ఒక ఉదయం పార్కులో అలసటలో చూసాను తనను.
రాలిపోయిన పువ్వులు
ఏరుకుంటోంది
నిద్రలేని కళ్ళతో
ఫోటో తీసుకున్నాను ఆ స్వప్నచిత్రాన్ని
రాలిపోయిన పువ్వులు
ఏరుకుంటోంది
రాత్రి మంచుని
నేలలోకి తొక్కేస్తూ అటూ ఇటూ జనం
కొందరి బూట్ల
క్రింద నలిగిపోతూ కొన్ని పువ్వులు
అవి చూసినప్పుడల్లా
ఆమె కళ్ళల్లో వేదన నీడలు
ఏం చేసుకుంటావు
వాటిని ?
అడగలేక మింగేను
ప్రశ్నను
పెళ్ళి చేసుకోబోతున్న
అమ్మాయి గుర్తుకొచ్చింది
చేదుగా
ఇలాంటి అమ్మాయి
ఒక్క నెల క్రితం తారసపడిఉండకూడదా ?
వెధవ జీవితంలో
అన్నీ లేటే
రాలిపోయిన పువ్వులేరుకుంటోంది
తను
నా దగ్గరకొచ్చి
తలెత్తి చూస్తుందేమో
అని ఆశపడ్డాను
తనకేం అవసరం
రాలినపూవులతో
పేర్చిన రోడ్డు ముందుండగా.. మనిషెందుకు తనకు ?
పాములా వెళ్ళిపోయింది
కాటేస్తాయి
, విషం అనే భయమే లేకపోతే ఎంత అందమైనవో పాములు
ఆమె జుత్తులో
ఇంకా చాలా పాముపిల్లలున్నాయి
మెడూసా !
చూసేసాను మరి
ఉన్నానా పోయాను
వెనుదిరిగి చూసాను
నా శవం ఏమీ లేదు
అక్కడ
ఆత్మ మాత్రం అతుక్కుపోయి ఉంది
తన అడుగుజాడల
వెంట
జొల్లు కార్చుకునే
రోడ్ సైడ్ రోమియోలా
మర్యాదస్థుని
మొహమేసుకుని నా దారిన నేను
బ్రాండెడ్ బట్టలేసుకున్న
దేహాన్ని నడుపుకుంటూ
రేపు రావాలి
ప్రకృతీ , దేవుడూ
, మంచితనమూ సత్యం అయితే
పువ్వులు రాలుతాయి
తను వస్తుందా
?
No comments:
Post a Comment