ఈ ఘడియ ఒక మనిషి
చచ్చిపోతున్నాడు
ఈ ఘడియ నేను
ఈ వాక్యాలు లిఖిస్తున్నాను
ఈ ఘడియ మీరు
చదువుతున్నారు
ఈ ఘడియ ఒక మనిషి
ఎందరో మనుష్యులు
చచ్చి
పోతున్నారు
వీరోచితంగానో
అనామకంగానో
పోయినవారు పోయినట్లే
ఛస్తానని తెలిసిన
ప్రతి మనిషీ జీవించాలి అని అభిలషిస్తాడు
నేనూ ఒక సాధారణమైన
మనిషిని
కావాలి కావాలి
కావాలి
జీవం
నిమిషం నిమిషం
ఛస్తానని తెల్సిన
మనిషి పునరుత్పత్తి చేస్తాడు
బిడ్డలు పిల్లలు
కొడుకులు కూతుర్లు కుటుంబాలు
పునరుత్పత్తి
ఒక జంతుభావం
దానికి తగిలించు
కొంచెం కవిత్వం
పోల్చు ప్రకృతితో
గ్రహాలతో
జంతువులతో
అతి సాధారణ సృష్టి
కార్యాన్ని పాపం కాదు చెప్పడానికెన్ని ముసుగులు
శాస్త్రాలు మతాలు
కట్టుబాట్లు ఆచారాలు విప్లవాలు
దాటి దాటి
మనలను మనం మోసం
చేసుకుని
పేర్లు పెట్టుకుని ః ప్రేమ అనీ ఆరాధన అనీ భక్తి అనీ ఏదీ లేని ప్లెటోనీ
అనీ
ఆమె పువ్వులేరకుంటే
నేను షర్టూ పేంటూ
తగిలించుకోని
ఒక కుక్కలాంటి
జంతువునయితే
ఎందుకు ఈ వ్రాతలు
ఎందుకు మీ చదువులు
కానీ కాదే …పుట్టాం
పెరిగాం మనుష్యులై
రేపు ఉదయం ఈ
నగరం మునిగిపోతుంది రాలిన పువ్వులతో
వస్తుంది ఆ ఏంజెల్
చూస్తాడు ఈ మానవుడు
కథ మొదలు
పాఠకులు సిద్ధం
పక్కన ఎవరో మనిషి
ఛస్తూ ఉంటాడు