అమ్మ చచ్చిపోతోంది. చెయ్యి పట్టుకుని కూర్చున్నాడు నాన్న. ఏడవటం లేదు తను. నవ్వడం కూడా లేదు. కళ్ళు తెరుచుకుని చచ్చిపోయిన మనిషిలా కదలకమెదలక ఉన్నాడు.
రూంలో మూడే మూడు శబ్దాలు. అమ్మ గుండె చప్పుడును తెలుపుతూ మిషన్... బీప్ బీప్. నాన్న శ్వాస. నాకు మాత్రమే విన్పిస్తున్న నా గుండె దడ.
ఏమాలోచిస్తున్నాడో నాన్న . " రేపట్నుంచీ ఇడ్లీలెవ్వరు చేస్తారు " అనేమో.
నాకొక్కటే బాధ. ఈమె ఇప్పుడే చావాలా ? " ఆ అమ్మాయిని పెళ్ళిచేసుకోవడానికి నేను చచ్చినా ఒప్పుకోను " అదే నేను విన్న ఆమె ఆఖరి మాట. హార్ట్ అటాక్ వచ్చే ముందు రాత్రి , అన్నంలోకి చారు పోస్తూ ఆ మాటనేసి వెళ్ళి పడుకునేసింది. ఇక ఆ అమ్మాయి మొహం ఎలా చూడను ? బ్రతికుంటే ఇంకో మాట అనేదేమో. ఒక్కసారి బ్రతికి వేరేమాట అని తర్వాత కావాలంటే చచ్చిపోకూడదూ? తాను పలికే మాట జీవితపు చివరిమాట కావొచ్చు అనే భయం ఆ రాత్రి ఆమెకు లేదు. ఎవరికైనా ఎలా తెలుసు మరు నిముషం ఉంటామని.
ఏడుపూ కోపం కలిసొచ్చేసి గదిలోంచి బయటకొచ్చేసాను . మనుష్యులెందుకు చావాలసలు ? చచ్చేంత అల్పమైన మన బ్రతుకులకు మాటలు అవసరమా.. ఏమిటేమిటో ఆలోచనలు వస్తున్నాయి
"can I come and see her once, if you are okay with it " ఆ అమ్మాయి smsతో వెక్కి బరువెక్కింది సెల్ ఫోన్. తలెత్తి చూద్దును కదా , ఎమర్జెన్సీ వార్డు గాజు తలుపు అవతలి ప్రపంచంలో బందీగా ఉంది తను. అంత దూరంనుంచీ స్పష్టంగా ప్రవహిస్తున్నాయి తన చూపుల్లోని ఆశ. అమ్మ అంటే తనకు ఇష్టం. పూర్తి అమ్మ తెలీదు తనకు. నేను వర్ణించిన గొప్ప అమ్మ తప్ప. చాలా గొప్పగా చెప్పాను. చాలా ఇష్టం తనకు. రమ్మంటే?
ఇడ్లీలు చేసిపెట్టే మనిషొకరు దొరుకుతున్నారని నాన్న కూడా సంతోషిస్తాడామో . తనొచ్చి అమ్మ చెయ్యి పట్టుకుంటే , సినిమాల్లో , కథల్లో జరిగినట్లు ఏమైనా ‘అద్భుతం’ జరిగి అమ్మ బ్రతికేస్తే !
నేను రమ్మనలేదు. అయినా తలుపు తీసుకుని వస్తోంది. వొద్దని చెప్పాలనుకున్నాను. నోరు రాలేదు. చేయి పట్టుకుని చెప్పగలిగాను. అర్థం అయింది తనకు. స్పర్శతో మనసు గ్రహించేంత శారీరిక కలయిక మా మధ్య కొత్తేమీ కాదు. అభిమానం తెగి తన కంటి చివర చిప్పిల్లింది. ఘడియ సేపే చూసానేమో. ఎన్నెన్ని భావాలు మారాయి ఆమె ముఖంలో. రోషం , కోపం , ఆవేదన, నొప్పి , ఆర్ద్రత , జాలి. ఒద్దంటే వంటింట్లో దూరి పెనం పై చేయి వేసి కాల్చుకున్నప్పుడు అమ్మ చూసిన వైనం గుర్తొచ్చింది. ఈ నిముషమే నేనూ చచ్చిపోతే ! " ఆంటీను చివరి చూపు చూట్టానికి కూడా వొదల్లేదు , నేనంటే నమ్మకం ప్రేమ లేదు అతనికి " అదే ఆమె ఆఖరి భావం అవుతుంది. అమ్మ చేసిన తప్పు నేను కూడా చెయ్యాలా ?
గదిలోకి ఇంకో ఊపిరి శబ్దాన్ని వెంటబెట్టుకెళ్ళాను.
మన నిర్ణయాలకు మించిన "అద్భుతం" ఏదీ జరగదు జీవితంలో.
బీ...ప్.