Saturday, September 29, 2012

అద్దం

వెండిని , ఖచ్చితాన్ని నేను. ఊహలు లేవు నాకు
చూసినదంతా అమాంతం మింగేస్తాను
ప్రేమో ద్వేషమో కలుపుకోకుండా
ఉన్నది ఉన్నట్లుగా

కఠినం కాదు నేను , నిజాన్ని మాత్రమే
నాలుగు చట్రాలమధ్య ఇరుక్కుని
ఆ గోడ మీద ధ్యానం చేసుకుంటూ ఉంటా
దేవుడికో కన్నులాగ
ఎదురుగా ఉంది మరొక గోడ... గులాబి రంగులో
నిరంతరం చూస్తా
నా గుండెలో ఒక ముక్కనక్కడ తగిల్చారేమో
చెదురుతుంది అది అప్పుడప్పుడూ
ముఖాలూ , చీకట్లూ మమ్మల్నెప్పుడూ వేరు చేస్తూనే ఉంటాయి

ఇప్పుడు నేనొక కొలనును
ఒక స్త్రీ వాలుతుంది నాపై
నా అంతులను తడుముతూ తనలో తనను వెదుక్కుంటూ
ఆ అబద్ధాలకోర్లు దీపాలను , చంద్రుడిని వెంట తెచ్చుకుని
చూస్తుంది
ఏం చూస్తానో అదే ప్రతిఫలిస్తాను
వణికే చేతులతోనూ కన్నీళ్ళతోనూ సత్కరిస్తుంది నన్ను
ఆమెకు నేను ముఖ్యం మరి
వస్తుంది , పోతుంది , వస్తుంది
నాలోని చీకటికి తన ముఖమే ఉదయం
ఆమెలోని పసిపాప నాలో మునిగి పోయింది
ముదిమి మీనంలా ఎగసి ఈదె
ప్రతిరోజు ఆమె ముఖంపైకి

Sylvia Plath  "MIRROR" కవితకు నా స్వేచ్ఛానుసరణ/అనువాదం
MIRROR one of the most famous works of Sylvia and there is lot a surrealisitc and metaphorical interpretations to the said poem. And ofcourse a feministic point of view analysis too . Anyoen interested , about it can google to find hundreds of essays and critical analyses and line by line de-construction about it .  Would like to hear back from you if you can add what I miss here.

Thursday, September 27, 2012

కాటుక కళ్ళు కూకట్ పల్లి

ఆ అమ్మాయి ఏం అంత అందగత్తె కాదు .  తెలివిలో అయితే మా అమ్మ లెవల్ అంతే.  "చంద్రుడు అంటే దేవుడురా. దాని మీదకు మనిషెళ్ళడమూ కాలుబెట్టడమూ అసాధ్యం. ఇదంతా అబద్ధాల చదువులు " డిస్కవరీ ఛానెల్‍లో Neil Armstrong ప్రాగ్రాం కళ్ళ ముందే వస్తున్నా ఇలాగే వాదిస్తుంది అమ్మ.  " మీ మమ్మీ సూపర్ అసల " ఇదే విషయం చెబితే పడీపడీ నవ్వింది ఆ అమ్మాయి. మా అమ్మ గురించి ఇంకోరూ ఇంకోరూ నవ్వితే కోపమొచ్చేదేమో కానీ ఈ అమ్మాయి నవ్వితే మన ఇంట్లో నే ఏదో సరదా విషయం జరిగినట్లు అనిపిస్తుంది. అదిగో.. అప్పుడు .. అలాంటప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది ఆ అమ్మాయి. అదీ విషయం . అందం అంటే మన ఇంటినీ , ఇంటిమనుష్యులనూ గుర్తుకు తేవడం ఏమో.  అంతే అయ్యుంటుంది. అందుకే ఎంత లావుగా ఉన్నా  పాత సిన్మాల్లో సావిత్రిని చూస్తే చాలా అందంగా అనిపిస్తుంది. ఆ హూమ్లీనెస్‍ను కళ్ళనిండా నింపుకుని ఉంటుంది ఆ అమ్మాయి. అమ్మాయి అమ్మాయి అంటున్నాను కానీ పేరు చెప్పడం లేదేమా అని మీరడగచ్చు . చెప్పను.
ఎందుకంటే జీవితంలో ఆ పేరును తలుచుకోకూడదని నిర్ణయించుకున్నాను. ఇలా నిర్ణయించుకోవడం ఇప్పటికి చాలా సార్లు జరిగింది. కానీ ఆ మాట, కళ్ళు , ఆ నవ్వు , కలిసి చూసిన సిన్మాలూ , పంచుకున్న పల్లీలు , చెంపలపై ముద్దులు , నా చెయ్యి వదలక పట్టుకున్న ఆ మెత్తటి వేళ్ళు...
ఛ ఛ... ఇవి కూడా ఏవీ తల్చుకోకూడదు.
దేవుడు వుట్టి వేస్ట్ ఫెలో. ఆఫ్ట్రాల్ కంప్యూటర్ కనిపెట్టిన మనిషి తెలివితేటలు కూడా లేవు . లేకపోతే ఒక్క "డిలీట్’ బటన్ పెట్టలేడూ మనిషికీ మనసుకూ ?
మా ఇంట్లో మా అమ్మ పక్కన కూర్చుని "మొగలి రేకులు " చూసే మా ఇంటి మనిషి కావాల్సిన అమ్మాయి.. నన్నొదిలి వేరొకడిని పెళ్ళి చేసుకోబోతోంది.
తెల్లారితే.
తెల్లారకపోతే బావుడ్ను.
రాత్రికి రాత్రికి ప్రపంచ వినాశనం జరగ కూడదా.
ఆ అమ్మాయి లేక నేను ఎలా ? నేను లేక మా అమ్మ ఎలా ? మేమిద్దరం లేకపోతే నాన్నా , తమ్ముడూ ఏం చేస్తారు ? మా ఇల్లు ఎలా ?
మేమంతా లేకుండా ఆ లైఫ్ ఎలా ?
  " ఓం భూర్ భుహస్వహ. తత్స వితుర్వ రెణ్యం. భర్గో...  " సెల్‍ఫోన్ రింగుతో కమలాకర్ ఆవేశం పొలమారింది.
"గాడ్ ముందసలు ఈ రింగ్‍టొన్ డిలీట్ చెయ్యాలి " అనుకుంటూ కనపడకుండా వినపడుతున్న ఫోన్ కోసం వెదికాడు. చిందరవందరగా ఉన్న ఆ గదిలో ఒక వస్తువు కనిపించాలి అంటే కొంచెం కష్టపడాలి. అతనికి అసలే ఓపిక తక్కువ. చిరాకు మరీ ఎక్కువ.
"ఓం భూర్ భుహస్వహ. తత్స వితుర్వ రెణ్య...  ” రింగు శబ్దం పెరిగింది.
చెవులు చిట్లిపోతున్నంత కోపం వస్తోంది అతనికి.
  " ఏయ్... అందరూ ఇలా రింగ్ టోన్లూ , డయల్ టోన్లూ , షోరూముల్లో స్పీకర్లలో అరిచిఅరిచి వినిపిస్తున్నారు కానీ..ఈ మంత్రం అసలు ఇలా ఎప్పుడుపడితే అప్పుడు వినకూడదట. అపచారం అంట ” లెంపలేసుకుంటూ , అతనికీ చెంపమీద చిన్నగా చరిచి చెప్పిన ఆ అమ్మాయి ముఖం టైట్ క్లోజప్ లో గుర్తుకొచ్చింది అతనికి. ఆ.. ఏం కళ్ళు అవి.
" పోపోరా. నాకు ఇష్టం. నీలాగే sereneగా ఉంటుంది ఇది వింటుంటే.. పైగా నీ పేరు గుర్తొస్తుంది "
 " you bitch... ఎందుకే ఇలా చేస్తున్నావ్ "  అరిచేస్తూ , బెడ్ మీద లుంగలు గా పడిఉన్న రగ్గును లాగి కింద వేసాడు కమలాకర్. ఆ రగ్గు మడతల నుంచి బయటపడి మరింత భీభత్సంగా వినిపిస్తోంది ఫోన్. అందుకుని చూస్తే...
" GAYATRI calling "
answer  బటన్ వేపు టెన్షన్‍గా చూసాడు అతను.
  "   తెల్లారితే వేరే వాడి పెళ్ళాం.  నాకెందుకు calling ? "
  *********************************************************
 to be contd