"తప్పేంటి..వాళ్ళూ మన క్లాస్‍మేట్సే కదా"
"కాదురా. వాళ్ళు వేరే "
"ఎలా? "
"ఎలా ఏంటీ వాళ్ళు లేడీస్.. మనం మొగాళ్ళం. మనకు మీసాలొస్తాయ్"
"వాళ్ళకు?"
"హి హి..అది కూడా తెలీదా, వాళ్ళకూ ఛాతీమీద రెండు బాల్స్ వస్తాయి, వాటిల్లోంచి పాలు వస్తుంది. వాళ్ళతో ఆడుకుంటే నువ్వూ మాతో కలవడానికి వీల్లేదు"
బాలబకాసురుడి సైజులో ఉండే ఒక పన్నెండుపదమూడేళ్ళా బాలుడు , తన స్నేహితుడిని తమ గ్యాంగులోంచి వెలివేస్తూ చెప్పే మాటలివి.
ఆడామగా తేడా తెలియక పక్కపక్క ఇళ్ళలో పెరిగిన ఒక అబ్బాయి , అమ్మాయిల స్నేహంలో వీడో పే...ద్ద విలను
మీసాలు రాని ఆ అబ్బాయి హీరో
రెండు జళ్ళేసుకుని పీచు మిఠాయి తినే పిల్ల హీరోయిన్.
ఇప్పుడు హీరోయిన్ కావాలా , మగతనం కావాలా అనే సందిగ్ధంలో మన హీరో ఏం చేసాడు, ఏం గెల్చుకుని ఏం ఓడాడు అనేది కథ.
చిన్నతనంలో మచ్చటపడి చేసుకున్న గాలిపటాన్ని చేజార్చుకుంటే , మళ్ళీ ఓ పదిహేనేళ్ళ తర్వాత అది మనకు దొరికితే ??
ఎంత తియ్యటి అనుభవం. అలానే ఈ కథానాయకుడు ఆ చిన్ననాటి స్నేహితురాలి పెళ్ళికార్డు చూసి , ఆమెకోసం ఊరెళ్తూ తలుచుకునే బాల్యం ఈ చిత్రం.
ఇక ఆ చిన్న పిల్లలు..సినిమాను ఆడేసుకున్నారు. ముఖ్యంగా తిండిపోతుగా వేసిన లావు పిల్లాడు , మనం చెప్పుకునే ఏ విలన్ , క్యారెక్టర్ నటులకూ తీసిపోడు. సినిమాను రెండు చేతుల్లో తినేసి తన నిక్కరుకు తుడిచేసుకున్నాడు.
2003లో తైవాన్ బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమా" FAN CHAN"ను world moviesలో వచ్చిన ప్రతిసారీ చూసుంటాను. అయినా ప్రతిసారీ ఏదో కొత్తదనం కనిపిస్తుంటుంది. వాళ్ళా భాష మన సాగతీతల్లానే ఉండటమో , ఆ కథాంశం దాదాపు ప్రతి పిల్లాడికీ ఎదురయ్యే ఙ్ఞాపకం లాంటిది కావడమో , ఇవేమీ కాక కేవలం ఆ పిల్లల అద్భుత నటన, అందమైన చిలిపి చేష్టలో , కన్నీళ్ళు పెట్టించే సున్నితమైన సన్నివేశాలో..లేక ఇవన్నీనో.. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ఒక cute movie.
నచ్చకపోయే సమస్య లేదు
భార్యాభర్తలే చూస్తారో , పిల్లలతో కలిసి చూస్తారో , చిన్నపటి స్కూల్ స్నేహితుల రీ యూనియన్ వేసుకుని చూస్తారో..ఎలా అయినా సరే తప్పక చూడండి.
నేను పైరసీకి పచ్చి వ్యతిరేకిని.
తీవ్రంగా ఖండిస్తాను.
కానీ... ఈ సినిమా ఎక్కడ అమ్ముతారో నాకు తెలియదు. youtubeసహా అన్నిచోట్లా దొరుకుతోంది. కాబట్టి , పైగా.. ఏడేళ్ళనాటి సినిమా, ఎక్కడో నలుగురు తెలుగువాళ్ళం అయిన మనం చూస్తే ఈ సినిమా హక్కుదారులకు పెద్ద నష్టం వస్తుందనుకోను కనుక , ఇవిగో నాకు దొరికిన లింకులు ఇస్తున్నాను. అయినా పైరసీ పాపమే.
కాకపోతే ఈ పాపం చెయ్యకతప్పదు. తప్పక ఏదోలా ప్రాయశ్చితమో , పరిహారమో చేస్కోండి. లేకపోతే ఆ పిల్లల కష్టం మనం దోచినట్లే.
http://kobunagaplace.blogspot.com/2009/07/fan-chan-aka-my-girl-2003-thai.html
సినిమ డౌన్లోడ్ చేసుకునేదాకా ఆగలేకుంటే ఈ పాట చూస్కోండి.
మనతో సైకిలు తొక్కిన స్నేహితుల్లు ఎక్కడున్నారో ఏమో కదా!
ఇక స్కూలులో స్టెజెక్కి డ్యాన్సు చేసిన చిన్ననాటి అప్సరస ఎక్కడుంటుందో!
