Thursday, April 04, 2013

బుధ్ధుడు తెచ్చాడు ఒక అమ్మాయిని - 4

అతనొచ్చాడు  కళ్ళుమూసుకుని
నిద్రరాక నేను నిలుచుని నిద్రపోతూ అతను
ఊపిరి కూడా చేయదే సద్దు
పసిపాపడి ఇన్నొసెంట్ ఫేసేసుకుని
ఆడపిల్ల చిర్నగవు పూసుకుని
చచ్చి దెయ్యమైన ముద్దుగారే పక్షిపిల్లలా
అతనొచ్చాడు
నా మెలకువలోకి
అక్కడే ఆ పక్కనే ఏరుకుంటోంది ఈ పిల్ల
చచ్చిన పువ్వులను
తరాల మానవ చరిత్ర శవాలను దాచుకున్న ప్రెగ్నెంట్ నేలపై
రాలే పూలు
నిలబడి మేము ముగ్గరం

నీకేంటిక్కడ పని ?
అతని నవ్వు అంచుని నిలేసాను
పువ్వులా మరింత విరిసింది
మోసాన్ని తట్టుకోవచ్చు
మోహాన్ని జయించొచ్చు
దాహాన్ని అణచొచ్చు
కానీ ఇలాంటి నవ్వును
పూజించడం తప్ప మరేం చేయను

నేలలొకి మోకాళ్ళు దిగేసాను
ప్రణమిల్లి
బిచ్చగాడిలా... అడుక్కున్నాను
శాంతి కావాలి
అంటే ఆ అమ్మాయి కావాలి
అంటే ఆ పూవుల కథ తెలియాలి
అంటే మరి నువ్వు చెప్పాలి
నువ్వే
చెప్పాలి
దేవా..
ఎందుకో కళ్ళు కురిసాయి
చెంపలు వొణికాయి
ఆ పిల్ల ఏం పట్టనట్లు ఏరుకుంటూనే ఉంది
పనికిమాలిన పూవులు ఛస్తూనే ఉన్నాయి
నా గదిలో ఏసీలో నా మెదడులో ఇదంతా
లోకం అంతా నిద్రలో
నేను భ్రమలో

Thursday, February 21, 2013

బుద్ధుడు తెచ్చాడు ఒక అమ్మాయిని - 3


ఈ ఘడియ ఒక మనిషి చచ్చిపోతున్నాడు
ఈ ఘడియ నేను ఈ వాక్యాలు లిఖిస్తున్నాను
ఈ ఘడియ మీరు చదువుతున్నారు
ఈ ఘడియ ఒక మనిషి
ఎందరో మనుష్యులు
చచ్చి
పోతున్నారు
వీరోచితంగానో అనామకంగానో
పోయినవారు పోయినట్లే
ఛస్తానని తెలిసిన ప్రతి మనిషీ జీవించాలి అని అభిలషిస్తాడు
నేనూ ఒక సాధారణమైన మనిషిని
కావాలి కావాలి కావాలి
జీవం
నిమిషం నిమిషం
ఛస్తానని తెల్సిన మనిషి పునరుత్పత్తి చేస్తాడు
బిడ్డలు పిల్లలు కొడుకులు కూతుర్లు కుటుంబాలు
పునరుత్పత్తి ఒక జంతుభావం
దానికి తగిలించు కొంచెం కవిత్వం
పోల్చు ప్రకృతితో
గ్రహాలతో
జంతువులతో
అతి సాధారణ సృష్టి కార్యాన్ని పాపం కాదు చెప్పడానికెన్ని ముసుగులు
శాస్త్రాలు మతాలు కట్టుబాట్లు ఆచారాలు విప్లవాలు
దాటి దాటి
మనలను మనం మోసం చేసుకుని
పేర్లు పెట్టుకుని  ః ప్రేమ అనీ ఆరాధన అనీ భక్తి అనీ ఏదీ లేని ప్లెటోనీ అనీ
ఆమె పువ్వులేరకుంటే
నేను షర్టూ పేంటూ తగిలించుకోని
ఒక కుక్కలాంటి జంతువునయితే
ఎందుకు ఈ వ్రాతలు ఎందుకు మీ చదువులు
కానీ కాదే …పుట్టాం పెరిగాం మనుష్యులై
రేపు ఉదయం ఈ నగరం మునిగిపోతుంది రాలిన పువ్వులతో
వస్తుంది ఆ ఏంజెల్
చూస్తాడు ఈ మానవుడు
కథ మొదలు
పాఠకులు సిద్ధం
పక్కన ఎవరో మనిషి ఛస్తూ ఉంటాడు

బుద్ధుడు తెచ్చాడు ఒక అమ్మాయిని - 2


టాగోర్ మాట చెలం తర్జుమాలో చదువుతున్నాను
కిటికీ ఆవతల గంటనుంచి పిలుస్తోంది వర్షం
ప్రొద్దున్న మందారాలకు నీళ్ళు అవసరం లేదు
మనశ్శాంతికి పెద్ద కారణాలెందుకు
చెడిపోవడానికో సిగిరెట్టు
గీతాంజలిని లంగ్స్ లో నింపుకుంటుంటే గుర్తొచ్చేసింది తను
ఆమె జుత్తులోని పాములలో ఒకటి తప్పించుకొచ్చి నా పక్కన ఎక్కడో జరజర పాకినట్లు
ఒక దేవత స్పర్శ హఠాత్తుగా వీపుపై చలి పెంచింది
కాంక్రీటు రోడ్డుపై తలబద్దలు కొట్టుకుని ఛస్తున్నాయి చినుకులు
వాటి జీవన్మరణాలు నా రసాస్వాదనలకు నాంది
రేపు పువ్వులేకాదు కొమ్మలూ రాలిపోతాయ్
వాన రాత్రి చంద్రుడికి నిద్ర
అలారం పెట్టాను సూర్యుడికి
రేపొక్కసారి ఆమెను చూపించు ప్రకృతీ
ఈసారి మాట్లాడాలి
తెలుసుకోవాలి
చెట్టులో పువ్వులను తెంపి తల్లో పెట్టుకునే క్రూరమైన స్త్రీల మధ్య
రాలిన కుసుమాలతో మనసునింపుకుంటున్న నీవెవరని
అడిగేస్తాను 
నా పిరికితనం బాగా తెలిసిన ఆకాశం ఉరిమింది
పసివాడిని కానిప్పుడు
గుండెలోపలెక్కడో మిగిలి ఉన్న బాల్యం వొణికింది
దాక్కోవడానికి ఒక కలను వెతుక్కుంటూ కళ్ళు మూసాను

Saturday, February 16, 2013

బుద్ధుడు తెచ్చాడు ఒక అమ్మాయిని - 1

 ఒక ఉదయం పార్కులో అలసటలో చూసాను తనను.
రాలిపోయిన పువ్వులు ఏరుకుంటోంది
నిద్రలేని కళ్ళతో ఫోటో తీసుకున్నాను ఆ స్వప్నచిత్రాన్ని
రాలిపోయిన పువ్వులు ఏరుకుంటోంది
రాత్రి మంచుని నేలలోకి తొక్కేస్తూ అటూ ఇటూ జనం
కొందరి బూట్ల క్రింద నలిగిపోతూ కొన్ని పువ్వులు
అవి చూసినప్పుడల్లా ఆమె కళ్ళల్లో వేదన నీడలు
ఏం చేసుకుంటావు వాటిని ?
అడగలేక మింగేను ప్రశ్నను
పెళ్ళి చేసుకోబోతున్న అమ్మాయి గుర్తుకొచ్చింది
చేదుగా
ఇలాంటి అమ్మాయి ఒక్క నెల క్రితం తారసపడిఉండకూడదా ?
వెధవ జీవితంలో అన్నీ లేటే
రాలిపోయిన పువ్వులేరుకుంటోంది తను
నా దగ్గరకొచ్చి
తలెత్తి చూస్తుందేమో అని ఆశపడ్డాను
తనకేం అవసరం
రాలినపూవులతో పేర్చిన రోడ్డు ముందుండగా.. మనిషెందుకు తనకు ?
పాములా వెళ్ళిపోయింది
కాటేస్తాయి , విషం అనే భయమే లేకపోతే ఎంత అందమైనవో పాములు
ఆమె జుత్తులో ఇంకా చాలా పాముపిల్లలున్నాయి
మెడూసా !
చూసేసాను మరి
ఉన్నానా పోయాను
వెనుదిరిగి చూసాను
నా శవం ఏమీ లేదు అక్కడ
 ఆత్మ మాత్రం అతుక్కుపోయి ఉంది
తన అడుగుజాడల వెంట
జొల్లు కార్చుకునే రోడ్ సైడ్ రోమియోలా
మర్యాదస్థుని మొహమేసుకుని నా దారిన నేను
బ్రాండెడ్ బట్టలేసుకున్న దేహాన్ని నడుపుకుంటూ
రేపు రావాలి
ప్రకృతీ , దేవుడూ , మంచితనమూ సత్యం అయితే
పువ్వులు రాలుతాయి
తను వస్తుందా ?

Monday, October 29, 2012

కాటుక కళ్ళు కూకట్ పల్లి - 2



శరీరం మన మాట వినని సందర్భాలు చాలానే ఉంటాయ్. క్రిందపడిన మిఠాయిని తిందామా పారేద్దామా అని మెదడు ఆలోచిస్తూ ఉండగానే , ఎక్కడ పారెయ్ అనే సంకేతం వొస్తుందో అనే భయంతో ఏమో హఠాత్తుగా అసంకల్పిత ప్రతీకార చర్యలా గబుక్కున నోట్లోవేసేసుకుంటాము. ఆలోచించడానికి మెదడు అనవసరం శరీరం భావించే అలాంటి బలహీనతకు లోనై.. ఆన్సర్ బటన్ నొక్కేసాడు కమాలకర్.
  “హలో..కమల్..నేను రూత్ ను “
ఈ పిల్లెందుకు ఫోన్ చేసింది ? ప్రశ్నతో అతని కళ్ళు చిన్నవయ్యాయి
“హాలో..కమల్...హలో..హలో”
గంటలా మ్రోగింది ’రూతు’. బూతులా ఈ పేరేంది.. ఆమె పేరుగురించి అతని నిత్య సందేహం అంత కీలకక్షణంలోనూ పొడుచుకొచ్చింది.
“హలో హలో..కమల్..యూ దేర్.. ఆర్యూ దేర్” లౌడ్ స్పీకర్ మోడ్ లో లేకున్నా ఆమె గొంతు అతని గదిలో ప్రతిధ్వనించింది.
“..ఆ... యా..స్ “ యస్ అనాలా యా అనాలా అనేది అతనికెప్పుడూ వొదలని మీమాంస. అందుకే అలా రెండూ కలిపేసి విడగొట్టేసి మేనేజ్ చేసేస్తుంటాడు
“ its mE..Ruth యా “
“యా...స్”
“లిజన్.. నీతో మాట్లాడాలి “
“ ఆ (...”
I want to talk to you yaa “
 అర్థం అయింది..ఇప్పుడు చేసేది అదే కదా”
“ అరే.. అంత temper ఎందుకూ ? కూల్ గా వింటావా...”
గాయత్రి ఫోన్ నుంచి చేస్తున్నావ్ కాబట్టి ఇంకా తిట్టడంలేదు ..నిన్నూ.. “చెప్పు”
“ఎక్కడ రూం లోనేనా “
“నీ రూమా ఏదైనా ఫ్రెండ్స్ రూమా “
“నా రూమ్ లోనే “ ఛాతీమీద కొట్టుకున్నాడు
“ఒక్కడే ఉన్నావా..ఫ్రెండ్స్ ఎవరైనా “
“విషయం చెబ్తావా “
“మందూగిందూ ఏం తాగట్లేదు కదా “
తాగుదాం అని తెచ్చుకుని ఇంకా ఓపెన్ చెయ్యని మూడు ఫుల్ బాటిల్స్..విస్కీ, రమ్ , వోడ్కా..మంచంమీద అతడిని వెక్కిరిస్తూ నవ్వినట్లు అనిపించింది
 “అసలేంటి మేటర్ “ ఇక చిరాకు దాచుకోలేదు
“ మార్నింగ్ త్రీ కు గై పెళ్ళి ”GAYATRI  అనే లక్షణమైన పేరులోంచి గాయ్ విడగొట్టి ఇంగ్లీషు GUYగా మార్చి తన స్నేహితురాలికి తానో గొప్ప క్రియేటివ్ కృష్ణవంశీ అని ఫీలయ్యే రూత్ మొహం గుర్తుకొచ్చింది అతనికి. “ఆ పళంగా ఫోన్ విసిసిరిగొట్టి తద్వారా ఆ రూత్ తలపగలగొట్టినట్లు ఊహించుకుందాం అనుకున్నాడు. కానీ మళ్ళీ సిమ్ మార్చుకోవడానికి మరో స్పేర్ ఫోన్ లేదు అనే వివేకం అంత కోపంలోనూ వెలిగింది
హలో హలో...కమల్ ..you there ? ‘’ మళ్ళీ అరిచింది రూత్
“ ఆ..యా..స్ ”
“మార్నింగ్ త్రీకి గై పెళ్ళి “
“ నాకు తెలుసు ” పళ్ళు కొరికితే శబ్దం రాదేంటా , నవలలలో తప్ప అనిపించింది అతనికి
“ తెలిసీ.. ఊరుకున్నావా ? ఏం ఫీల్ అవ్వట్లేదా ? ” బాంబు లాంటి ప్రశ్న వేసింది
అతనికి సమాధానం తోచలేదు
“ కొంచెం కూడా ఫీల్ అవ్వట్లేదా నువ్వు .. ? ”
సిగ్గు లేకుండా కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకుని ఏడ్చిన రోజుల గురించి చెప్పదలచలేదు అతను . గాయత్రిని అమ్మనాబూతులు తిట్టిన విషయం చెబుదాం అనుకున్నా భయపడ్డాడు.
“ ఏయ్..ఏం మాట్లాడుతున్నావే...చుప్ ” ఫోన్ లో అవతలి వేపు దూరంగా గాయత్రి గొంతు. చెవులు రిక్కించాడు కమలాకర్. తను పక్కనే ఉండి ఈ రూతు చేత ఫోన్ చేయిస్తోందా.. ఎందుకూ ?? కొద్దిసేపు ఇద్దరు అమ్మాయిలూ ఏదో వాడులాడుకున్నట్లు అస్పష్టంగా వినిపించింది. “అది కాదు అదికాదు “ రూత్ అరుస్తోంది. “ ఛుప్..షు...” గాయత్రి అరుస్తోంది
“హలో హలో...” కమల్ కూడా అరిచేసాడు.
గబుక్కున ఏమీ వినపడలేదు. కాల్ చూసుకున్నాడు. కంటిన్యూ అవుతుంది. నిశ్శబ్దాన్ని ఛేదించుకుని లైన్లోకి వొచ్చింది రూత్
 “ కమల్.. గై చెయ్యమంటే చేసాను. ఇప్పటికైనా నువ్వు మారుతాను అని మాటిస్తే.. ”
“వ్వాట్”
“యస్.. she still loves you అంట. కానీ నువ్వు మారుతాను అని మాట ఇవ్వకపోతే తనేం చేయలేదట ”
“ హు..వాట్ నాన్సెన్స్...ఐదుగంటల్లో పెళ్ళి పెట్టుకుని ఏమిటీ పనికిమాలిన డిస్కషన్స్.. ఒకవేళా మారుతాను అని మాట ఇచ్చానే అనుకో , పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటుందా ? ”
“ ఏమో..you never know her ’’
నిజమే..గాయత్రిని అంచనా వేయడం ఎంత అసాధ్యమో అతనికి బాగా అనుభవమే. రూట్ మాటలతో అతనికి ఒక్కసారికి జ్వరమొచ్చినట్లయింది. ఇంకా ఛాన్స్ ఉందా తనకు... ఇంకా...
ఆ కళ్ళు...కాటుక...మెత్తటి చేతి వేళ్ళు ...చెంపలు.. గాయత్రీ మంత్రం..అమ్మ...మొగలిరేకులు..అంతా ఒకే ఇంట్లో...అన్నీ ఙ్ఞాపకాలూ కోట్లసార్లు మల్టిప్లై అయ్యి పదే పదే కనిపిస్తూ అతనిని ఉక్కిరిబిక్కిరి చేసాయ్.
“ ఏంటి చెప్పు ” సైరన్ లా మోగింది రూత్
ఆవేశాన్ని కట్టడి చేసుకుని ఆలోచించాడు. ఏం ప్రామిస్ చెయ్యాలి ? అదే అడిగాడు
“ మీ మధ్య అంత అంత ఆర్గ్యుమెంట్లు అన్నిసార్లు జరిగాయ్ కదా , మళ్ళీ అడుతావే.. తను చెప్పింది కదా నువ్వు ఎలా ఎలా మారాలో ”
లిస్టు గుర్తుచ్చి భయం బాధా కోపం అన్నీ తన్నుకొచ్చేసాయ్ అతనికి.
“చూడు.. ఒక అమ్మాయి పెళ్ళికి కొన్ని గంటలముందు ఇలా అడుగుతోంది అంటే.. ఎంత రిస్క్ చేస్తోందో ఆలోచించు. నీ మంచి కోసం కాకపోతే Guy ఇలా ఎందుకు..” రూత్ ఏదో చెప్పబోతుంటే  “ష్..స్టాప్ ” వెనుకనించు గాయత్రి ఆమెను అదుపు చేస్తున్న శబ్దం వినిపించింది
“ కొంతసేపు ఆలోచించుకుని కాల్ చెయ్యనా ? ” బ్రతిమిలాడేసాడు
“ఎంతసేపు ” కఠినంగా అడిగింది.
పాయింటే అనిపించింది అతనికి. కొన్ని గంటల్లో పెళ్ళి.. గడిచే ప్రతి నిముషం ఆమెను తనకు జీవితకాలం దూరం తీసుకెళ్తుంది. 
“టెన్ ఫిఫ్టీన్ మినిట్స్.. ప్లీజ్ ”
అవతల నిశ్శబ్దం.
“ చూడూ..ఈలోపల ఎవరికైనా కాల్ చేసి సలహా తీసుకో...ఎవరికో ఎందుకూ..if you ask me…” రూత్ ఏదో చెప్పబోయింది “ షూ...” అనే గాయత్రి చిరాకు గొంతు వినిపించి కాల్ కట్ అయిపోయింది.
మెదడంతా మొద్దుబారిపోయింది కమాలకర్ కు.
పదిహేను నిముషాలు
ఒక్క నిర్ణయం
ఒక్క మాట
జీవితం విత్ గాయతి , జీవితం వితౌట్ గాయత్రి
రెండే చాయిస్ లు
రెండిట్లో ఏది తీసుకున్నా తాను తాను కాదు. మారిపోతాడు. ఎలా మారిపోవాలి. అసలు ఎందుకు మారాలి ? ఎందుకు మారకూడదు ? ఏ మనిషైనా ఇంకొకరికోసం ఏం చెయ్యాలి ?

Saturday, October 13, 2012

మా నాన్న తొలి ఙ్ఞాపకం

  నీ జీవితంలో నీకు గుర్తుండిపోయిన మొట్టమొదటి సంఘటన ఏమిటి ? మెదడును ఎంత చించుకున్నా ఇంతకంటె మునుపు జరిగినదేదీ గుర్తుకురానంతగా ఇదొక్కటే గుర్తుండాలి.  సైన్స్ ప్రకారం అయితే ప్రతి పిల్లవాడి మెదడులో తన ఒకటో సంవత్సరంనుండి మెమరీ విభాగం పనిచేస్తుంది.
కానీ ఏ ఙ్ఞాపకం అయినా కొన్నేళ్ళ తర్వాత చెరిగిపోతుంది / మరుగున పడిపోతుంది.మనం గుర్తుంచుకోవాలి అని ఎంతగా అనుకున్నా మనకు కొన్ని గుర్తుండవు. అస్సలు ఏ ప్రయత్నమూ లేకపోయినా అకారణంగా కొన్ని జీవితాంతం గుర్తుండిపోతాయి.
 మా నాన్న ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు... తన తొలి ఙ్ఞాపకాలు కొన్ని దృశ్యాలు అని...

౧. మా తాత వాళ్ళ ఊరు ..(చిత్తూరు జిల్లాలో పెనగడ్డం అనే కుగ్రామం)లో వాళ్ళ గుడిసె ముందు ఒక గుంజ ఉండేదట. ఆ గుంజ దగ్గర కూర్చుని తాత కోడిని కోస్తున్నాడు . (తాత అప్పటికే చదువుకున్న , ఉద్యోగస్థుడు...లాయరు కూడా అనుకుంటా.. 1953-5 ఆ ప్రాంతాలలో.. కానీ ఆదివారం వొస్తే ఆయన ఒక కోదిని కోసుకుని వొండించి తినడం ఇష్టం..1980sలో నేను పుట్టి నా ఙ్ఞాపకాలు స్థిరపడేటప్పటికీ .. ఆయన తిరుపతిలో ప్రముఖ న్యాయవాదిగా సీనియర్ మోస్ట్ అయినప్పటికీ అదే తంతు... ) మా నాన్నేమో గుంజ చుట్టూ వృత్తంలాగా తిరుగుతూ ఏదో కూనిరాగమో పాటో పాడుతున్నాడట. వృత్తంలా అని తను అనుకున్నప్పటికీ బహుశా భూమి చుట్టూ చంద్రుడు తిరిగినట్లు eclipse పథంల తిరుగుతున్నాడే్మో.. తన ఆ ప్రయాణం (!) లో అప్పుడప్పుడూ తాతకు దగ్గరగా వచ్చేవాడుట. అప్పుడు ఆయన , కాల్చిన కోడి చర్మాన్ని చిన్న ముక్కగా తన నోటికి అందించేవాడు.
  ఈనాటికీ ఆ సంఘటన..  దృశ్యపరంగనూ , రుచిపరంగానూ , వాసనపరంగానూ తనకు బాగా గుర్తుండిపోయిందట. ఇందులో ఇంత అవసరమైన విషయం ఏముందీ అని నేను అడిగితే... ఏమీ లేదు అంటాడు.  కానీ నాకు అనిపిస్తుంది... ఆ గుడిసెకు దూరం అయిపోవడమ్ వల్ల, పెద్దయ్యాక తాతతో తర్వాత చాలా అభిప్రాయభేదాలు రావడం వల్ల ఆయన తనతో చాలా ఆప్యాయంగా ఉన్న ఆ చిన్న సంఘటన subconscious levelదాటి ఇలా ఒక శాశ్వత ఙ్ఞాపకంగా ఉండపోయిందేమో .

౨. ఒకసారి అదే ఊరిలో.. చెరువుగట్టు దగ్గర   ‘ఎవరితోనో ’ ఆడుకుంటుంటే
ఎవరో ఒకావిడ
పిలిచి ,
తమ గుడిసెలోకి తీసుకెళ్ళి ,
 కూర్చోబెట్టి
గుడిసె చూరుకు కట్టిన ఒక ముంతలోంచి
చెరి రెండు
నిప్పట్లు  ( బొబ్బట్లు / బూరెలను మావేపు అలా అంటారు )
పెట్టి వాటిపైన వెన్నముద్ద వేసి తినమందట.
 ఈ రోజుకీ ఆమెవరో , తనతో ఆడుకుంటున్నదెవరో , ఆమె ఎందుకు పిలిచిందో ( బహుశా తనకు తెలీని బంధువులేమో అని ఇప్పుడు అనుకుంటారు ) ..ఏమీ గుర్తులేవు ...కనీసం ఇంతకుముందు ఙ్ఞాపకంలోలా రుచి కూడా గుర్తు లేదు. కానీ ఏవో బొమ్మ గీసినట్లు చెరువు , చూరుకు కట్టిన ముంత , నిప్పట్లపై వెన్నముద్ద..ఇవే గుర్తుంటాయి అంటాడు

౩.  ఇది దాదాపు ఒక shotలాంటి ఙ్ఞాపకం.
భళ్ళున్న ఎండకాస్తున్న ఒక మధ్యాహ్నం  ముత్తవ్వ  (అంటే నాన్న వాళ్ళ అవ్వ ) ఒక బండిలోంచి రెండు పుల్లైసులు కొని..అవి కారిపోతాయని పరుగుపరుగున తనను సమీపిస్తున్న దృశ్యం. ఒకటి నారింజ రంగు ఒకటి ద్రాక్ష రంగులో ఉన్న పుల్లైసులు.  ఆమెకూ తనకూ అడుగుల దూరమే ఉందని ఇప్పుడు అనిపిస్తున్నా... అప్పుడు మాత్రం ఆ పుల్లైసులు కరిగి ఆమె మోచేతులను జారి ఒకట్రెండు చుక్కలు నేలరాలడం కూడా గుర్తుందట.

ఈ మూడిటిలో ఏ సంఘటన మొదటిదో తెలీదుకానీ ఇంతకంటే వెనకవి మాత్రం ఏమీ గుర్తుకులేవ్ అంటాడు. మూడిటిలోనూ common point ఏమిటీ అంటే  ‘ నీకు ఎవరో ప్రేమగా ఏదో తిండి పెట్టడం ’ అంటే ఇప్పుడు అలా ఎవ్వరూ ముద్దు చెయ్యడం లేదు అని మిస్ అయ్యి అవే గుర్తుంచుకున్నావా .. లేకపోతే బేసిగ్గా తిండిపోతువా.. అని అంటే ఠాట్ ఇదంతా పనికిమాలిన సైకో అనాలిసిస్ ..ఎవరికైనా ఇలాంటివే గుర్తుంటాయ్ అంటాడు.
 అవునా అని నా తొలి ఙ్ఞాపకం కోసం ఆలోచిస్తే ‘ దక్కని అంటిపండు ’ అనే ఒక దిక్కుమాలిన మెమరీ వొస్తోంది.  దీనికంటే వెనకదీ కొంచెం గ్లామరస్‍గా ఉండేదీ ఏదైనా ఒక ఙ్ఞాపకం కోసం త్రవ్వాలి    :(

Saturday, September 29, 2012

అద్దం

వెండిని , ఖచ్చితాన్ని నేను. ఊహలు లేవు నాకు
చూసినదంతా అమాంతం మింగేస్తాను
ప్రేమో ద్వేషమో కలుపుకోకుండా
ఉన్నది ఉన్నట్లుగా

కఠినం కాదు నేను , నిజాన్ని మాత్రమే
నాలుగు చట్రాలమధ్య ఇరుక్కుని
ఆ గోడ మీద ధ్యానం చేసుకుంటూ ఉంటా
దేవుడికో కన్నులాగ
ఎదురుగా ఉంది మరొక గోడ... గులాబి రంగులో
నిరంతరం చూస్తా
నా గుండెలో ఒక ముక్కనక్కడ తగిల్చారేమో
చెదురుతుంది అది అప్పుడప్పుడూ
ముఖాలూ , చీకట్లూ మమ్మల్నెప్పుడూ వేరు చేస్తూనే ఉంటాయి

ఇప్పుడు నేనొక కొలనును
ఒక స్త్రీ వాలుతుంది నాపై
నా అంతులను తడుముతూ తనలో తనను వెదుక్కుంటూ
ఆ అబద్ధాలకోర్లు దీపాలను , చంద్రుడిని వెంట తెచ్చుకుని
చూస్తుంది
ఏం చూస్తానో అదే ప్రతిఫలిస్తాను
వణికే చేతులతోనూ కన్నీళ్ళతోనూ సత్కరిస్తుంది నన్ను
ఆమెకు నేను ముఖ్యం మరి
వస్తుంది , పోతుంది , వస్తుంది
నాలోని చీకటికి తన ముఖమే ఉదయం
ఆమెలోని పసిపాప నాలో మునిగి పోయింది
ముదిమి మీనంలా ఎగసి ఈదె
ప్రతిరోజు ఆమె ముఖంపైకి

Sylvia Plath  "MIRROR" కవితకు నా స్వేచ్ఛానుసరణ/అనువాదం
MIRROR one of the most famous works of Sylvia and there is lot a surrealisitc and metaphorical interpretations to the said poem. And ofcourse a feministic point of view analysis too . Anyoen interested , about it can google to find hundreds of essays and critical analyses and line by line de-construction about it .  Would like to hear back from you if you can add what I miss here.

Thursday, September 27, 2012

కాటుక కళ్ళు కూకట్ పల్లి

ఆ అమ్మాయి ఏం అంత అందగత్తె కాదు .  తెలివిలో అయితే మా అమ్మ లెవల్ అంతే.  "చంద్రుడు అంటే దేవుడురా. దాని మీదకు మనిషెళ్ళడమూ కాలుబెట్టడమూ అసాధ్యం. ఇదంతా అబద్ధాల చదువులు " డిస్కవరీ ఛానెల్‍లో Neil Armstrong ప్రాగ్రాం కళ్ళ ముందే వస్తున్నా ఇలాగే వాదిస్తుంది అమ్మ.  " మీ మమ్మీ సూపర్ అసల " ఇదే విషయం చెబితే పడీపడీ నవ్వింది ఆ అమ్మాయి. మా అమ్మ గురించి ఇంకోరూ ఇంకోరూ నవ్వితే కోపమొచ్చేదేమో కానీ ఈ అమ్మాయి నవ్వితే మన ఇంట్లో నే ఏదో సరదా విషయం జరిగినట్లు అనిపిస్తుంది. అదిగో.. అప్పుడు .. అలాంటప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది ఆ అమ్మాయి. అదీ విషయం . అందం అంటే మన ఇంటినీ , ఇంటిమనుష్యులనూ గుర్తుకు తేవడం ఏమో.  అంతే అయ్యుంటుంది. అందుకే ఎంత లావుగా ఉన్నా  పాత సిన్మాల్లో సావిత్రిని చూస్తే చాలా అందంగా అనిపిస్తుంది. ఆ హూమ్లీనెస్‍ను కళ్ళనిండా నింపుకుని ఉంటుంది ఆ అమ్మాయి. అమ్మాయి అమ్మాయి అంటున్నాను కానీ పేరు చెప్పడం లేదేమా అని మీరడగచ్చు . చెప్పను.
ఎందుకంటే జీవితంలో ఆ పేరును తలుచుకోకూడదని నిర్ణయించుకున్నాను. ఇలా నిర్ణయించుకోవడం ఇప్పటికి చాలా సార్లు జరిగింది. కానీ ఆ మాట, కళ్ళు , ఆ నవ్వు , కలిసి చూసిన సిన్మాలూ , పంచుకున్న పల్లీలు , చెంపలపై ముద్దులు , నా చెయ్యి వదలక పట్టుకున్న ఆ మెత్తటి వేళ్ళు...
ఛ ఛ... ఇవి కూడా ఏవీ తల్చుకోకూడదు.
దేవుడు వుట్టి వేస్ట్ ఫెలో. ఆఫ్ట్రాల్ కంప్యూటర్ కనిపెట్టిన మనిషి తెలివితేటలు కూడా లేవు . లేకపోతే ఒక్క "డిలీట్’ బటన్ పెట్టలేడూ మనిషికీ మనసుకూ ?
మా ఇంట్లో మా అమ్మ పక్కన కూర్చుని "మొగలి రేకులు " చూసే మా ఇంటి మనిషి కావాల్సిన అమ్మాయి.. నన్నొదిలి వేరొకడిని పెళ్ళి చేసుకోబోతోంది.
తెల్లారితే.
తెల్లారకపోతే బావుడ్ను.
రాత్రికి రాత్రికి ప్రపంచ వినాశనం జరగ కూడదా.
ఆ అమ్మాయి లేక నేను ఎలా ? నేను లేక మా అమ్మ ఎలా ? మేమిద్దరం లేకపోతే నాన్నా , తమ్ముడూ ఏం చేస్తారు ? మా ఇల్లు ఎలా ?
మేమంతా లేకుండా ఆ లైఫ్ ఎలా ?
  " ఓం భూర్ భుహస్వహ. తత్స వితుర్వ రెణ్యం. భర్గో...  " సెల్‍ఫోన్ రింగుతో కమలాకర్ ఆవేశం పొలమారింది.
"గాడ్ ముందసలు ఈ రింగ్‍టొన్ డిలీట్ చెయ్యాలి " అనుకుంటూ కనపడకుండా వినపడుతున్న ఫోన్ కోసం వెదికాడు. చిందరవందరగా ఉన్న ఆ గదిలో ఒక వస్తువు కనిపించాలి అంటే కొంచెం కష్టపడాలి. అతనికి అసలే ఓపిక తక్కువ. చిరాకు మరీ ఎక్కువ.
"ఓం భూర్ భుహస్వహ. తత్స వితుర్వ రెణ్య...  ” రింగు శబ్దం పెరిగింది.
చెవులు చిట్లిపోతున్నంత కోపం వస్తోంది అతనికి.
  " ఏయ్... అందరూ ఇలా రింగ్ టోన్లూ , డయల్ టోన్లూ , షోరూముల్లో స్పీకర్లలో అరిచిఅరిచి వినిపిస్తున్నారు కానీ..ఈ మంత్రం అసలు ఇలా ఎప్పుడుపడితే అప్పుడు వినకూడదట. అపచారం అంట ” లెంపలేసుకుంటూ , అతనికీ చెంపమీద చిన్నగా చరిచి చెప్పిన ఆ అమ్మాయి ముఖం టైట్ క్లోజప్ లో గుర్తుకొచ్చింది అతనికి. ఆ.. ఏం కళ్ళు అవి.
" పోపోరా. నాకు ఇష్టం. నీలాగే sereneగా ఉంటుంది ఇది వింటుంటే.. పైగా నీ పేరు గుర్తొస్తుంది "
 " you bitch... ఎందుకే ఇలా చేస్తున్నావ్ "  అరిచేస్తూ , బెడ్ మీద లుంగలు గా పడిఉన్న రగ్గును లాగి కింద వేసాడు కమలాకర్. ఆ రగ్గు మడతల నుంచి బయటపడి మరింత భీభత్సంగా వినిపిస్తోంది ఫోన్. అందుకుని చూస్తే...
" GAYATRI calling "
answer  బటన్ వేపు టెన్షన్‍గా చూసాడు అతను.
  "   తెల్లారితే వేరే వాడి పెళ్ళాం.  నాకెందుకు calling ? "
  *********************************************************
 to be contd