంతా మారిపోతుంటే తనొక్కడూ మారిపోకుండా ఉండిపోవడమూ మార్పే
అవుతుందని తెలుసుకోలేక అనాధగా ,అభాగ్యుడిగా మిగిలిపోవడం themetic
elementలా అనిపిస్తుంది. ప్రపంచాన్ని ఒక ఆడదానిగా చూపించినట్లు
తీసుకుంటే, ఈ కథ:
          ఆడదాన్ని ప్రేమించకుండా ఉండలేని ఒక మగవాడు , ఒకరి కంటె ఎక్కువ
మంది ఆడవారే తనకు దగ్గరవుతున్నా వారు తన నుంచి "ఏదో" ఆశించడం గ్రహించగానే
ఆ బంధంలోని unconditionality నశించడంతో ఆ ఆడదాన్ని ద్వేషిస్తూనే
ప్రేమిస్తూ ప్రేమిస్తూనే ద్వేషిస్తూ , అసలు ఇదంతా స్త్రీ బుద్ధి అని
స్త్రీ జాతినే ద్వేషించకుండా ప్రేమించలేని పరిస్థితుల్లో ఉండగా.
    ఇంకా స్త్రీ కాని/ స్త్రీ అయ్యే పరిణామంలో ఉన్న ఒక అమ్మాయి అతనికి
తారసపడుతుంది.
 ఆమె స్త్రీగా వికసించేలోగా ఆమె పట్ల ఆకర్షుతుడయ్యే అతను. అతని ఆకర్షణ,
ప్రేమ నిలబడేలోపలే స్త్రీ గా మారిపోయే ఆమె.
    గొంగళిపురుగు సీతాకోకచిలుకగా మారే  moulting-stageలో ఉన్నప్పుడు ,
ఎటూ కానీ ఆ జీవిని ప్రేమిస్తే.. ఆ ప్రేమ ఎంత క్షణికం. అసహ్యంగా
కనిపించినా ఇష్టపడిన పాత రూపు ఉండదు , అందమైన కొత్త రూపు నచ్చదు.
 ఇదీ క్లుప్తంగా కథ.  గొంగళిపురుగు సీతాకోకచిలుక పోలిక , నా సొంత
analogy అయినప్పటికీ , చలం వర్ణనల్లో ఆయన ఉద్దేశ్యం అదే అని బలంగా
అనిపించింది. మొదటి సారి అమీనాకు ఆకర్షుతుడవ్వడం , ఆమె అతనికి
గుర్తుకురావడమూ... బురదలో , దుమ్ముకొట్టుకుపోయి, మురికిగా ఉన్న పిల్లగా
కనిపిస్తుంది. అప్పుడే ఆమె అతనికి నచ్చుతుంది. కానీ ఆమె అతడిని విడిచి
పోయేప్పుడు మాత్రం, అతని దగ్గరే తీసుకున్న డబ్బుతో కొనుక్కున రెండు గజాల
కొత్త పరికిణీ. అది చాలటం లేదు అని complain చేస్తూ పోతుంది..ఒక అందమైన
ఆడపిల్లలా. అతడి దగ్గరే పీడించి తీసుకున్న డబ్బుతో అలా మారిపోవడం అంటే ,
ఆ మార్పుకు అతనే కారణం అని చెప్పజూడడం కావొచ్చు.
 ఏది ఏమైనా ఇలా ఆలోచించిజూస్తే , 1928లో చలం ఈ రచన చేసేందుకు మూడు
సంవత్సరాల క్రితమే జెర్మ రచయిత Franz Kafka అద్భుత సృష్టి అయిన THE
METAMORPHOSIS చలం అంత త్వరగా ( అంటే మూడు సంవత్సరాలలో ఆ కథ జెర్మన్
నుండు తర్జుమా అయి మన దేశానికీ వచ్చి ఉంటే )చదివి , అందులోని " మార్పు
కలుగజేసే భయాన్ని " poeticగా , శృంగారభరితంగా ఆలోచించి అమీనా రచించాడా
అనిపిస్తుంది. కాకపోయి ఉండొచ్చు కూడా , గొప్ప మనుష్యులు గొప్ప ఆలోచనలు
ఏకకాలంలో చేయడం చరిత్రలో నిరంతం జరిగేదే. విచిత్రం ఏమిటంటే లోలితా
వ్రాసిన నొబొకోవ్ కూడా మెటామార్ఫొసిస్‍ను క్షుణ్ణంగా analyze చేసినవాడే.
 ఇక అమీనాలోని వాక్యాలూ , అందమైన పోలికలూ :
 అబద్ధాలు చెప్పేవారిని ఎత్తిపొడుస్తూ ,
"వాళ్ళు పది గజాలు తమ మధ్య కొలుచుకు కూర్చున్నారు ,ఆరుగజాల పొడుగు ఎటూ లేని గదిలో "
ఒక స్త్రీలోని selfishnessను వివరిస్తూ : "నేనేమైపోతాను " అనేదే ఆమె
ప్రశ్న. "నేనున్నాను" అంటాను, ఆ మాటే పట్టట్లేదు . అనాల్సిన మనిషి
అనట్లేదనే బాధే కానీ అనేవాడిని నా గురించి ఆలోచించదే.
 "స్త్రీ జనం మీద ఒళ్ళు మండుతోంది" అనేంత స్త్రీ ద్వేషంతో పీడింపబడే
సమయాల్లో ప్రేయసిని అతను వర్ణించడం : "నా రతీదేవి , నా కాళి నన్నే బలి
కోరుతోంది"
"అమీనా నువ్వూ స్త్రీవేనా ? " "బలి కోరుతున్న విధి వెయ్యినాల్కలలో
ఒకదానివి" "girls girls everywhere, not a lip to kiss "(బహుశా ఈ వాక్యం
ఈ ఆంగ్ల కవితలో ప్రాచుర్యం పొందిన water water everywhere ..ప్రయోగానికి
అనుసరణ కావొచ్చేమో ) , ఇలాంటి ఒంటరితనపు , ప్రేమరహిత నిముషాల్లో
రగిలిపోతున్నప్పుడు , "దౌర్జన్యం చేస్తే " (rape) అనే ఆలోచన కలగడం , కానీ
మంచీ చెడులను బేరీజు వేసుకుంటూ, అసహాయంగా మిగిలిపోతూ"విరహం మనసులోకి
జెర్రులను పిలుస్తోంది" అనుకున్నా "హృదయాలు అంధకార సొరం
మార్గాలు..తేళ్ళు, జెర్రులు, బొద్దింకలు, బురద, మధ్యమధ్య మిణుగురు
పురుగులు, తవ్వగా తవ్వగా దొరికే మణుల పొడి" అంటూ మంచితనాన్ని
నిలబెట్టుకోవడం , అలాంటి సమయాల్లో ఒక వేశ్య అతడిని కవ్వించిజూసి ,
తానున్నాని సూచిస్తూ దగ్గిన సందర్భాన్ని చెప్పిన పద్ధతి :
"దగ్గు ఆడదగ్గు రమ్మని దగ్గు డబ్బు కావాలని అడిగే దగ్గు
ఆకలి.ఆశ. అవసరం.
నా ఆకలి-నా ఆస్తి - నా జాతి - నువ్వు - నీ జేబులోని పర్సు.
వెడితే.
నా నూన్యత , నా బాధ , నా అగ్రహం
స్త్రీ జాతి మీద క్రౌర్యం - ఈమె మీద చూపితే - ?
అసహ్యించి , చించి , నలిపి"
 ఇక ప్రకృతిని వివరిస్తూ.. "  ఏటి పొడవునా రక్తం కారే సాయంత్రాలు"
"మిణుగురుపురుగుల గొడుగు కింద.." లాంటి వాక్యాలు ఆ జీవితంలోని
romanticismను అసూయపడేంతగా వర్ణిస్తే ,
"వెర్రి అమీనా పిల్ల చూపుల అమీనా ,పిచ్చి అమీనా, తిరక అమీనా, చింకిరి
అమీనా " అయినా ఆ అమ్మాయి కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంటే
"ఎన్ని ఆల్టర్నేటివ్స్ యోచించుకున్నా , జీవితం మనిషిని ఆశ్చర్యపరచగల
కార్ద్ ను చూపించి నవ్వుకుంటూనే ఉంటుంది" అంటూ క్రూరమైన విధిని తల్చుకుని
భయపడుతూ , ""ప్రేమలోకంలో దిక్కుమాలిన బిచ్చగాళ్ళం
దెబ్బతిన్న గుడ్డివాళ్ళం- అనాధలం- అంధకారులం -
ప్రేమని నిరసించే నేను
ప్రేమను ఆశించే అమీనా" కనిపించకపోయిన క్షణం అతను వెర్రిగా వెదికివచ్చి
ఆమెను చూసుకోకుండా తన ఇంటి గుమ్మంముందే చీకట్లో తొక్కేసినపుడు , ఆ
బాధలోనూ ఆ అమ్మాయి అతని కాళ్ళను కౌగిలించుకోవడం , "కన్నీళ్ళు - ఎక్కిళ్ళు
వేళ్ళు - ఒకళ్ళ చుట్టూ ఒకళ్ళ వేళ్ళు - వేళ్ళ మధ్య వేళ్ళు - పెదమల మధ్య
జుట్టు - రెప్పల మధ్య నీళ్ళు" ఇలా కలయిక-ఎడబాటుల్లో కరిగిపోతూ అతని బాధ
"గట్లు లేని స్వేచ్ఛ మహా భార"మని విచిలుతుడవడం ...ఆ "ఎదగని నౌకరు కన్య"
కు,  పరుల దృష్టిలో"ఆ తెలివిగల అందమైన పిల్ల" ఇక రాదు అనిపించినపుడు
అతనిలో కలిగే మొదటి ఆలోచన "టీ ఎట్లా త్రాగను " అవడం , ఇచ్చేవారూ ,
పెట్టేవారూ ఎందరున్నా ఆ అమీనా లేనిదే రుచించదన్నట్లు, రెండు రూపాయలిస్తే
రెండు గజాల పరికిణీనే వచ్చింది , వొంటికి చాలట్లేదు అంటూ
ఎదిగిపోతున్నానని చెబుతూ ఆ అమ్మాయి వెళ్ళిపోవడం.... అన్ని సన్నివేశాలూ
దృశ్యకావ్యాలూ , హృదయాంతరాలను కదిలించేవీ, తూట్లు పొడిచేవీ , కన్నీళ్ళతో
నింపేవీను.
 కథాంశం నచ్చనివారయినా ఈ రచనాశిల్పం కోసం చదవవలసిన నవల. చెప్పడం ద్వారా
ఎంత తెలియజేయొచ్చో , చెప్పకపోవడం ద్వారా పాఠకుల మనస్సులో ఎన్నో ఊహలను
రేకెత్తించి ఆ ఊహలన్నిటినీ కొద్ది వాక్యాలలో తన ఊహతోనే కట్టించుకుని తన
వెంటే లాక్కుపోవడం రచయితగా చలం ఈ అమీనాలో అద్భుతంగా చేసిన విన్యాసం.

పోగొట్టుకున్న పుస్తకం

లైబ్రెరీలో పారేసుకున్నాను ఆమెను
అట్ట మీద పేరు లేదు
విప్పారిన నవ్వు తప్ప
ఒంపులు లెక్కెడితే పుటలు అనంతమే
చివరి పేజీ లేని పుస్తకమా
ఏ అరలో అమర్చాను నిన్ను ?
కాలం నీ అంచులకు పారాణి అయితే
అరికాలిక్రింద సుఖపడే భూమిలా ఒద్దుకుహత్తుకుపోతా
అక్షరాలన్నీ భావాలే అయితే
వ్యాకరణాలను దాటి చదవడం రాదే నాకు
పువ్వులతో పేజీలను ఆపుతా 
ఆగవా కాసేపైనా

లైబ్రేరియన్ నవ్వుతాడా నవ్వనీ
పాపం ఇంకో మనిషి
పుస్తకాల్లో ఎంత మగ్గినా పుస్తకం కాలేని మనిషి
పాపం
చాలిక చెలికత్తెల చాటున నీ దాగుడుమూతలు
మూగదానివైనా పిలవరాదా నా పేరును
ప్రయత్నించు , పిలువు ఒక్కసారి
గాలినైనా వినేందుకు నే సిద్ధం

చూడలేనివి నా వేళ్ళు
ముట్టుకోవడం రానివి నా కళ్ళు
అవసరానికి అక్కరకు రానిదీ దేహం
కాగితం లాంటి మనసున్నా
ఎర్ర ఇంకుతో గుండె తన్నుకుంటున్నా
కలల అంపశయ్యపై కలం పట్టుకు కూర్చున్నా
వ్రాయలేను నిన్ను
చదివించుకుపో చాలు
చరిత్రలో గడ్డిపరకగా అయినా మిగిలిపోతాను
 --౦-౦-౦-౦-౦-౦౦-౦-౦-౦-౦-౦-౦-

Wednesday, July 14, 2010

ఏదో చెయ్యాలి , ఎలాగో చెయ్యాలి...ఎలాగో ??

వారం క్రితం చూసిన న్యూసు ఇంకా వెంటాడుతూనే ఉంది.
ఈ టీవీలో చిన్న ఫ్లాష్ లాగ వేసారు, శ్రీకాకుళం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లోని ఒక గ్రామంలో (పేరు గుర్తుపెట్టుకుందాం అంటే ఆ ఫ్లాష్ మళ్ళీ రాలేదు ) దాదాపు 550మంది  నెలరోజులుగా విషజ్వరాలతో బాధపడుతున్నారు. 7కిలీమీటర్లు వెడితే కానీ డాక్టరు లేరట. అక్కడా సరి అయిన వైద్యసదుపాయాలు లేక ఇళ్ళల్లోనీ ఉండి , చచ్చిపోతున్నారట.
 ఏదో ఆటవిక కాలం నాటి జీవితంలా అనిపించిన ఆ వార్త గురించి మరింత తెలుసుకుందాం అంటే మళ్ళీ ఫ్లాష్ రాలేదు. జగన్ యాత్ర అనో , మైనింగ్ కుంభకోణం అనో , టీటీడీ అవినీతి అనో ఫ్లాష్‍లు వస్తున్నాయి. మిగతా ఛానెల్స్‌లో అయితే అసలు ఈ ఊసే లేదు.
  అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అని old  సామెతకు సరి అయిన అర్థం ఏమిటో కానీ , అదే గుర్తుకువస్తోంది. శ్రీకాకుళం నేనెప్పుడూ వెళ్ళలేదు. ఏజెన్సీ ప్రాంతాలు అంటే వినడమే కానీ చూడలేదు. అవి ఎంత మారుమూలవైనా, హైద్రాబాదునుంచి చెన్నై, బెంగుళూరు, ముంబై, అమెరికాల కంటే ఖచ్చితంగా దగ్గరగానే ఉండే ప్రాంతాలు. మరి అంత దగ్గర్లో ఉంటూ, అవి unreachable ప్రాంతాలు ఎలా అయ్యాయీ ? ఎంత రోడ్లు లేకపోయినా , ఏదో ఒక దారి ఉండదా ? న్యూస్ ఐటమే కానీ, వీడియో footage సంపాదించని జర్నలిజం ఏం చెబుతోంది ?
  పెద్దగా ప్రేక్షకుల ఆసక్తిని పట్టలేని న్యూసును అంతగా చెప్పక్ఖర్లేదు , తెలుస్కోవడానికి కష్టపడక్ఖర్లేదు అనా ?
 సరే...మీడియాలూ  , న్యూసులూ , జనాలూ , గవర్నమెంట్లూ అన్నీ తగలడిపోనీ ?
 550మంది అంటే.... చా........లా... ఎక్కువ కదూ ? అందులో పెద్దలెందరో , పిల్లలెందరో , ముసలోళ్ళెందరూ, ఆడాళ్ళూ అందులో గర్భిణులూ ఎందరున్నారో ఏమిటో ? విషజ్వరాలు అంటే ప్రాణాంతకమైనవి.ఈ రిపోర్టరు సరిగా చెప్పలేదు కానీ , అసలవి ఏ జ్వరమో ? malaria, dengue, encephalitis , pyrexia of unknonw origin....ఎన్నెన్నో రకాలు. ఏదో తెలుసుకోవాలంటే సరి అయిన lab and diagnostic facilities కావాలి. drugs like paracetomol , acetaminophen , diclofenac లాంటి symptomatic relief  ఇచ్చేవే కూడా సరి అయిన క్వాలిటీవీ కావాలి. ( ఈ మధ్య ఏదో పేపర్లో చదివా గవర్నమెంట్ హాస్పిటళ్ళలోనూ, ప్రైవేటులో తక్కువ రేటుకు దొరికే ఈ డ్రగ్స్ అన్నీ ఎఫెక్టును కలుగజేసే మోతాదు లేనివీ , పసలేనివీ అని ). తర్వాత , సరి అయిన anti-biotic , antimalarial , antiviral . ఏవో జబ్బునుబట్టి నిర్థారించి అవి ఇవ్వగలగాలి. జ్వరాలతో పాటు విరోచనాలు ఉంటే ringer lacatate, normal saline, metrogyl solutions కావాలి. అవన్నీ administer చెయ్యడానికి , దాచడానికి ఎక్విప్‍మెంట్ కావాలి.
   ఇవన్నీ ఎక్కడ నుంచి వస్తాయి ??
 డబ్బు పెడితేనే ?
లేకపోతే ఏ ఛారిటీ సంస్థవాళ్ళో "దానం" "ధర్మం" చేస్తే.
డబ్బుతో ఈ మెడిసిన్లూ గట్రా వస్తే , తర్వాత అవి ఉపయోగించడానికి డాక్టర్లో , నర్సులో కావాలి. man power.
 so money power and man power is what ultimately lacking.
ఇంతమంది మనవాళ్ళు" "మన" ఆంధ్రప్రదేశ్‍లోని వారూ..అలా నిష్కారణంగా చచ్చిపోతుంటే ...ఆ మనీ , మ్యాన్ పవర్లు ఉన్నవాళ్ళంతా చెత్త మాట్లాడుతూ ఉంటే ,
మనం కూడా ఏమీ చెయ్యలేమా ??

ఏమైనా చేద్దాం అంటే idea  ఇవ్వండి. చేద్దాం. సమీకరిద్దాం. ఈసారికి కాకపోతే మరోసారి ఇలాంటి న్యూస్ వస్తే బయలుదేరుదాం. కానీ...అరకొరా బలంతో కాదు. పూర్తిస్థాయి శక్తి ఉంటేనే ...ఇలాంటివి విజయవంతంగా పూర్తిచేయగలం.
 నేను ఒక చిన్నపాటి ఛోటా ఎంబీబీయస్ డాక్టరును. ప్రాక్టికల్ అనుభవం తక్కువగా ఉన్నవాడిని. ప్రాక్టీసులో లేనివాడిని. అయినా నాకు చేతనైంతలో నా ప్రయత్నం చేస్తాను. సంఘాలు వొద్దు, గ్రూపులు ఒద్దు , స్నేహాలూ , భావజాలాలూ ఒద్దు. objectiveగా , ఇలాంటి సమయాల్లో ఏమైనా చెయ్యగలం అనిపిస్తే ఒక మెయిల్ దూరంలో ఉండండి. ఏం చెయ్యాలో చెప్పండి.. ngoలు, charity నెలకొల్పడాలు వాటిల్లో నాకు నమ్మకం లేదు. కాబట్టి అవి తప్ప.

విపరీతం

తలుపు-లు తెరచే ఉంచా
నువ్వు రావని తెలిసీ
వచ్చేదీ పోయేదీ నా నీడే
ఇంధ్రధనుసు రంగుల్లోది
వానచుక్కల వాసనలది
నీడకున్న పాటి జీవితం లేని శరీరం మోస్తూ
చూస్తున్నా చూస్తున్నా 
సగం నిద్రలో
ఏసీ చలుల్లో దుప్పటి కప్పుకుని
నువ్వొదిలేసిన పరుపులోని ఖాళీని నిమురుతూ
సగం చంద్రుడిని తినేసే ఆకాశాన్ని ఊహిస్తూ
చూస్తున్నా చూస్తున్నా
కిటికీలు తెరుచుకుని
గోడల మధ్య ఇరుక్కుని
ఆత్మవై రాకూడదా
శరీరం ఎక్కడైనా ఉంచుకుని , అమ్ముకుని , చంపుకుని
తగలెట్టుకుని, పాతిపెట్టుకుని
ఙ్ఞాపకమై గుచ్చనేల
ఫోను నెంబరైనా ఈక బ్రతకనేల
చచ్చి ఆత్మ ఐ నా ..రా
గోడలైనా తెరుస్తా.. చాతనైతే

Sunday, July 04, 2010

పెళ్ళాం


పరిచయం :



మొట్టమొదటగా అయితే నచ్చలేదు నువ్వు
ఏముందని మరి స్పెషల్
అందరిలాంటిదే ముక్కూమొహం నవ్వూ
ఎంత టేస్టీ అయినా ఇడ్లీ ఇడ్లీనే కదా...రొటీన్ బోర్
బోర్ బోర్ బోర్

పోనీ ఒక ట్రయిల్ వేస్తే పోలేదా ..
కొలంబస్‍ కోరుకుంటేనే అమెరికా తగిలిందా
నీ ఫోను నెంబరు నొక్కింది ఒక్క వేలే
పెన్నుతో ఎన్నో పరీక్షలు జయించిన ఈ నా గొప్ప చూపుడు వేలు
అందులోని ఆలోచనలు మాత్రం అమావాస్య రాత్రి చుక్కలన్ని
హలో అనాలో హాయ్ అనాలో ఏం అంటావో వినాలో
టెన్షన్ టెన్షన్ టెన్షన్ బాబోయ్ టెన్షన్
ఎంతయినా అమ్మాయి... వే..  కదా
కదా !
కదా!
అవును.. . లే


నిజం మనిషీ ఫోటోలో మనిషీ ఎప్పుడూ వేరువేరే
ఫోనులోని గొంతూ అంతే... నచ్చేట్లే వినిపిస్తుంది
"బిజీగా ఉన్నాను తర్వాత చేస్తాను "
"ఏమనుకోకండీ "
ఇంకేం అనుకుంటానూ ??
 పొగరుబోతుదానా
బావున్నాయ్
గొంతూ , పొగరూ
అయినా... నేను ఎదురుచూట్టమా...
ఇం.పా.జి.బు.ల్.
ఫోటో మళ్ళీ చూస్తే ? ఒక్కసారే


"భోంచేసారా ? "
అమ్మలు మాత్రమే కదా ఇలా అడుగుతారు
బావున్నావ్
 ఇంకొక అమ్మా? నో థ్యాంక్స్
బోర్. ఇడ్లీ. అమ్మ. బోర్. రొటీన్ 
ముఫ్ఫైమూడునిముషాలా ముఫ్ఫై సెకెండ్లే కదా చూసాను
" నేను బిజీ , మళ్ళీ చేస్తాను "
పగ తీర్చుకున్నా
శభాష్‍రా మగాళ్ళ పరువు నిలబెట్టావ్
గుండెలో బీరుకొడుతూ బ్రహచారుల మఠం విజిల్స్

"సరే మీరే చెయ్యండి "
అహం కట్ అయ్యి కోపం చిట్లిన చప్పుడు
నేను చెయ్యను
చూద్దాం , చూసుకుందాం
ఎవరికి ఎవరు ముఖ్యమో
పొగరును జిగురులా దాచుకున్న లావా నేను

                      ( పార్ట్ 2 follows )

Monday, June 28, 2010

అమ్మ కూడా ఒకప్పుడు హీరోయినే !!


తల్లిప్రేమ, తండ్రిప్రేమ, సోదరప్రేమ.... ఇలా ఒక prefix లేకుండా ఉత్తగా "ప్రేమ " ఆడా మగా మధ్య మానసిక శారీరిక సంబంధాలే గుర్తుకువస్తాయి. ఆడామగా మధ్య ఆ ప్రేమే లేకపోతే మనిషికీ జంతువుకీ తేడా లేదు, సృష్టి ముందుకెళ్ళదు. కాబట్టేనేమో ప్రేమ కథలూ , సినిమాలు మెచ్చనివారు చాలా తక్కువమంది ఉంటారు. అయినా ఒక ఆడది , ఒక మగవాడు. ఎలాగోలా తంటాలు పడి ప్రేమించుకుంటారు , ఇందులో conflict ఏముంది అనుకునేవాళ్ళందరూ తప్పక చూడాల్సిన చిత్రం  THE BRIDGES OF MADISON COUNTY

 ప్రేమకథ మొదలవ్వలాంటే ముఖ్యంగా ఒక అందమైన అమ్మాయి కావాలి. అశ్లీలత లేని , దైవత్వం లాంటి , అద్భుతమైన అందం.  ఏ మనిషికయినా తన జీవితంలోని మొట్టమొదటి అందగత్తె , అతని/ఆమె తల్లి. అలాంటి అందమైన అమ్మే ఈ ప్రేమకథలో కథానాయిక. వినేందుకు హృద్యంగా ఉంది కదూ ? కానీ, ఈ కథలో హీరో "నాన్న" కాడు. భరించడం ఎంత కష్టం? అమ్మ అందగత్తే , కథానాయికే , కానీ తండ్రిని కాక మరొకరిని ప్రేమించడమా ? ఎంత మోసం , ద్రోహం ! నాన్నకెంత అన్యాయం జరిగింది , పిల్లలకెంత అవమానం ? అమ్మను ఆడదానిగా , ఒక మృదువైన మనసున్నదానిగా , స్పందనలు ఉన్న మనిషిగా చూడలేనంత అమ్మతనం ఆపాదించిన పిల్ల తరహా possessiveness ఈ ప్రపంచానిది . అలాంటి ప్రపంచంలో ఇరుక్కుపోయిన ఒక స్త్రీ నాలుగు రోజుల పాటు అనుభవించిన అనిర్వచనీయమైన ప్రేమకథ ఈ సినిమా.
      గ్రామీణ వాతావరణం లోని ఒక రైతు భార్య MERYL STREEP . వజ్రాల్లాంటి ఇద్దరు పిల్లలు. ప్రేమగా చూసుకునే భర్త, స్వంత ఇల్లూ, ఆస్తీ అన్నీ ఉన్నాయి. ఒకసారి , పక్కనున్న సిటీలో సైన్సు ఎగ్జిబిషన్‍లో పిల్లలు పాల్గొంటుంటే వారిని తీసుకుని వెళ్తాడు భర్త. నాలుగురోజులపాటు ఈవిడకు ఒంటరితనమే. అలాంటి సమయంలో , పక్క ఊరిలో చారిత్రాత్మక విశేషం ఉన్న ఒక బ్రిడ్జిని ఫోటో తీసేందుకు వచ్చి దారితప్పిపోయిన CLINT EASTWOOD  పరిచయం అవుతాడు. అతనిలోని హుందాతనం ఆమెకు నచ్చుతుంది. ఆమె ఆతిధ్యంలోని ఒద్దిక అతనికి ఇష్టమౌతుంది.  ఆమె ఒక అందమైన వేణువు అయితే , అతను దూకుడైన గాలి వంటివాడు. ఆమె అలలు లేని నది అయితే , అతనొక జలపాతం. రెండూ పరస్పరం కలుసుకోకుండా ఉండలేవు.
  కానీ ఆ కలయికకు ఎన్నో అడ్డంకులు. సమాజం. ఆమె ఉన్న ఊరు ఎంత చిన్నదో అక్కడి మనుష్యులు ఇంకా సంకుచిత స్వభావం కలవారు. ఒక గృహిణి పరపురుషుడితో కనిపిస్తే ప్రపంచం మునిగిపోయినట్లు హాహాకారాలు చేసేవారు. ఈ బాహ్య ప్రపంచం మాటలనుండి తప్పించుకోవచ్చేమో కానీ, మనస్సులోపల తిష్ట వేసుకున్న "కట్టుబాట్లు " అనే ఆలోచనలు మరీ క్రూరమైనవి. ఆమె జీవితం , ప్రేమ ఆమె స్వంతమా ? లేక ఆమె భర్త , పిల్లలు , పక్కింటివారి చెప్పుచేతల్లో ఉందా? ఈ ప్రశ్నలన్నీ వేసుకుంటూ, సమాధానాలు వెతుక్కుంటూ , తమలో తాము కలిసిపోయేందుకు ఆ ఇద్దరు వ్యక్తులు చేసిన ప్రయత్నాలే ఈ సినిమా.  ఈ కథ అంతా చనిపోయిన తమ తల్లి వీలునామా చూసి , ఆమెకు "అక్రమ సంబంధం"ఉందని తలపోచి ఆవిడ వ్రాసుకున్న డైరీనూ ఎంతో కోపంతో , అసహ్యంతో చదివే అక్కాతమ్ముళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో సాగుతుంది. 
   చివరకు ఏమౌతుందో నేను చెప్పడం అంటే చూడబోయేవారి భావోద్వేగాలను నాశనం చేసినవాడినౌతాను కాబట్టి చెప్పట్లేదు.
 తల్లిగా , భార్యగా ,ఆడదానిగా మెరిల్ స్టీప్‍ను ప్రేమించకుండా ఉండటం మగ ప్రేక్షకులకు దాదాపు ఆసాధ్యం. ఆమె నవ్వులు , కంటి చూపులు , కన్నీళ్ళు , గొంతు వణుకుళ్ళు సినిమా చూసాకా చాలాసేపు వెంటాడుతాయి. మధ్యలో రీవైండ్ చేసుకుని చూడాలనిపించేంత hauntingగా ఉన్నాయి.
  క్లింట్ ఈస్ట్‌వుడ్.  నోట్లో చుట్ట పెట్టుకుని రైఫిళ్ళతో కాల్చిన కౌబోయ్ , డర్టీ హ్యారీగా పోలీసులనూ , దొంగలనూ తూలనాడి తూడ్లుపొడిచిన యాంగ్రీమ్యాన్... ఇతనేనా అనిపిస్తుంది. అరవైపైబడిన వయసులో , వడలిపోతున్న శరీరంలో... ఒక రొమాంటిక్ క్యారెక్టర్ వేసి మెప్పించడం..వాహ్!  ఇక ఈ సినిమాకు దర్శకుడూ అతనే . హాలీవుడ్‍లో నటన, స్క్రిప్టు, దర్శకత్వం, ప్రొడక్షన్ , మ్యూజిక్ కంపోజింగ్.... అన్నిటిలో ఏ పనిచేసినా అద్భుతంగా చేసిన అతి కొత్తి బహుముఖ ప్రతిభాశాలురిలో ఇతను అతి ముఖ్యుడు.  ఇలాంటి దర్శకుడూ , నటుడూ ఇక్కడెవరైనా ఉంటే రోజూ పాదనమస్కారం చేసి మరీ అతని విద్యల్లో కాస్త నేర్చుకోవాలి అనిపించేంతటి గురువులా ఎదిగాడు ఈ సినిమాతో ( నా వ్యక్తిగత అభిప్రాయం ,)
   ఈ సినిమాలో ఎన్నో అద్భుతమైన మాటలు ఉన్నాయి, కొన్నిటిని నాకు అనిపించినట్లు free translation చేసి చెబుతున్నాను:
 " నాకు అద్భుతమైన కలలు , కోరికలు ఉండేవి. ఏవీ నెరవేరలేదు. ఈవేళ వెనక్కు చూసుకుంటూ ఆ రోజు ఆ కలలు కనగలిగినందుకే తృప్తిగా ఉంది "
 " ప్రేమ మనం కోరుకున్నట్లు ప్రవర్తించదు.అదే దాని అందమూ , స్వచ్ఛతా "
 " నేను సాధారణమైన ఆడదాన్ని " అని ఆమె అంటే, అతడి జవాబు : " నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు , "సాధారణం " అనే మాటే నీకు తగదు "
  ఇక సన్నివేశాల్లో నాకు బాగా నచ్చింది, క్లైమాక్స్ ఘట్టం. వానను ఎన్నో సినిమాల్లో ఎఫెక్టు కోసం వాడుకున్నారు కానీ , కన్నీళ్ళలో కరిగిపోయి విడిపోయే జీవితాలనూ కారు అద్దంమీద జారిపోయే వాన నీటిని foreground , background లో ఉంచి అద్భుతంగా తీసారు. వాననీటి తెరల్లో మసగ్గా మనిషి దూరమవ్వడం చాలాకాలం నిలిచిపోయే దృశ్యం.
      ముగింపుగా ఒక మాట, ఈ సినిమా ఒక నవల ఆధారంగా రూపొందినా , నవల రచయిత, స్క్రీన్ అడాప్టేషన్ చేసినది , దర్శకుడు , చివరకు ఈ సమీక్ష చేస్తున్న నేను అందరూ మగవారిమే కాబట్టి ఆ మగ దృష్టితో సినిమా నిండిందేమో అని అనిపిస్తోంది. స్త్రీలకు ఈ చిత్రం నచ్చుతుందో లేదో నేను చెప్పలేను .. ఎక్కడైనా పురుషాధిక్య/అహంకార భావజాలపు పాత్రల చిత్రీకరణ ఉందని ఏ స్త్రీ ప్రేక్షకులకైనా అనిపిస్తే వివరించగలరు .

Tuesday, June 22, 2010

బాబోయ్ ఈ సొసైటీ

పేరు గుర్తులేదు కానీ , మూడునాలుగురోజులనుండీ వార్తల్లో నలుగుతున్న విషయం ఇది:
   ఒక స్త్రీ (ప్రస్తుతానికి పేరు X అనుకుందాం ) , భర్త తెగతెంపులు చేసుకోవడంతో ఏ దిక్కూతోచక ఉన్నప్పుడు ఒక మగాడి (పేరు Y అనుకుందాం ) ప్రేమను నమ్మి మోసపోయి వ్యభిచార కూపంలోకి నెట్టబడింది. ఎలాగోలా బయటపడి ఇప్పుడు ఆ సంఘం దృష్టిలో దర్జాగా బ్రతుకుతున్న ఆ మగాడి అసలు రూపం బయటపెట్టడానికి , అతనింటికి వెళ్ళి గొడవ పెట్టుకోబోయింది. ఆ ఊరి పోలీసులు అతని పక్షం వహించి " పోయి వ్యభిచారం చేసుకో ఇక్కడేంటి గొడవ" అన్నారు. పోలీసు అనకూడని మాట అన్నాడని ఆమె మానవహక్కుల కమీషన్‍ను ఆశ్రయించింది. ఆ ఆశ్రయించడంలో మామూలుగా ఫిర్యాదులా కాకుండా , నాకు న్యాయమైనా చేయండి లేక ఆ పోలీసు చెప్పినట్లు వ్యభిచారం చేసుకోవడానికి లైసెన్స్ అయినా ఇప్పించండి అని అడిగింది. ఇంకేముందీ, వార్త సంచలనం. పవిత్ర భారతదేశంలో ఒక స్త్రీ తను వ్యభిచారం చేసుకుంటానని పబ్లిక్‍గా చెప్పడమే ! సెన్సేషన్ చేసేందుకు రెడీగా ఉండే ఛానెళ్ళన్నీ ఆమె చుట్టూ ఈగల్లా చేరాయి.
 ఇంతవరకూ బావుంది. శభాష్. ఆమె ధైర్యాన్ని , పోరాటపటిమను మెచ్చుకోవాలి. మోసానికి గురైన స్త్రీలందరూ ఇంత తెగువ ప్రదర్శిస్తే కానీ కాస్తయినా ఈ (సె)క్స్‌ప్లాయిటేషన్ కేసులు తగ్గవు.
   అసలు వేశ్యావృత్తిని చట్టబద్ధం చెయ్యాలా అనే పాత డిస్కషన్‍ను మరోసారి తెరపై తీసుకురాగల్గిన వార్త.
 ఇలా ఈ వార్త constructiveగా ఏదో మార్పు తెస్తుందేమో అని ఆశించిన నాకు , ఈవేళ కొనసాగింపుగా ఈ వార్త ఎటువెళ్తోందో చూసాక... చాలా భయమేసింది. ఇది సమాజం కాదు. రౌడీరాజ్యం. ఆటవిక న్యాయం మళ్ళీ వస్తోందా అనిపించింది.
  మానవహక్కుల కమిషన్‍కు వివరణ ఇచ్చేందుకు మిస్టర్ X వస్తే , కొందరు మనుష్యులతో అక్కడే కాచుకున్న ఉన్న Y , అతడిని చొక్కా పట్టుకుని చెప్పులతో కొట్టింది. అతను పారిపోకుండా అతని కారు టైర్లలో గాలి తీసేసింది. ఈ సూపర్ యాక్షన్ ఎపిసోడ్‍ను చిత్రీకరించడమే కాక , అక్కడే ఉన్న మీడియా కెమెరామెన్ Y  పారిపోజూస్తుంటే అతని చుట్టూ చేరి , ఆమెకు అతను దొరికేట్లు , మరిన్ని చెప్పుదెబ్బలు తినేట్లు చేసారు.
   మొట్టమొదటిసారిగా నాకు ఆ మగవాడిని చూస్తే జాలి వేసింది. పాపం అనిపించింది. ఇంతవరకూ మనం ఈ స్త్రీ మాటలే విన్నాం. నిజం ఏమిటో objectiveగా పరిశోధించడమో , విచారణ జరిపించడమో జరగలేదు. అతను నిజంగా తప్పు చేసాడో లేదో ఇంకా తేలనే లేదు. ఒకవేళ తేలినా, చట్టప్రకారం అతనికి శిక్ష ఏదో ఉంటుంది కదా. నడిరోడ్డుమీద చెప్పుతో కొట్టడం ఏ శిక్షాస్మృతి ప్రకారం కరెక్టు ? అదీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ? 
   ఈ సొసైటీలో చట్టం పన్జెయ్యడం లేదు అని చెప్పడానికి ఆ మహిళను కించపరుస్తూ మాట్లాడిన పోలీసు ఉదాహరణ కన్నా , కోర్టు ఆవరణలో ఒక వ్యక్తిని చుట్టుముట్టి దాడి చేస్తున్నా కలుగజేసుకోని పోలీసులు, ఆ తర్వాత ఇదంతా వీడియో ఫుటేజ్‍లో ఉన్నా ఆ పని చేసినవారిని అరెస్టు చేయని , కేసు పెట్టని చట్టాలు...
utter failure of system.
  రేప్పొద్దున్న మనం ఎవరైనా మనకు అనిపించనవాడిని ఇలా చితకబాదొచ్చన్నమాట. వీలైతే ఒక ఆడదాన్ని పక్కన పెట్టుకోవాలి , పోలీసులు , చట్టాలు తప్పించుకోవాలి అంటె. అంతే. శిఖండిని అడ్డం పెట్టుకున్న అర్జునుడిలా.
 చట్టం ఏమో కానీ ప్రజలుగా మనం మాత్రం శిఖండులు అవుతున్నాం. 
      

Monday, June 21, 2010

salaam cinema

 సినిమాలు చెడిపోతున్నాయి , పతనమౌతున్నాయి , సమాజాన్ని చెడగొడుతున్నాయి అని చాలాకాలంగా మనం వింటున్న/చూస్తున్న/అంటున్న వాదనలే. కానీ చెడిపోతున్న/పతనమవుతున్న సమాజాన్ని సినిమా ఎలా ప్రతిఫలిస్తోందో అనే ఆలోచనలోని కొన్ని అంశాలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. విభేదించేవారు కూలంకషంగా చర్చిస్తారని ఆశిస్తూ ..
  డెబ్భై, ఎనభయ్యో దశకాల్లో మన ( భారతీయ / ప్రాంతీయ) సినిమాల్లో హీరోలు మధ్యతరగతి కుటుంబ నేపథ్యంలోంచో లేక రోడ్డుమీదబ్రతికే ఆవారాలాంటివాళ్ళో అవడం చాలా సాధారణంగా కనిపించేది. కమర్శియల్ సినిమాల్లో తప్పనిసరిగా హీరోయన్ మాత్రం గొప్పింటి పొగరుబోతులా ఉండేది. కథానాయకుడు లేబర్లను, మురికివాడల్లోని తనవారిని ఎదిరిస్తూ ధనవంతులైన పెట్టుబడిదారీవారిని ఎదిరించేవాడు.  డెమోక్రసీ అంటూ గొంతు చించుకునే మన దేశంలోని సినిమాల్లో ఇంత కమ్యూనిజ భావజాలం ఉన్నప్పటికీ ఆ భావజాలంలోనే అశ్లీల సాహిత్యపు పాటలూ , ముష్టియుద్ధాలూ , కామెడీ ట్రాకులూ జొప్పించి... ఈ కమ్యూనిజం అంతే సినిమాటిక్ రియాల్టీనే కానీ వాస్తవంలో జరగదు అన్నట్లు ఉండేది. అందుకే తాము చేయలేని తిరుగుబాటు కథానాయకుడు చేస్తుంటే ప్రేక్షకులు వాళ్ళను ఆరాధ్యదైవంగా పూజించేవారు.  ఏది ఏమైనా కథానాయకులు ప్రథానంగా పేదవాడు కావడమో లేక ధనవంతుడైనా ఇంట్లోంచి వెలుపలకు వచ్చి పేదల పక్షాన నిలబడడమో హీరోయిజం. ప్రేక్షకులూ ఎక్కువశాతం అప్పుడు పేదవారే కావడంతో (పేదరికం ఇక్కడ రిలేటివ్‍గా చూడగలరని మనవి ), సినిమా రిక్షాకార్మికుడికి సైతం అందే వినోదం కావడంతో ఆ ట్రెండు కొనసాగింది.
తొంభైల్లో వచ్చేసరికి , దేశకాల పరిస్థితుల దృష్ట్యా మధ్యతరగతి జీవితాలు మరికాస్త మెరుగుపడటంతో సమాజసేవ, దీనజనోద్ధరణ కంటే మధ్యతరగతివారికి జీవితంలో కొరవడుతున్న ప్రేమ, శృంగారం (రొమాన్స్ అని నా ఉద్దేశ్యం..పూర్తిస్థాయి సెక్సువల్ కాన్‍ఫ్లిక్ట్స్ ఇంకా మన సినిమాల్లో రాలేదు) తదితర అంశాలకు సంబంధించిన కష్టాలు, లేక అసలు ఏరకంగానూ ఐడెంటిఫై అవ్వనక్కర్లేని గ్రాఫిక్స్ /యాక్షన్ సినిమాలు ( ఇంగ్లీషు డబ్బింగులే అయినా) ముంచెత్తి , సినిమా ప్రధానంగా రెండుగంటలసేపు వినోదాన్ని అందించేదిగానే రూపాంతరం చెందింది.
  ఇక 2000s తొలి సంవత్సరాల్లో మళ్ళీ చిన్నపాటి రెబెల్ హీరోయిజం తలెత్తింది. కాకపోతే ఇక్కడ హీరో ధిక్కారం అంతా , కేవలం తన జీవితం కోసమే. చుట్టుపక్కలవారికోసం కాదు. ఒకప్పటి హీరో , సమాజం కోసం గొడవ పెట్టుకుంటే ఇప్పటి హీరో కేవలం తన కోసమే గొడవపెట్టుకుంటాడు. అది తను ప్రేమించిన అమ్మాయిని పొందడం కోసమవ్వచ్చు , లేక తన ఈగో సాటొస్ఫాక్షన్ కోసమే కావొచ్చు. విలన్ ఎంత పెద్దవాడయినా "నువ్వెవ్వడైతే నాకేంటి ? " " నేను ఇలాగే ఉంటా " "ఏం చేస్కుంటావో చేస్కో" లాంటి పరుషజాలం కోసం కావొచ్చు " మా కాళ్ళ మీద మమ్మల్ను నిలబడనివ్వండి " అంటూ తండ్రినో , ఉపాధ్యాయులనో ప్రేమతో బ్రతిమిలాడుతూనో కావొచ్చు. ఏది ఏమైనా తన వ్యక్తిత్వమే మనిషికి ఇప్పుడు ముఖ్యమైనది , కాబట్టి దాన్ని నిలుపుకోవడానికొ ఒక మనిషి చేసే యుద్ధమో , ప్రయత్నమో కథలయ్యాయి.
  కానీ , ఈ తరహా కథానాయకులు చాలా త్వరగానే అంతరించి అసలు తమ వ్యక్తిత్వం ఏమిటో తమకే తెలియని పాత్రలు ప్రధానం అవుతున్నాయి. ఇంగ్లీషులో ముప్ఫై,నలభై ఏళ్ళ క్రితం హిప్పీ జెనరేషన్‍లో మొదలైన ఈ "ఐడెండిటీ క్రైసిస్" ఇన్నేళ్ళకూ మన జీవితాల్లోకీ వచ్చేస్తోందని ఈ సినిమాలు చెబుతున్నాయి. మార్కుల కోసం సాగిస్తున్న చదువులో , లేక జీతాల కోసమే చేస్తున్న ఉద్యోగాలో ..కారణం ఏమైనా మనవారికి జీవితాలగురించి చెప్పేందుకు పుస్తకాలూ, గురువులూ కంటే సినిమాలే ఎక్కువ ముఖ్యమవుతున్నాయి. "నన్ను నేనే వెదుక్కున్నాను " " నా నువ్వేనా " "నాలోని నువ్వు నేనేనా " "నేనేం చేసానో తెలియడం లేదు " "కన్ఫ్యూజన్ కన్‍ఫ్యూజన్ " లాంటి పదాలు , భావాలూ మాటల్లో  , పాత్రల్లో , పాటల్లో , కథాంశాల్లో రాజ్యమేలుతున్నాయి. ఈ అంశాన్ని రెండు రకాలుగా చూడొచ్చు. మనిషి మనిషిగా జీవించడమే వేదం.... అనేంత మాట చెప్పేంతవరకూ సినిమాలు ఎదిగాయి అని గర్వపడొచ్చు. లేక సినిమాద్వారా జీవితం బేసిక్స్ తెలుసుకునేంతగా ప్రేక్షకుల జీవితాలు పతనమౌతున్నాయా అని విచారించొచ్చు. లేక రెండిటికీ మధ్యస్థంగా మరింత ప్రమాదకరమైన కోణం ఒకటి ఉంది.
  పతనమవుతున్న మనిషికి తనను తాను మోసం చేసుకోవడానికి మరొక ఆయుధంగా కళలు (ఇక్కడ సినిమాలు ) రూపాంతరం చెందడం.
     సినిమాలను తొలిదశనుండి , వినోదంగానే కాక రాజకీయంగా వాడుకున్న దేశాలూ , ప్రచారసాధనాలుగా వాడుకున్న పార్టీలు ప్రపంచమంతా ఉన్నాయి, ఉంటున్నాయి. వాటిని Propaganda Films అంటారు . పూర్తి వివరాలకు  http://en.wikipedia.org/wiki/Propaganda_film చూడగలరు. డెఫినిషన్‍ ప్రకారం అయితే :
A propaganda film is a film, either a documentary-style production or a fictional screenplay, that is produced to convince the viewer of a certain political point or influence the opinions or behavior of people, often by providing deliberately misleading, propagandistic  content.
  కానీ , ఇదంతా యుద్ధకాలాల్లో ప్రభుత్వాలు ప్రజలకు తమ గురించి గొప్పలు చెప్పుకోవడానికీ , తాము చేస్తున్నదంతా మంచి అని భ్రమ కలిగించడానికీ పుట్టినవి. కానీ ఈనాటి సినిమాలు చూస్తుంటే నాకు ఒక తీవ్రమైన అనుమానం పుడుతోంది. అది సినిమా సినిమాకూ బలపడుతోంది. ఈ వ్యాసం ఇప్పటివరకూ రాసిన ఉపోద్ఘాతం అంతా ఆ చిన్న అనుమానాన్ని పంచుకుని చర్చించడానికే.
    ఒకప్పటి నియంతలూ , దగాకోరు ప్రభుత్వాలబదులు ఈవేళ మనం, సాధారణ ప్రేక్షకులమే అలా తయారు అవుతున్నామా ? సినిమా మన జీవితాలను ప్రతిఫలిస్తోంది అనే మాట ప్రకారం అయితే , ఈవేల్టి సినిమాలు రిలాల్టీ / రియలిజం అనే పేరిట దేన్ని ప్రతిఫలిస్తున్నాయి ?
  ఒకప్పుడు ఎన్టీయార్ / ఎంజీయార్ / చిరంజీవి/ అమితాబ్ బచ్చన్... ఏ సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోను తీసుకున్నా , తమ సినిమాల్లో ఒకపాటలో తప్పకుండా మురికివాడాల్లోని పిల్లలను హత్తుకుని వాళ్ళతో చిందులేసినట్లు నటించేవారు. కానీ ఈ వేళ మన ప్రతి సినిమాల్లో హీరో లేక హీరోయిన... తమ మధ్య జరిగే రొమాంటిక్ పాటలో కూడా అనవరసంగా అయినా సరే చొక్కాలేని వీధిబాలలతో నర్తిస్తున్నారు. ఒకప్పటి సూపర్‍స్టార్లలోని బూర్జువా సంస్కృతి ఇప్పుడు మన అందరిలోనూ ప్రవహిస్తోంది అనేట్లు. నేడు ప్రతి ప్రేక్షకుడూ బూర్జువా వ్యవస్థకు ప్రతినిధి ఏమో ? (http://en.wikipedia.org/wiki/Bourgeoisie ) నేను... వంద రూపాయలు పెట్టి టికెట్ కొని ఈ సినిమా చూసేంత డబ్బున్నవాడిని... ప్లాట్‍ఫారంపై బ్రతికేవాడిని అక్కున చేర్చుకునేంత విశాలహృదయుడను అని సాధారణ ప్రేక్షకుడు గొంతు చించుకుని తన డొల్లతనం చెప్పుకుంటున్నట్లు.
  గత రెండుమూడేళ్ళలో సినిమా మరింత ఖరీదైనప్పటినుండి సినిమాప్రేక్షకుడి పేదవాడికంటే పైస్థాయివాడు అవడం ( థియేటర్లో పదోశాతం కంటే తక్కువున్న నేలటికెట్లను పక్కనపెట్టి చూస్తే )వలన తన కంటే కిందిస్థాయిలోని పేదవాడిని తను గుర్తించడమే అతనికి గొప్ప వరం అనట్లు ప్రవర్తిస్తున్నాడా ??
   ఇప్పటివరకూ ఏ సినిమానూ ఉదహరించకపోయినా , ఇక్కడ ఉదహరించకతప్పదు. slumdog millionaireను ఆంగ్ల సినిమాగా, మన దేశపు పేదరికాన్ని చూపించినందుకు గొప్పదనం ఆపాదించబడ్డదానిగా వాదించుకుంటున్న మనం , మన భారతీయ సినిమాల్లోనే మనలను మనం ఎంత తక్కువ చేసుకుంటున్నామో చూద్దాం. ప్రతి భాషా సినిమాలోనూ ఈ అంశం ఉన్నా ప్రస్తుతానికి తెలుగు సినిమాలు మాత్రమే ఉదహరిస్తాను.(ఇక్కడ ఉదాహరణల్లో కాస్తం వైవిధ్యం ఉన్నదని , వాస్తవానికి దగ్గరగా ఉన్నాయనీ విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలనే ఉదహరిస్తున్నాను , ఫక్తు మసాలా సినిమాలను తప్పించి)
* హ్యాపీడేస్‍లో పేదప్రాంతంనుంచి వచ్చిన విద్యార్థికి హీరో అభయమిచ్చినట్లు కాపాడటం, అందుకు అతను నమ్మినబంటులా మారడం ( దాదాపు ఇదేలాంటి బంధాన్ని రామాయణంలో రాముడికీ హనుమంతుడికీ మధ్య చూపిస్తే దానికి ఆర్య ద్రవిడ గొడవలతో తరచి తరచి చూసి సినిమాలు తీస్తున్న మనం ఈవేల్టి సమాజాన్ని ఎలా ప్రతిబింబిస్తున్నాం ? )
* ఓం శాంతి : మనిషికి అసలైన "థ్రిల్" అంటే లేనివాళ్ళకు సాయపడటమే అని మాధవన్ చెబుతుండగా కాజల్ అర్థరాత్రి ప్లాట్‍ఫాంపై ఉన్నవారికి కంబళ్ళు కప్పి, టీ సమోసాలు ఇప్పిస్తుంది. ఇదే మాట కిక్ అనే సినిమాలోనూ ఉంది.
* బాణం : సులభంగా చెప్పలేను కానీ , ఏం చేసినా వ్యవస్థలో ఉండే చెయ్యాలి అని చెబుతూనే మళ్ళీ వ్యవస్థలో లొసుగులు పట్టుకు పోతాడు హీరో . అతను స్వతహాగా ధనవంతుడిలా చూపించకపోయినా వ్యవస్థలో కలవాలి అనుకునేవాడు
*ఆవకాయ్ బిర్యానీ : ఇదొక్కటే వెరైటీగా...కథానాయకులు పేద పల్లెటూరువారు . కాకపోతే భావజాలం మాత్రం , పల్లెల్లో వారైనా ఇంగ్లీషు చదువుకుంటేనే మేలు జరుగుతుంది అన్నట్లు ఉంటుంది (మరీ అలా డైరెక్టుగా డైలాగుల్లో చెప్పకున్నా పాత్రల దారులు అటే వెడుతుంటాయ్)
*గమ్యం . ప్రధానంగా ఒక ధనికుడు తన చుట్టూ ఉండే పేదవారు కూడా (ఎంత హేయమైన వృత్తిలో వారే అయినా ) మనుష్యులే అని గుర్తెరగడం. ప్రేక్షకుడు ఇక్కడ ధనికుడివేపే అయితే మనం పేదలను గుర్తించడమే గొప్ప విషయమా ?
* అందరి బంధువయా : ఉన్నంతలో తమకు ఉన్నదాన్ని లేనివాడికి ఇచ్చి "సాయపడాలి" అనేది ముఖ్యమైన సందేశం. ఈ చిత్రంలో పాత్రలు అంత ధనవంతులు కాకపోయినా తమకంటే తక్కువ స్థాయిల్లో ఉన్నవారికి సహాయపడటం ద్వారా ఉన్నంతలో తాము ధనికులే అనేట్లు చెప్పింది. బహుశా ఆ "ఉన్నంతలో ధనికులు" అనే మాట రుచించకనేమో ప్రేక్షకులు ఈ పాత్రలలో అంతగా identify  అయినట్లులేరు .
* వేదం : ఒకే దర్శకుడి చిత్రం మరోసారి చెప్పకూడదు అనుకున్నా ( ఆ కారణంతోనే "గోదావరి " "లీడర్" చిత్రాలను ఉదహరించడంలేదు ..వాటిల్లో పెచ్చు సన్నివేశాలు ఉన్నప్పటికీ) లేటెస్ట్ సినిమా కాబట్టి తప్పలేదు.  నిజానికి సమాజంలో పెరుగుతున్న / పతనమౌతున్న విలువలను పూర్తిస్థాయిలో ప్రతిబింబించగలిగింది ఈ చిత్రం, ఐదు పాత్రలవల్ల ఐదు సినిమాల ఎఫెక్ట్.
    రియలిజం పేరిట ఒక నటనరాని ముసలాయన. ఆయన ముఖంలోనే పేదరికం , బలహీనత, అసహాయత ఉండడంతో...అలాంటి పాత్రను గుర్తించడం , మెచ్చుకోవడంతో ప్రేక్షకులుగా మనం పేదలకు గొప్ప మేలు చేస్తున్నట్లే.  కానీ అదే రియలిజం , చిన్న ఊరినుండి వచ్చిన వేశ్యకు అవసరం లేకపోయింది . అక్కడా మాత్రం మనకు ఒక అందాల నటి , అతి మేకప్‍లో provocativeగా మాట్లాడుతున్నా, హొయలు వెదజల్లుతున్నా ఆ cinematic presentationను రియలిజం అని మనల్ను మనం మోసం చేసుకోవడం.
   పేదరికాన్ని,  పల్లెల్లో పిల్లాడి వెట్టి చాకిరీనీ , కిడ్నీలు అమ్ముకోవడాన్ని ..చూస్తూ మధ్యలో పాప్‍కార్న్ , సాప్ట్‌డ్రింక్స్ సేవిస్తూ , "అయ్యో పాపం" అనుకోవడం.  (నేను రెండుసార్లు రెండు వేర్వేరు ఊర్లలోని థియేటర్ల్లో చూసినప్పుడు ఇంటర్వెల్ రాగానే వరదబాధితులు ఆహారపొట్లాలకోసం ఎగబడినట్లు జనాలు చేత నొట్లతో ఈ చిరుతిళ్ళకోసం ఎగబడ్డం కళ్ళారా చూసాను )
  ధనికుడైన మనోజ్ పాత్రలో... మళ్ళీ పై చిత్రాల్లోని మెసేజ్.
  పేదవాళ్ళు ఒళ్ళూ , అవయవాలూ అమ్ముకోవడం చట్టవిరుద్ధం , ఆపాలి అని మెసేజ్ కాదు, పాపం వాళ్ళు అలా ఉన్నారు మనం చూసి జాలి పడాలి అంతే అని మాత్రమే.
  ఈ ఉదాహరణల్లో వేటిలోనూ నేను పై సినిమాలనో , వాటి దర్శకరచయితలనో తప్పుపట్టడం లేదు . వాళ్ళూ జనంలోని వారే . మనలో ఏముందే అదే వాళ్ళు చెబుతున్నారు. కాకపోతే ఆ చెప్పడంలో వాళ్ళు అవార్డులు , డబ్బులు పొందుతున్నారు . అవి వినడమే మన గొప్పగా మనం భావించుకుంటున్నాం.
     ఇప్పటివరకూ ఈ పోకడలు అన్నీ ఖచ్చితంగా propaganda film తరహాలోనే ఉన్నాయి. రాబోయే కాలాల్లో ఈ ప్రాపగాండా ఇంకెంత దూరం వెళుతుందో ? సమాజంలోని అణిచివేతను  , దురాక్రమణను చూసి ప్రతిస్పందించకపోగా , వాటిని చూడటమే వినోదం అనుకునే స్థాయికి పతనమవుతున్న మన సుఖమయ జీవితాలను అద్దంలా చూపుతున్న సినిమాలకు వేలదండాలు. 

Thursday, May 06, 2010

పొట్టి కథలు :::::: కరిగిన మైనం

" ఎప్పుడూ ముఖం అలా ముడిచిపెట్టకపోతే కాస్త నవ్వొచ్చుగా "
 ఆమె మాటలు గుర్తుకొచ్చి అతను అప్రయత్నంగా నవ్వాడు. కళ్ళలో తడి మెరిసింది.
" సార్ టికెట్ తీసుకున్నారా " కండక్టర్ దురుసుగా తోసుకుంటూ అడిగాడు. దురుసుగా ఉండక తప్పని పరిస్థితి అతనిది. కిక్కిరిసిన జనంలోంచి పాములాగా దూరుకుంటూ బస్సు కుదుపులకు అడుగులను బ్యాలన్స్ చేసుకుంటూ నడవడమే కాక చిరాకుగా ఉండకూడదు అంటే ఎలా కుదురుతుంది మరి!
  " ప్లీజ్ నీకు వెయ్యి నమస్కారాలు చేస్తా.ఇంకెప్పుడూ మీసాలు తీసెయ్యొద్దు. ఏదో రేపిస్ట్ సైకోలా ఉన్నావ్ " ఆమె ముఖంలో మెలికలు తిరిగిన చిలిపి అల్లరి అందాల ఆడతనం గుర్తొచ్చిఅతడి పెదవులమీద నవ్వు మరింత విచ్చుకుంది. ఆ సాయంత్రం వర్షం కురవకపోయి ఉంటే బావుండేది. పార్కులో ఇంకాసేపు గడిపిఉండొచ్చు.
    " ఇకనుంచీ ఇలాగే మెయిన్‍టైన్ చెయ్, చూట్టానికి పెద్ద బాలేకపోయినా, ఇప్పుడు బావుంది. పైపెదవి మెత్తగా తెలుస్తోంది. హ్మూ... " చీకట్లో ముద్దులో ఆమె గుసగుసలు గుర్తొచ్చాయి. పళ్ళ బిగువున సిగ్గును అదిమేసి తనతోపాటు నిల్చున్నవారి మీంచి, బస్సు కిటికీ పక్కన కూర్చున్న వారిమీంచి వెలుపలికి చూసాడు.
          రోడ్డు అంచున నిలుచున్నషాపింగు కాంప్లెక్సులన్నీ వెనక్కు పోతున్నాయి.
  " లం.. ముండ , వాడితో ఏం సుఖపడుతుంది. వదిలేసిపోతుందా ? ఛస్తుంది. ఈసారి కనిపిస్తే దాని మొహంకూడా చూడను " స్నేహితులతో మత్తులో వాగిన వాగుడు చెవుల్లో మెదిలింది.
  " ప్లీజ్ ఏమనుకోకు . ఇక కష్టం, ఇంట్లో చాలా ప్రాబ్లం. నాన్నకు గుండె.. " ఆరోజు ఆమె గొంతు వణకడం అతనికింకా గుర్తే. కోపం ఉడికింది. మధ్యాహ్నం ఎండ మరింత భళ్ళుమంది.చెమటకంపుతో ఒక కుదుపు.
" ఏం మనిషివయ్యా... చూసిపో.. " భుజానికి తగిలించుకున్న ల్యాప్‍టాప్‍ను నొక్కేస్తూ వెళ్ళిపోయిన ముసలి పల్లెటూరుబైతును విసుక్కున్నాడు అతను. కంప్యూటర్‍ అంటే ఆమనిషికి తెలీదు కదా పాపం, అయినా ఎవరినో ఒకరిని కోప్పడాలి. అతని ముఖం మీది చిరాకు చూసి కాబోలు. చుట్టుపక్కలవారు చిరాకుపడ్డారు.
          " ఎప్పుడూ ముఖం అలా ముడిచిపెట్టకపోతే కాస్త నవ్వొచ్చుగా " మాట వినిపించినట్లు అనిపించి అటు చూసాడు.
 ఆమె.
 ఆమే.
  అణువణువూ అందం పొదువుకున్న ఙ్ఞాపకంలా ఉంది. వస్తోంది.
ఏం పెద్ద మారలేదు. కాస్త లావయ్యింది అంతే. కాస్త. కాస్తే.
పక్కన ఎవడో ఉన్నాడు. ఆమె ముఖం ప్రశాంతంగా ఉంది. ఆమె చేయివదలకుండానే నవ్వుతున్నాడు వాడు. ఇద్దరూ తన వేపే వస్తున్నారు. బస్సులో , జనం మధ్యలో ఇరుక్కుపోయిన ఒక తెగిన మనసు.
  ఆమె అతడిని చూసింది. కళ్ళు విచ్చుకున్నాయి. కనుబొమలు వంపు తిరిగాయి. రెప్పపాటులో మౌనం ఏరులైపారిది.
"బావున్నావా" ఆమె కళ్ళు అడిగాయి
 " నువ్వుఎలా ఉన్నావ్ ? " అతనూ మాట్లాడలేదు.  ఆమె ముఖంలో సంతోషం. అతడిని చూసానని. అతడిలో తృప్తి. కనిపించానని.
బస్సు ఆగింది. అతడు దిగిపోయాడు.
" ఎప్పుడూ ముఖం అలా ముడిచిపెట్టకపోతే కాస్త నవ్వొచ్చుగా " అమె ఙ్ఞాపకం అతడి పెదవులను పట్టుకువేళ్ళాడుతోంది.
ఎదురుగా నడుస్తున్న అమ్మాయిలు మాత్రం అతడు తమను చూసి నవ్వుతున్నాడేమో అనుకుని వగలు పోయారు.
                                                           ------------------------------------

Wednesday, May 05, 2010

మరణించేలోగా చూడాల్సిన చిత్రం

మనందరికీ తెలిసినా మనం తలుచుకోకూడదు అనుకునే పరమ సత్యం : మరణం.
  చచ్చిపోతాం అని తెలిసినా బ్రతుకుకోసం ఆరాటపడతాం. జీవితంలో అందరం ఇంకొందరితో భవబంధాలతో ఇరుక్కున్నవాళ్ళం.తల్లి, తండ్రి, సోదరులు,భార్య, భర్త, స్నేహితులు..మనకంటే మనకు అమూల్యమైనవారు ఎందరని ? మనం ఎలా ఉన్నా వీళ్ళు బావుండాలి అని ఎంతగా తాపత్రయపడతామో కానీ. ఇటువంటి మానవజీవితంలో మనిషికి తన మరణం కంటే కూడా భయంకరమైన శాపం, ఆప్తుల మరణాన్ని చూసే స్థితి.
   ఇప్పటికి ఈ వ్యాసం చదువుతున్న మీరు, ఒక క్షణం ఆగండి. మీకు ఒక కఠినమైన పరీక్ష పెడుతున్నాను. మీ జీవితాలను బాగా కలచివేసిన మరణం ఏమిటో గుర్తుకుచేసుకోండి. ఆ వ్యక్తి. ఎవరు ? ఆ వ్యక్తికీ మీకూ ఉన్న అనుబంధం. ఆ వ్యక్తి ముఖం కళ్ళ వెనుక మెదులుతోందా ? ఇప్పుడు.. ఆ వ్యక్తి చనిపోయినప్పుడు ఆ శవాన్ని మీరు చూసారా ? అప్పుడు ఆ ముఖం ఎలా ఉంది ? జీవం లేని ఆ వ్యక్తి శరీరం, స్పర్శ ఏమైనా మెదులుతున్నాయా ? బాగా గుర్తుకుచేసుకోండి.
  ఎవరికైనా భరించలేనంట దు:ఖం వస్తే తనివితీరా ఏడ్చండి. ఇదంతా గుర్తుచేస్తున్నందుకు నన్ను ఎలా అయినా తిట్టుకోండి. కానీ , ఇదంతా ఒక చిన్నపాటి సైకలాజికల్ ఎక్సర్సైజ్ అనుకోండి. ఇప్పుడు... మీ జీవితంలో మీకు అత్యంత ఆప్తులయిన వారు ఎవరైనా రేపు మరణిస్తే ? ఆ ఊహ.... భరించగలరా? ఆ ముఖాలను అలా జీవం లేకుండా చూడగలరా ? అసాధ్యం అనిపిస్తోంది కదూ ? కానీ ఇది ఎప్పుడయినా జరగొచ్చు. ఆ విషయం తెలిసీ మనం ఎదుర్కోలేకుండా దాటవేస్తున్న నిజం.
  ప్రతి మనిషీ పారిపోయే ఈ నిజం గురించి తీసిన ఒక అద్భుతమైన సినిమా గురించి ఈ ఉపోద్ఘాతమంతా. నా మటుకు నాకు, ఇది ఒక సినిమా మాత్రమే కాదు , ఒక పాఠం, వేదం . పేరు :  DEPARTURES language : japanese (http://www.imdb.com/title/tt1069238/ ) 2009 సంవత్సరానికి ఉత్తమ విదేశీ చిత్రంగా ఆస్కారు అందుకున్నది. నటులు , దర్శకులు ఎవ్వరూ నాకు తెలియదు. కాబట్టి వారి గురించి గూగుల్ చేస్తే వచ్చే సమాచారం నేను చెప్పబోవట్లేదు.
  ఈ సినిమాలో కథ అనేది చెప్పాలంటే ఒకే ఒక వాక్యం :
   ఉద్యోగం కోల్పోయిన ఒక ఫిడేలు వాద్యకారుడు ( cellist. cello కూడా ఫిడేలులాంటిదే కదా ), ఉపాధికోసం ట్రావెలింగ్ ఏజెన్సీ అనుకుని , పార్థివ దేశాలకు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించడమే పనిగా చేసే ఒక కంపెనీకు వెళ్ళి , మెల్లగా ఆ ఉద్యోగం ద్వారా జీవితం అంటే ఏమిటో తెలుసుకుని, తన వాళ్ళకు తెలియజెప్పి  తన బ్రతుకును అత్యంత ప్రేమమయంగా మలుచుకుంటాడు.
   అంతే కథ. 
  మనం భయపడే మరణం మనలో జీవితం అంటే ప్రేమను రగల్చగలదా? అవునేమో అనిపిస్తుంది ఈ చిత్రంలోని సన్నివేశాలు చూస్తే.  నా గుండెకు హత్తుకున్న సన్నివేశాలు కొన్ని చెప్పడం మినహా ఈ చిత్రం గొప్పదనం చెప్పడానికి నేను చాలను అనిపిస్తోంది. ప్రతి సన్నివేశమూ గొప్పదే , వాటిల్లో టాప్ అని కాదు కానీ అయిదు సీన్లు చెబుతాను  ( ఇలాంటివి చా...లా ఉన్నాయి ఈ సినిమాలో..ఇవి శాంపుల్స్ మాత్రమే )
౧. మొదటి రోజు డ్యూటీ చేసాక, హీరో తనపై శవం తాలూకు కంపు వస్తోందని paranoicగా భయపడిపోయి , దారిలోనే స్నానాలగదికి వెళ్ళీ, సబ్బుతో ఒళ్ళు అరగదీసి ఇంటికెళతాడు. తాను చేస్తున్న పని ఏమిటో భార్యకు చెప్పడు , ఆమె అసహ్యించుకుంటుందేమో అని. భోజనాననికి ఒక కోడిను వడ్డిస్తే , అందులోనూ కోడి శవమే కనిపించే వాంతులవుతాయి. ఏమయ్యిందని భార్య అతడి దరికి చేరితే......   జీవించి ఉన్న, రక్తమాంసాలతో ,శ్వాసతో కదులుతున్న ఒక శరీరం దొరికిందన్నట్లు ఆత్రంగా ఆ శరీరంలోకి ఇమిడిపోవాలని చూస్తాడు. ఆ కౌగిలింతను చిత్రీకరించిన తీరు అత్యద్భుతం.
౨.జపాన్ వారి సాంప్రదాయం ప్రకారం మృతదేహాలకు మంచి బట్టలు తొడిగి , ముఖానికి మేకప్ వేసి (బ్రతికున్నప్పుడు ఆ మనిషి ఎలాంటి మేకప్ వాడితే అలాంటిది) పిదప ఖననం చేస్తారుట. ( మన దేశంలో హిందువులు కూడా ముఖానికి పసుపు పూయడమో, బొట్టు పెట్టడమూ..చాలా చేస్తారు కదా ). ఒక స్త్రీ చావుకు అయిదు నిముషాలు ఆలస్యంగా వెళ్ళిన హీరోనూ, అతని బాస్‍ను మృతురాలి భర్త దుర్భాషలాడుతాడు " శవాలమీద ఆధారపడి బ్రతుకుతున్నావ్ , నీ స్థానం తెలిసి ప్రవర్తించు" అని.  క్షమాపణల తర్వాత వాళ్ళిద్దరూ తమ పని మొదలెడతారు. మృతుతాలి ఫోటోలో ఆమె నవ్వుతూ అందంగా కనిపిస్తుంది. కానీ శవం మాత్రం కాస్త నోఋ తెరుచుకుని , ప్రేతకళతో ఉంటుంది. వాళ్ళు ఆ స్త్రీ శరీరానికి మేకప్ వేస్తుంటే తన భార్య ముఖం కనిపించే విధానం మారుతుంటే ఆ భర్త నిర్వేదంగా చూస్తుండిపోతాడు. ఈవిడ ఫేవరెట్ లిప్‍స్టిక్ ఏది అని అడుగుతారు వాళ్ళు. తెల్లమొహం వేస్తాడు భర్త. పక్కనే ఉన్న పదేళ్ళ కూతురు పరుగున తెచ్చి ఇస్తుంది. అంతవరకూ తన భార్యకు ఒక రకమైన లిప్‍స్టిక్ అంటే ఇష్టమనీ ,అది తనకు తెలియనీ లేదనీ ,తన కూతురుకు తెలుసనీ అర్థం చేసుకున్న భర్త నిర్ఘాంతపోతాడు. ఆ లిప్‍స్టిక్ వేసాక. ...శవం ముఖం అచ్చంగా ఫోటోలో ఉన్న ముఖంలానే కనిపిస్తుంది. అంతసేపూ పెదవి చాటున దు:ఖాన్ని అణుచుకున్న కూతురు , తన తల్లిని మళ్ళీ చూసినట్లు , గుర్తుపట్టినట్లు " మా" అంటూ అప్పుడు భోరుమంటుంది. ఇక భార్యను పెట్టెలో పెట్టేస్తుంటే అంతసేపూ రాయిలా భావాలను అణుచుకున్న భర్త కూడా తల్లడిల్లిపోతాడు.  మునుపు తిట్టినందుకు హీరోనూ, అతడి బాసునూ పదేపదే క్షమాపణ కోరి బహుమతి ఇచ్చి పంపుతాడు.
   
౩.  ఒక ముసలాయన మృతదేహానికి మేకప్ చేసాక, అతని మనవరాళ్ళలో ఒక అమ్మాయి దు:ఖిస్తూ శవం నుదుటిని చుంబిస్తుంది. ఆ అమ్మాయి పెదవులనుంచి లిప్‍స్టిక్ ముద్రలు , శవం నుదుటిపై అతుక్కుంటాయి. అంత దు:ఖంలోనూ ఆ దృశ్యం చూసిన మనవరాళ్ళు ఫక్కుమని ఆనందబాష్పాలు రాల్చుతారు. ఇది సన్నివేశం కాదు కానీ మాంటేజ్‍గా వచ్చే కొన్ని దృశ్యాల్లో ఒకటి.

౪. " నువ్వు చేసేదీ ఒక ఉద్యోగమా అదీ ఒక వృత్తేనా ? " అంటూ ఛీదరించుకుని కథానాయకుడికి దూరమైపోయిన ఒక స్నేహితుడు , తన తల్లి చనిపోయినప్పుడు ఉద్యోగధర్మంలాగానే అయినా perfectionతో , ప్రేమతో హీరో చేసే పనిని చూసి ఆ పనిలో అతడికి ఎంత సంతోషం వస్తోందో ఊహించగలుగుతాడు. అదే సన్నివేశంలో హీరో భార్య కూడా తన భర్తను చాలా ముచ్చటగా చూస్తుంది. సంభాషణలే లేకున్నా కళ్ళతో , హావభావాలతో ఈ నటులు అభినయించిన తీరు గుండెను హత్తుకుంటుంది. అప్పటివరకూ చావును అసహ్యించుకున్న ఆ వ్యక్తి , దానిపట్ల ఆకర్షితుడవుతాడో లేక తన తల్లి శరీరం నశించేంతవరకూ చూడాలనో మరి iNCINERATORలోకి తన తల్లి శవం ఉన్న పేటికను ఉంచుతున్నప్పుడు అక్కడ ఉండే ఉద్యోగిని అడుగుతాడు : " నేను పూర్తిగా చూడొచ్చా? " అని. మంటల్లో శరీరం బూడదవ్వడం కూడా చూసాక కానీ అతడికి తల్లిపోయిన లోటు పూర్తిగా అర్థం కాదు. అంతవరకూ అణిచిపెట్టుకున్న దు:ఖం ముంచెత్తుతుంది. అప్పుడు అక్కడి ఉద్యోగి తమ వృత్తి గురించి చెప్పే మాట : " మరణం అంతం కాదు. ప్రాణానికి తన ప్రయాణంలో ఒక తలుపు లాంటిది. నేను ఆ తలుపు దగ్గరి ద్వారపాలకుడని మాత్రమే. నేను సాగనంపే ప్రతిప్రాణానికి చెప్పుకుంటాను.... గుర్తుంచుకో , నేను నిన్ను ప్రేమగా, ఇష్టంగా, జాగ్రత్తగా పంపుతున్నాను అని " 
  బహుశా , మరణం పట్ట అంతటి ప్రేమను సంపాదిస్తే మనిషి దాన్ని జయించినట్లే అనిపించింది నాకు. నేర్చుకోవలసిన, ఆచరించవల్సిన గొప్ప విషయం అనిపించింది.

౫. ఇది ఒక సన్నివేశం అని కాదు కానీ , సినిమాలో కొంత కథ జరిగాక , హీరో , తన బాసూ , కంపెనీలో రిసెప్షనిస్టులా పన్జేసే ఒక అమ్మాయీ , ముగ్గరూ కూడా తమ పని పూర్తయ్యాక వచ్చిన డబ్బులతో మంచి రెస్టారెంట్లకు వెళ్ళి కోరికోరి రుచికరమైన ఆహారపదార్థాలను తింటారు. అంత చావును చూసి , తద్వారా వచ్చిన డబ్బుతో ,అది మరచిపోయి జిహ్వను తృప్తి పరుచుకున్నందుకు తమను తామే ద్వేషించుకోవాలి అనుకుంటున్నా అలా అహారానికి అడిక్ట్ అయిపోతారు.  ఇక్కడ అంతర్లీనంగా దర్శకుడు చెప్పదల్చుకున్నది ,తృప్తి అన్నది మనసుకు  ఎంత అవసరమో శరీరానికీ అంతే అవసరం. ఆకలి , కడుపునింపుకోవడం అనేది ప్రతి జంతువుకూ BASIC NEED. కానీ జంతువుకూ మనిషికీ మొట్టమొదటి తేడా , అవసరం తీర్చుకోవడంలోని refinement. జిహ్వను తృప్తిపరుచుకుంటే జీవాత్మను తృప్తి పరిచినట్లే అని మన పెద్దవాళ్ళుకూడా అనడం , ఏ సెలబ్రేషన్ అయినా మంచి ఆహారంతోనే ముగుస్తుంది. మరణాన్ని అలా పండుగలా జరుపుకోవాలి అంటే జీవితాన్ని మరింతగా అనుభవించడమే అని చెప్పడానికే ఆ పాత్రలు అలా భోజనప్రియులు అవుతారు.
  ఇక నాకు నచ్చని అంశమూ ఒకటి ఉంది. అంటే నచ్చలేదు అని కాదు కానీ, అంత గొప్పగా అనిపించనిది.. క్లైమాక్స్. కానీ plot కోసం అనో , feel good NoTe తో ముగిద్దాం అనో మరి , మామూలుగా ప్రతి చిత్రంలోనూ ఉండే గ్రీటింగు కార్డు తరహా మెలోడ్రామాతో , హీరో తండ్రికి ,అతనికి పుట్టబోయే బిడ్డకూ సంబంధించిన ట్రాక్‍తో సినిమా ముగించారు. ఆ ముగింపును రకరకాలుగా చెప్పుకోవచ్చు , అవి ఏమిటో నేను చెప్పడం అంటే మరీ అరటిపండును వలిచి నోటికి అందించడమే. కాబట్టి మీ పండును మీరే తినండి.
  ఇక టైటిలు గురించి. జపనీస్ భాషలో ఎలా కుదిరిందో కానీ ఇంగ్లీషు తర్జుమాప్రకారం అయితే , DEPARTURES కంపెనీ అని పేపరు ప్రకటన చూసి ఈ ఉద్యోగానికి వెళతాడు హీరో. వెళ్ళాక అక్కడి బాసు ఆ ప్రకటనను చూసి , అచ్చు తప్పు ఉందనీ , departed అని ఉండాల్సింది అని చెబుతాడు.  కానీ సినిమా పేరు మాత్రం departures అనే ఉంచారు. ఇది ఉద్దేశ్యపూర్వకంగా చేసిన ఛమక్కు. పైన చెప్పిన సంభాషణ ఉదాహరణ ప్రకారం మరణం అంటే పోవడ్ంఅ కాదు , పోతూ ఉండడం అని టైటిలులోనే చెప్పదల్చిన ఉద్దేశ్యం.  
  ఇక కొంతమంది ఛాందస జపనీయులకు ఈ చిత్రంపై కినుక. japanese traditional death rituals గురించి పూర్తి స్థాయిలో వివరణాత్మకంగా చెప్పలేదు అని. కానీ అవంతా చెప్పి ఉంటే అసలు భావం మరుగున పడేది అని నాకు అనిపించింది. అయినా ఈ సినిమాలోనే ఒక డైలాగు ఉంది, " క్రిస్తియన్ అయినా, బుద్ధిస్ట్ అయినా, హిందూ అయినా.. ఎవరయినా మనకేంటి , మన పని ఒకటే " అని. కాబట్టి దర్శకుడు కావాలనే సాంప్రదాయాల్ని చూపించదలచలేదు అనుకుంటున్నాను. .  ఈ సినిమా చూసేటప్పుడు చాలా మందికి కన్నీళ్ళు వస్తాయి , కాబట్టి మీరు ఏడ్వడం ఎవ్వరూ చూడకూడదు అనుకుంటూ ఒక్కరే చూడండి.(నువ్వు ఏడవలేదా అని నన్ను అడిగితే గర్వంగా చెప్పుకుంటాను , కొన్ని సన్నివేశాలకు కళ్ళారా ఏడ్చాను , కొన్నిటికి ఏడవకుండా అదుపు చేసుకోగలిగాను,కళ్ళు తడిసేలా నవ్వాను కూడా )ఇదిగో ఈ సినిమాకు సంబంధించిన  ట్రైయిలరు :



      ఇక... ఆఖరుగా సొంతగోల. ఇలాంటి సినిమాలు చూసినప్పుడు మనలో చాలా మంది అనుకునే మాట, మన భారతీయ/తెలుగు సినిమాలు ఇంత అద్భుతంగా ఎందుకు ఉండవు అని. ఇలాంటివి నచ్చే చాలా మందికూడా ఇలాంటి సినిమా తీస్తే జనాలు థియేటర్లలో చూడడం జరగదు. వందల రూపాయలు పెట్టి థియేటర్లకు వచ్చేది పాపకార్నులూ, కూల్‍డ్రింకులూ తాగుతూ ఎంజాయ్ చెయ్యడానికే కానీ సినిమా ఆద్యంతం కళ్ళు చెమర్చేలా ఉంటే వ్యాపారం ఎలా జరుగుతుందీ అని. ఆ మాట నేనూ ఒప్పుకుంటాను. ఇలాంటి సినిమా నిజంగా మన దేశంలో అయితే థియేట్రికల్‍ వ్యూయింగ్ కష్టమే. కానీ , ఇలాంటి సినిమా తీయాలి అంటే అందులో ఆర్థికపరమైన లాభం చూసుకుంటే పని జరగదు అనిపిస్తోంది. పెద్ద సెట్టింగులు లేవు , కెమెరా, ఫోటోగ్రఫీ అన్నీ చాలా basic లెవెల్స్‌లో ఉన్న ఇలాంటి చిత్రం తీయాలి అంటే... మన పెద్ద హీరోల రెమ్యూనరేషన్‍లో పదో వంతు చాలు. ఎవరో ఏదో చేస్తారు అని ఈ మాట చెప్పడం లేదు, మంచి సినిమా తీయాలి అందుకు కోట్లు లేవు అనుకునే సినీ ప్రేమికులందరూ ఈ సినిమా చూసి , ధైర్యం తెచ్చుకోవచ్చు..... కేవలం నలభై యాభై లక్షల్లో ఇలాంటి సినిమా రూపొందించవచ్చు అని.  ఆ ధైర్యం , నమ్మకం మీక్కూడా కలిగాలి అంటే , సినిమా చూసాక , లొకేషన్లూ, నటులూ, లైటింగ్ సెటప్పులూ , ఎన్ని రోజుల షూటింగు సరిపోతుందో ఒక పేపరు మీద లెక్కవేసుకుని చూడండి. లెక్కలు అబద్ధాలు చెప్పవు.    
  ఇక చివరగా.. దర్శకుడి నిబద్ధత. వికీపీడియాలో ఉన్నదే అయినా మళ్ళీ చెబుతాను : ఈ సినిమా ఒక పుస్తకం ఆధారమే అయినా , ఆ పుస్తకం చదివిన దర్శకుడు తను కూడా స్వయంగా ఇటువంటి భావనలు అనుభవించడానికి తానూ ఎన్నో చావులకు వెళ్ళాడట. పది సంవత్సరాల మేకింగ్ పట్టిందట ఈ చిత్రానికి , మానసికంగా అతను సిద్దమవ్వడానికి. జోహార్. 

Thursday, April 22, 2010

సినిమా పిచ్చోళ్ళ కోసం ఓ పిచ్చ సూపరు సినిమా

 సినిమా ఇలా తియ్యాలి, అలా తియ్యాలి . ఈ సీను అలా తీసుండాల్సింది. నేనైతే ఇలా తీస్తాను.
 మనందరం అనే మాటలూ , వినే మాటలే ఇవి. కానీ అసలు సినిమా "తీయడం" అంటే ఏమిటి? కాన్సెప్టు నుండి తెర మీది చిత్రం వరకూ సాగే ప్రస్థానంలో ఒక అతి ముఖ్య ఘట్టం : షూటింగ్.
 కథ వ్రాసుకోవడం , సంభాషణలూ , స్క్రీన్ ప్లే సమకూర్చుకోవడం ,బడ్జెట్ చూసుకుని, నటీనటులు, లొకేషన్ల ఎంపిక అన్నీ అయ్యాక మొదలవుతుంది ఈ ప్రక్రియ. సినిమా మీది ప్రేమ కలిగిన ప్రతివాడూ చూడాలి అనుకునేది ఈ షూటింగే. అసలు సినిమా ఎలా తీస్తారు అనే ప్రశ్నతో మొదలయ్యి , ఓహో తెర్ మీద మనకు కనిపించే సన్నివేశం జరగడానికి ఇంతమంది రకరకాలుగా కష్టపడతారా అని తెలుసుకున్నాకే సినిమా మీద ప్రేమతో పాటు గౌరవం కలుగుతుంది.  షూటింగును ప్రేమించిని వారు సినిమా దర్శకులు కాలేరు.
  చిన్నప్పుడు ఆల్ఫ్రెడ్ హిచ్‍కాక్ ఇంటర్వ్యూలు చదిచితే ఆయన మాట ఒకటే పదేపదే ఎదురుపడేది " సినిమా అంతా అయిపోయింది ఇక షూటింగే మిగిలింది " అనడం. ఎందుకో ఆ వాక్యాలు చాలా ప్రభావితం చేసాయి. నేను దర్శకుడిని అయితే ఖచ్చితంగా అంత పకడ్బందీగా తీయగలిగినప్పుడే సినిమా తీయాలి అనిపించేంది.
కానీ.... 
కానీ...
కానీ.....
 డ్రమాటిక్‍గా చెబుదామని అన్ని "కానీ"లు చెప్పా...అనుభవిస్తేనే తెలుస్తుంది ఆ కష్టం ఏమిటో. చిన్న షార్టు ఫిలిమ్స్ తీసేటప్పుడే , అదీ నాన్ కమర్షియల్‍ ప్రాజెక్టులు , అదీ నాలాగే సినిమామీది ప్రేమతో వచ్చిన తోటి ఫిలిం స్టూడెంట్లతో తీస్తున్నప్పుడే వంద సమస్యలు . నాకే కాదు, అందరి పరిస్థితులూ అంటే. అతి చిన్న చిన్న విషయాల్లో చిన్నపాటి మతిమరుపు / అలక్ష్యం / నిర్లక్ష్యం ఖరీదు చాలా పెద్దదే.  ముగ్గరు మనుష్యులు కలిస్తే ఎవరి మాట నెగ్గాలి అనే పంతం పుడుతుంది. బ్లాగుల్లో అయినా ఒక వ్యక్తి ఒకటి రైటు అంటే ఇంకోడు కాదు అంటాడు. ఇక ఒకే విషయాన్ని ప్రేమించే వాళ్ళు పదిమంది చేరి ఆ ప్రేమకోసమే తపించే ప్రయత్నంలో పక్కవాడి ప్రేమకంటే నా ప్రేమ ఎక్కువనే భావంలో అనేక తగాదాలు.
 ఒక చిన్న ఉదాహరణ :
 స్క్రిప్టులో ఇలా ఉంది తీసుకుందాం : రాముడు చేతిలో వంగిన ధనుస్సు  పెళపెళమంటూ విరగగానే ,చేమంతిపూలవర్షం కురిసింది. సభలోని రాజులందరూ హర్షధ్వానాలు చేసారు. సీత ముఖం సంతోషంతో , సిగ్గుతో వెలిగిపోయింది. దశరధుడి ఒళ్ళు పులకించింది.
  ఇక్కడ ఏ డైలాగూ లేదు. ఇంత సులభంగా కనిపించే ఈ సన్నివేశం తెరకెక్కించాలి అనుకుంటే, ఇక్కడ ప్రధాన పాత్రధారులు కేవలం ముగ్గరే. తక్కినవారంతా "ఎక్స్‌ట్రాలు "
 సెట్టింగును ఆర్టు డైరెక్టరు చూసుకున్నాడు. మనం ఈ సన్నివేశాన్ని కేవలం మూడే షాట్లుగా విభజించుకున్నాం. మొదటి రెండు వాక్యాలూ లాంగ్ షాటు, టాప్ ఏంగిల్. రెండవ వాక్యమూ, మూడవదీ టైట్ క్లోజప్పులు.  నాకు తెలిసి ఈ సన్నివేశాన్ని ఇంతకంటే సులభంగా తీయలేము. (అస్సలు ఎఫెక్టు లేకుండా ఉండాలంటే దశరధుడినీ , సీతనూ కూడా ఎక్స్‌ట్రాల్లో కలిపేసి ఒకే షాటు లాగించెయ్యిచ్చు...కానీ అప్పుడు స్క్రిప్టు అన్యాయం అయిపోతుంది )
  ఇక్కడ షూటింగులో ఉంటాయి కష్టాలు. దశరధుడికి కిరీటం సరిగా సరిపోదు. దాన్ని ఎంత సరిచేసినా కుదరదు. సరే అప్పుడు రాజీ పడి , రాముడి కిరీటం అతనికి మారుస్తాం. ప్రాక్టీసులో ధనుసు ఎలా విరగాలో పదిసార్లు చేస్తే, తీరా షాటులో అది విరగదు. అందుకని రీ టేకులు వెళ్తుంటే , రాముడి పాత్రధారికి చంకల్లో చెమట పోసీ పోసీ చిరాకు వచ్చి "ఎన్నిసార్లు విరచాలి" అంటాడు. అతడిని బుజ్జగించి షాటుకు సిద్ధపడితే , విల్లు విరుగుతుంది , చేమంతులు పడ్తాయి, ఎక్స్‌ట్రాలు చప్పట్లు ఆలస్యంగా కొడతారు. మళ్ళీ రీ టేకు . ఈ సారి పువ్వుల్లో ఒకటి రాముడి ముక్కుకు తగిలి అతను షాటులో గాఠ్ఠిగా తుమ్మేస్తాడు. ఇంకో టేకు, అంతా సవ్యంగా జరిగినా దర్శకుడికి ఎందుకో ఏదో టైమింగు మిస్ అయినట్లు అనిపిస్తుంది. రాముడు విల్లు విరిచినప్పుడు ముఖంలో విసుగు కనిపిస్తున్నట్లు, చప్పట్లు కొట్టే ఎక్స్‌ట్రాల ముఖాల్లో ఆకలి గోచరిస్తుంది. సో లంచ్ బ్రేక్.
   భోజనం బ్రేకు అరగంట అనుకున్నది , గంట అవుతుంది. ఈ లోగా సినిమాటోగ్రాఫర్‍కు విరోచనాలు. తట్టుకుని నిలబడతాడు. టేకుకు వెళితే , అంతా సవ్యంగా జరుగుతున్న సందర్భంలో కెమెరాలో ఫిలిం ఫుటేజ్ సగంలో అయిపోతుంది. క్యాన్ మార్చాలి కాబట్టి , షాటు కట్. ఈసారి టేకులో , విల్లు లాగిన కుదుపుకు రాముడు తూలిపడతాడు. అసహ్యంగా ఉంది రీటేక్. కుమ్మరించడానికి పువ్వులు అయిపోయాయి అని అసిస్టెంటు బిక్కముఖం వేస్తాడు. అర్జెంటుగా వెళ్ళి పట్టుకురమ్మని పంపుతారు. ఈలోగా సమయం వృధా ఎందుకని క్లోజప్ షాటులకు దిగితే ,
   ఇంతసేపూ ఖాళీగా ఉన్న సమయంలో సీత పాత్రధారి ఫోన్‍లో తన ప్రియుడితో మెసేజ్ ఛాటింగ్ చేసింది, వాళ్ళా మధ్య గొడవ అయింది. ఇప్పుడు సిగ్గు , సంతోషం వెలిబుచ్చడం ఆమెకు చేతనవ్వట్లేదు. నాలుగు టేకులు తిన్నాక అనుకున్న అభినయం రాకపోవడంతో విసిగి, మూడ్‍లోకి రావడానికి ఒక అరగంట టైం అడిగింది. ఆ అమ్మాయి మంచి నటే. ఇలాంటి స్థితిలో ఒక్కతే మేకప్ రూంలో దూరి అద్దం ముందు ప్రాక్టీసు చేసుకుని తర్వాత అద్భుతంగా చేస్తుంది. సరే అని ఆ అమ్మాయికి ఆవకాశం ఇచ్చి దశరధుడి క్లోజ‍ప్‍కు వెళితే , ముందు అనుకున్న కిరీటం కాక వేరేది పెట్టడంతో ఆ కిరీటం క్లోజప్ ఫ్రేమింగులో ఇమడడం లేదు. లెన్సు మారిస్తే మిడ్ క్లోజప్ అవుతోంది. సరే విసిగిన దర్శకుడు రాజీ పడి అలాగే షాటు లాగించేస్తాడు. పువ్వులకోసం వెళ్ళిన అసిస్టెంటు ఫోన్ చేస్తాడు , తెలుగుదేశం పార్టీ నేత ఏదో ఊరేగింపు కనుక చామంతులు అన్నీ మార్కెట్‍లో అయిపోయాయి, ఏ పువ్వులు తేవాలి అని ? దర్శకుడికి ఉక్రోషం నీరసం వస్తాయి. సెట్‍లో మిగతా రంగుల మధ్య చామంతులు అయితేనే బావుంటాయని కదా అవి ఎన్నుకుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి ? మల్లెలు వేద్దాం అంటాడు. సినిమాటోగ్రాఫర్ ఒప్పుకోడు. లైట్ల వెలుగు తెల్లటి మల్లెలు అసలు కంటికి తెలియవు , మల్లెల ఎక్స్‌పోజర్ సరిపోయేట్లు లైటింగ్ మార్చాలి అంటే ఇంకో అరగంట సేపు చాలా మార్పులు చెయ్యాలి అంటాడు. కాల్షీట్ల టైం ఎక్కువలేదు కాబట్టి అలా ఒద్దు అనుకుంటే , ఏ గులాబీలతోనో కనకాంబరాలతోనే లాగించొచ్చు అంటాడు. ఆ రంగు రావడం దర్శకుడికి ఇష్టం లేదు. అప్పుడు హీరో సలహా ఇస్తాడు. హీరోయిన్ సలహా ఇస్తుంది. అసిస్టెంట్లు సలహాలు ఇస్తారు . దశరధుడూ సలహా ఇస్తాడు. వీళ్ళందరి సలహా నేను వినడం ఏంటని, ఇంతకుముంద్ నేలరాల్చిన పూలనే మళ్ళీ పోయమంటాడు దర్శకుడు, కనీసం అలా అయినా రాజీ పడకుండా షాటు తీయొచ్చు అని. దుమ్ములో పడిన పూలా అని హీరోకు కోపం వస్తుంది. అతడిని బుజ్జగించి , చివరకు కొన్ని మల్లెలు , కొన్ని గులాబీలూ, కొన్ని రాలిన చేమంతులూ అన్నీ కలిపి పోసేందుకు ఒప్పందం కుదురుతుంది. ఇప్పుడు కాల్షీటుకు ఇరవై నిముషాలే టైం ఉంది. మూడు షాట్లు కుదరవు. అన్నీ కలిపి ఒకే షాటుగా చెయ్యడమే మార్గం.
 దర్శకుడికే కాదు , అందరికీ బాధ అనిపిస్తుంది . అప్పుడు , అంతసేఫు నోరెత్తకుండా కూర్చున్న , కెమెరా అసిస్టెంటో లైట్ బోయో ధైర్యం చెబుతాడు " మీరు చెయ్యండి సారూ , మూడు షాట్లూ తీసేద్దాం కావాలంటే కాల్షీటుకంటే ఒక పది నిముషాలు లేటైనా ఫర్లేదులే " అని.
  అంతసేపూ ఎంత చాదస్తంతో , అహంతో , నిర్లక్ష్యంతో వ్యవహరించిన వారికయినా ఆ క్షణంలో సినిమా మీది తమ ప్రేమ పెల్లుబుకుతుంది. యుద్ధంలా పని జరుగుతుంది. అనుకున్నది అనుకున్నట్లు రాకపోవచ్చు , కానీ ఏదో లా అనుకున్న షాట్లు మాత్రం వస్తాయి.
      ఇదంతా కలిపితేనే GENERATION LOSS.  రచయిత వ్రాసినదానికీ , దర్శకుడు ఊహించుకున్నదానికీ మధ్య ఇన్ని శక్తులు చేరి " నేను అనుకున్నట్లుగా ఈ సినిమా లేదే" అనేట్లు తయారవుతుంది. ఒక్కోసారి generation gain కూడా జరగొచ్చు, (నటీనటులు అత్యంత ఉత్తములైనప్పుడు) కానీ అది చాలా అరుదు.
     సినిమా తీసే ప్రతివాడూ అనుభవించే ఘట్టం ఇది. ముఖ్యంగా independent film making లోనూ , ప్రేమతో సినిమా తీసే సందర్భంలో. ఆ షూటింగ్ సమయం అంతా నరకంలా ఉంటే, అయిపోయాక తలుచుకుంటే అదొక తియ్యటి అనుభవమే.
     అలాంటి తియ్యటి అనుభవాన్ని కలిగించే ఒక సినిమా ఈ మధ్య తెల్లవారు ఘామున సోనీ పిక్స్ ఛానెల్‍లో చూసాను. ఎన్నోసార్లు ఎంతో మంది చెప్పినా ఎందుకో ఈ సినిమా చూడటం జరగలేదు. కానీ అనుకోకుండా చూసినప్పుడు, మనసంతా అటువంటి ఙ్ఞాపకాలతో నిండిపోయింది.
  సినిమా తీయాలి అనుకునే ప్రతివాడూ , సినిమా పట్ల ప్రేమ చావని వారూ, తొలి షూటింగు అనుభవాలను గుర్తు చేసుకోవాలి అనుకునేవారూ తప్పక చూడాల్సిన..కాదు కాదు "అనుభవించాల్సిన" చిత్రం ఇది. పేరు : LIVING IN OBLIVION
  ఆ సినిమాను నేను మళ్ళీ ప్రత్యేకంగా సమీక్షించను, ఎందుకంటే ఇంతసేపూ పైన చెప్పినదంతా ఆ సిన్మాకు నా ట్రైలర్ లాంటిదే. నటీనటుల ప్రతిమ, సినిమా తీసిన విధానం , బడ్జెట్ ఇవన్నీ నేను చెప్పడం కాదు సినిమా చూసాక మీకే తెలుస్తాయి. ఇది సినిమా కాదు , ఒక అనుభవం .  ఒక శాంపుల్ ఇక్కడ ఇస్తున్నాను. ఎన్నో అవాంతరల తర్వాత చివరకు షాటు జరుగుతుంటే , ఎవరో చేతి వాచీ అలారం శబ్దం కారణంగా ఆ షాటు ఆగిపోతే ఆ దర్శకుడికి కలిగే ..వర్ణణాతీతమైన ఆ అనుభవం ..ఇదిగో...
 

ఈ సినిమాను నేను  టీవీలో చూసాను కాబట్టి , చాలా బూతు మాటలు కట్ చేసారు.కానీ ఆ సందర్భాల్లో ఆ వ్యక్తులు ఆ మాటలు అనడమే ఉచితం అనిపిస్తోంది. ఇలాంటి సందర్భాల్లో కూడా వి/అనకపోతే ఇక బూతుమాట ఉనికికే అర్థం లేదు. కాబట్టి తప్పకుండా డౌన్‍లోడ్ చేసాక సౌండు బాగా పెంచుకుని, సినీ ప్రేమికులైన స్నేహితులెవరైనా ఉంటే కలిసి పార్టీ చేసుకుంటూ చూసుకోండి. లేదూ..ఒక్కరే చూసి మీలో మీరే మురిసిపోండి. సినిమాను ప్రేమించని / గౌరవించని వ్యక్తులెవరైనా ( స్నేహితులైనా/ స్పౌజ్ అయినా ) పక్కన ఉండనివ్వకండి. వాళ్ళకు ఇది అర్థం కాదు , నచ్చదు.
    డీవీడీ దొరకనీ/ డౌన్‍లోడ్ చేసుకోలేని వాళ్ళు ముక్కలుముక్కలుగానే మొత్తంగా యూ ట్యూబ్‍లోనూ చూడొచ్చు , ఒక పార్టు చూస్తే రెండవ పార్టు లింకు కనిపిస్తుంది.
             http://www.youtube.com/watch?v=xCwED9gZ2do&feature=related
ఫైనల్‍గా ఒక ఘలక్ :
  పైన చెప్పిన షూటింగు ఉదాహరణలో , చివరకు అంతా గడిచాక, ఫుటేజ్ అంతా ఎడిటింగ్‍కు వెళ్ళాక అర్థమైంది , ఒక పే...ద్ద తప్పు జరిగిపోయిందని. అది ఏమిటై ఉంటుందో ఊహించండి , సినిమా తీయడంలో ఎంత టెన్షనో తెలిసొస్తుంది.