Monday, September 06, 2010

కులం మతం ప్రాంతం దేశం..తొక్కా తోలూ మట్టీ మశానం !!!!

 సరే నేనెప్పుడూ ఇండియా బోర్డర్ దాటినవాడిని కాదు...కానీ నాకు తెలిసినంత అవగాహనలో ఇది రాస్తున్నా..
మనవాళ్ళకో ప్రత్యేకత ఉంది అనిపిస్తోంది.

ఇక్కడ మనవాళ్ళు = we, the indians

(అసలు ఈ "భారతీయులు" అనేదే mythical పదమేమో అనిపిస్తుంది.
ఏవేవో దేశాలు...కళింగ, కురు, చోళ , మాండ్య , పల్లవ, శిఖ్ , మరాఠా...అబ్బో ఎన్నెన్నో దేశాలున్న ఈ ఉపఖండంలో అరబ్బులు, యూదులు , ఫ్రెంచి , పోర్చుగీసులు ఎందరెందరో దాడి చేసాక , చివరాఖరికి బ్రిటిషువాళ్ళ పరిపాలనలో బోర్డర్లు గీసుకుని భారత దేశం అనిపించుకుని, మళ్ళీ పాకిస్తానూ , బంగ్లాదేశమూ విడి ఇప్పుడు ఒక మ్యాపు వేసుకుంటున్న మనకు అసలు "భారతీయులు" అనే identity ఎలా నప్పుతుందో నాకు అర్థం కాదు )

ఆ...మనవాళ్ళు... ఏ బెంగాలీ వాడో బ్రిటన్‍లో కోటానుకోట్లు సంపాదించి ప్రపంచ ధనికుల్లో ఒకడైతే చాలు " అయ్..అదీ మన ఇండియన్ పవర్ " అంటారు. ఒక కర్నాటక అబ్బాయి ఏ ఆటలోనో గెలిస్తే... " మా south indian తడాఖా" అని జబ్బలు చరుచుకుంటారు. అదే హైద్రాబాద్ అమ్మాయి ఎందులోనో ఛాంపియన్ అయితే " ఇదీ మన రాష్ట్రపు ఆడపడుచుల ప్రతిభ " అని కాలరెగరేస్తారు. మళ్ళీ ఓ తమళ ముస్లిమో ఆస్కారు కొడితే.." వాడురా భారతీయుడు అంటే" అని టపాకులు పేల్చుకుంటారు.మళ్ళీ తమ జిల్లావాడు పేద్ద..హీరో అయితే " మా జిల్లా రక్తం" అంటారు.  వాళ్ళ కులం మనిషి ఏదైనా సాధిస్తే " అందుకే మా కులం గొప్పది " అంటారు.
 ఎవ్వడైనా సక్సెస్ అయితే చాలు.. ఏదో రకంగా వాడిని కలుపుకోవాలి...దేశస్థాయిలోనో, ప్రాంతస్థాయిలోనో, రాష్ట్రస్థాయిలోనో, జిల్లాలెక్కనో,కులంలోనో..... success అయినవాడు ఎలా అయినా "మనవాడే"

లేకపోతే మాత్రం.. వాడు పరాయి....
ఈ మధ్య ఒకటే కులాల గొడవలు , ప్రాంతీయ విభేదాలు చూస్తుంటే అనిపిస్తోంది... చిన్నప్పుడు స్కూలులోనూ....ఇప్పుడు కూడా టెన్త్ / ఇంటర్ కాలేజీల్లో....70% మార్కులో ఏదో కటాఫ్ పెట్టుకుని ఆ పై వచ్చినవాళ్ళందరినీ " A" అనే సెక్షను వేసి...మిగతావారిని బీ లు సీలు అని విభజించి పోటీ పెడతారు..
ఇదేదో దేశస్థాయిలో పెడితే బావుణ్ణు... పిల్లాపీచూముసలీముతకా అంతటికీ ఒక కామన్ ఎంట్రన్స్ పెట్టి , అన్ని రాష్ట్రాలూ,కులాలూ,మతాలూ కలిపేసి "successful" "not-successful" అనే రెండు తెగలు చాలేమో!!

 ఏదో.. నా పిచ్చి ఆలోచనే కానీ... ఈ మాట రాసిన నా పుట్టుకనూ, వంశ/జాతి మూలాలనూ వెతికి మరీ తిట్టరూ... నేను success అయ్యేవరకూ!!!!

4 comments:

A K Sastry said...

"....తొక్కా తోలూ......." అనక్కర్లేదుగానీ, మంచి టపానే వ్రాశారు.

"గెలిచిన కోడి మనది" అనడం మన "భారతీయుల"; "దక్షిణ భారతీయుల"; "ఆంధ్రా వాళ్ల"; అందులో "ఫలానా కులం వాళ్ల" లేదా "ఫలనా జిల్లా/వూరివాళ్ల" ప్రత్యేకత!

మన సినిమాలూ, మీడియా కూడా అలాగే యేడుస్తున్నాయి!

యేమనుకుంటే యేమి లాభం!

భావన said...

మన అని అనుకోవటం మానవ ప్రవృత్తి లోనే వుంది. తప్పదండి విప్లవ్. ఇండీయన్స్ అనికాదు గ్రీకు వాళ్ళు అని కాదు.

viplove said...

@భావనగారూ
మిగతావాళ్ళలో "మన" అనుకోవడం గురించి కాదు...మనవాళ్ళలో అక్కర్లేనప్పుడు "మన కాదు" అనుకోవడం గురించి నేను ప్రస్తావించింది.

viplove said...

కృష్ణశ్రీగారూ...
"తొక్కా తోలూ" ఎందుకంటే...ఇంకా ఎర్రరంగు, నల్ల రంగు , తెల్ల రంగు అంటూ చర్మపు రంగును బట్టి మనుష్యులను కించపరుస్తూ / గౌరవించే ఆచారం కూడా ఒకటుంది కదా ఇక్కడ.. దాన్ని ఉద్దేశ్యించి అన్నా.