Thursday, May 06, 2010

పొట్టి కథలు :::::: కరిగిన మైనం

" ఎప్పుడూ ముఖం అలా ముడిచిపెట్టకపోతే కాస్త నవ్వొచ్చుగా "
 ఆమె మాటలు గుర్తుకొచ్చి అతను అప్రయత్నంగా నవ్వాడు. కళ్ళలో తడి మెరిసింది.
" సార్ టికెట్ తీసుకున్నారా " కండక్టర్ దురుసుగా తోసుకుంటూ అడిగాడు. దురుసుగా ఉండక తప్పని పరిస్థితి అతనిది. కిక్కిరిసిన జనంలోంచి పాములాగా దూరుకుంటూ బస్సు కుదుపులకు అడుగులను బ్యాలన్స్ చేసుకుంటూ నడవడమే కాక చిరాకుగా ఉండకూడదు అంటే ఎలా కుదురుతుంది మరి!
  " ప్లీజ్ నీకు వెయ్యి నమస్కారాలు చేస్తా.ఇంకెప్పుడూ మీసాలు తీసెయ్యొద్దు. ఏదో రేపిస్ట్ సైకోలా ఉన్నావ్ " ఆమె ముఖంలో మెలికలు తిరిగిన చిలిపి అల్లరి అందాల ఆడతనం గుర్తొచ్చిఅతడి పెదవులమీద నవ్వు మరింత విచ్చుకుంది. ఆ సాయంత్రం వర్షం కురవకపోయి ఉంటే బావుండేది. పార్కులో ఇంకాసేపు గడిపిఉండొచ్చు.
    " ఇకనుంచీ ఇలాగే మెయిన్‍టైన్ చెయ్, చూట్టానికి పెద్ద బాలేకపోయినా, ఇప్పుడు బావుంది. పైపెదవి మెత్తగా తెలుస్తోంది. హ్మూ... " చీకట్లో ముద్దులో ఆమె గుసగుసలు గుర్తొచ్చాయి. పళ్ళ బిగువున సిగ్గును అదిమేసి తనతోపాటు నిల్చున్నవారి మీంచి, బస్సు కిటికీ పక్కన కూర్చున్న వారిమీంచి వెలుపలికి చూసాడు.
          రోడ్డు అంచున నిలుచున్నషాపింగు కాంప్లెక్సులన్నీ వెనక్కు పోతున్నాయి.
  " లం.. ముండ , వాడితో ఏం సుఖపడుతుంది. వదిలేసిపోతుందా ? ఛస్తుంది. ఈసారి కనిపిస్తే దాని మొహంకూడా చూడను " స్నేహితులతో మత్తులో వాగిన వాగుడు చెవుల్లో మెదిలింది.
  " ప్లీజ్ ఏమనుకోకు . ఇక కష్టం, ఇంట్లో చాలా ప్రాబ్లం. నాన్నకు గుండె.. " ఆరోజు ఆమె గొంతు వణకడం అతనికింకా గుర్తే. కోపం ఉడికింది. మధ్యాహ్నం ఎండ మరింత భళ్ళుమంది.చెమటకంపుతో ఒక కుదుపు.
" ఏం మనిషివయ్యా... చూసిపో.. " భుజానికి తగిలించుకున్న ల్యాప్‍టాప్‍ను నొక్కేస్తూ వెళ్ళిపోయిన ముసలి పల్లెటూరుబైతును విసుక్కున్నాడు అతను. కంప్యూటర్‍ అంటే ఆమనిషికి తెలీదు కదా పాపం, అయినా ఎవరినో ఒకరిని కోప్పడాలి. అతని ముఖం మీది చిరాకు చూసి కాబోలు. చుట్టుపక్కలవారు చిరాకుపడ్డారు.
          " ఎప్పుడూ ముఖం అలా ముడిచిపెట్టకపోతే కాస్త నవ్వొచ్చుగా " మాట వినిపించినట్లు అనిపించి అటు చూసాడు.
 ఆమె.
 ఆమే.
  అణువణువూ అందం పొదువుకున్న ఙ్ఞాపకంలా ఉంది. వస్తోంది.
ఏం పెద్ద మారలేదు. కాస్త లావయ్యింది అంతే. కాస్త. కాస్తే.
పక్కన ఎవడో ఉన్నాడు. ఆమె ముఖం ప్రశాంతంగా ఉంది. ఆమె చేయివదలకుండానే నవ్వుతున్నాడు వాడు. ఇద్దరూ తన వేపే వస్తున్నారు. బస్సులో , జనం మధ్యలో ఇరుక్కుపోయిన ఒక తెగిన మనసు.
  ఆమె అతడిని చూసింది. కళ్ళు విచ్చుకున్నాయి. కనుబొమలు వంపు తిరిగాయి. రెప్పపాటులో మౌనం ఏరులైపారిది.
"బావున్నావా" ఆమె కళ్ళు అడిగాయి
 " నువ్వుఎలా ఉన్నావ్ ? " అతనూ మాట్లాడలేదు.  ఆమె ముఖంలో సంతోషం. అతడిని చూసానని. అతడిలో తృప్తి. కనిపించానని.
బస్సు ఆగింది. అతడు దిగిపోయాడు.
" ఎప్పుడూ ముఖం అలా ముడిచిపెట్టకపోతే కాస్త నవ్వొచ్చుగా " అమె ఙ్ఞాపకం అతడి పెదవులను పట్టుకువేళ్ళాడుతోంది.
ఎదురుగా నడుస్తున్న అమ్మాయిలు మాత్రం అతడు తమను చూసి నవ్వుతున్నాడేమో అనుకుని వగలు పోయారు.
                                                           ------------------------------------

3 comments:

Unknown said...

చాలా బాగా వ్రాసారండి ... ఓ తీయ్యటి బాధ ఉంది ... కాని బావుంది ... !!!!

Mohanatulasi said...

పొద్దున్నే మనసుని మెలి తిప్పావు!
బాగుంది మరి! ఒప్పుకోక తప్పట్లేదు...!

ఇంకా వుంటే బాగుండేదేమో అనిపిస్తుంది....అంటే ఆ సన్నివేశంలో నుండి బయటకి రాలేకేమో బహుశా!!
కానీ ఇది ఇలానే బాగుంది అని కూడా తెలుసు.

శరత్ said...

చాలా బాగా రాశారు. చిన్న కథ...చాలా ఫీలింగ్