హ్మూ..
మరచిపోయాను
నాకో బ్లాగుందని
తల్లులు బిడ్డలను మరచిపోతారని అంటే నమ్మలేదు
ఇక నమ్మకతప్పట్లేదు
ఒకేరోజు నాలుగైదు కామెంట్లేసి , నా బ్లాగు ఉనికిని గుర్తుచేసిన సదరు వ్యక్తికి ధన్యవాదాలతో మళ్ళీ మొదలెడుతున్నా...
మొదటగా.. ఈ మధ్య నేన్జూసిన మరచిపోలేని "ఇమేజ్ "నా కళ్ళనుంచి మెదడులోకి చిత్రించుకుపోయిన ఫోటోను పదాల్లో ప్రింటు తీసి చెప్పజూస్తాను.
ఒక హైవే పక్కన చిన్న ఊరు. ఊరంతా కలిస్తే యాభై ఇళ్ళు ఉంటాయేమో, అంతే. పెద్దవాళ్ళంతా ఏ పనీ లేనట్లు రోడ్డు పక్కన ఉన్న చెట్ల క్రింది అరుగుల మీద. రోడ్డువారనే ఉన్న గుడిసెల అంచున పేళ్ళు చూసుకుంటూ , మిరపకాయలు ఎండపెడుతూ ఆడవాళ్ళు. ఇదీ బ్యాక్గ్రౌండ్.
సమయం సాయంత్రం మూడున్నర. సూర్యుడు ఫెడేల్మంటున్నాడు. (నాకైతే చెమటలు కారిపోతున్నాయి ) అప్పుడు చూసాను .. ఆ పిల్లవాడిని.
ఏడెనిమిదేళ్ళుంటాయ్ .
ఒంటిపై చొక్కాలేదు. సన్నగా ఉన్నాడు. గోధుమరంగు చర్మం. ముదురుపచ్చ నిక్కరు. బహుశా ఏదో గవర్నమెంటు స్కూలు యూనిఫారం అనుకుంటా. రోడ్డు వారగా ఒక ఐస్క్రీమ్ బండి దగ్గర నిల్చుని , తాతో ఎవరో మరి ఒక పెద్దాయన కొనిస్తుంటే ఆగలేగ ఎగురుతున్నాడు. నేను నా కెమెరా వెదికేలోగా , వాడి చేతుల్లోకి మూడు "పుల్ల ఐసులు " రెండు ఆరెంజ్ , ఒక గ్రేప్. వాడి ముఖం ఇంకా ఆరెంజ్. అసలే సూర్యుడూ ఆరెంజ్.
ఎడమచేతిలో ఒక ఆరెంజ్ , ఒక గ్రేప్ పట్టుకుని , (ఒక చిన్నపిల్లవాడి చిన్నచేతివేళ్ళలో రెండు పుల్లైసులు ఇమడడం అంత సులభం కాదని మనవి) , కుడిచేతిలోని ఆరెంజ్ ఐసును ఆబగా చప్పరిస్తూ, నవ్వేస్తూ, కేకలేస్తూ , అప్పుడే జారిపోవడం మొదలెట్టిన నిక్కరు పూర్తిగా జారే లోగా వేగంగా పరిగెడుతూ, చెప్పుల్లేని కాళ్ళతో వేడిగా ఉండే నేలను తొక్కేస్తూ , తన గుడిసెను చేరుకుని , తల్లి ( ? అవునో కాదో నాకు తెలియదు..తల్లే అనుకుంటాను) దగ్గర కూర్చుని మిరపకాయలు ఎండబెడుతున్న చెల్లెలు ( ? ఇదీ నా ఊహే కావొచ్చు)కు ఒక ఆరెంజ్ ఇచ్చి , పక్కన ఎవరో మరి , దిసమొలతో ఉన్న ఒక చిన్న పాప దగ్గర ఆయాసపడుతూ కూర్చుని గ్రేప్ ఆ పిల్ల పెదవులకు అంటించి , తను ఆరెంజ్ తింటూనే ఉన్నాడు.
కేవలం కొన్ని ఘడియల్లో మూడు ఐస్క్రీములో కరిగిపోయాయి. వాళ్ళా ముఖాల్లో వేల రంగులు విరుస్తున్నాయ్.
కెమెరా కోసం వెదికితే కళ్ళు ఏం కోల్పోతాయో అని భయపడుతూ అలానే చూస్తుండిపోయాను నేను.
Life so so beautiful when its simple , అనిపించింది మరి. కానీ ఉండలేం కదా.. అంత సింపుల్గా, సంతోషంగా.
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
meer chepthunte aa drusyam kalla mundu jaruguthunnatlu vundi,emi leka simplega brathakatam sangathi emo kaani anni vundi simlega brathakataniki chaala dhairyam kavaali
"anni vundi simlega brathakataniki chaala dhairyam kavaali"
పూర్తిగా నిజం
అద్భుతమైన మాట సూటిగా చెప్పారు :)
Post a Comment