Tuesday, April 20, 2010

కళ్ళకు కనిపించని సినిమా ! తెలుగులో కూడా వస్తే!

సినిమామీద వ్యామోహంతో , శాస్త్రీయంగా దాన్ని చదువుకునేందుకు కాసిన్ని పుస్తకాలూ సినిమాలు చదివాక నేను నేర్చుకున్న సినీ గ్రామరును జనరంజకంగా సినిమాలు తీయడంలో ఎలా ఉపయోగించాలా అని తర్జనభర్జనలు పడుతున్న కాలంలో , ఈ మధ్య మన తెలుగులో సినిమాల మీదా , వాటి గ్రామరు మీదా జరుగుతున్న చర్చలలో నా గొంతు కూడా వినిపేంచుందుకు , నాకు బాగా ఇష్టమయిన ఒక  దక్షిణ కొరియన్ సినిమా :   Spring, Summer, Fall, Winter ... and Spring(దర్శకుడు : కిమ్ కి డుక్ )లోని మొదటి పది నిముషాలను సోదాహరణంగా వివరిస్తూ, నే చెప్పొచ్చేదేమంటే :



ఇపుడు మన కంటికి కనిపించే కథ (అహింస గొప్పదనం , ఒక జీవిని హింసిస్తే నువ్వు ఆ బాధను జీవితాంతం మోస్తావు అని సంభాషణ ద్వారా ప్రస్ఫుటంగా చెప్పే భావం) కాక, కొంచెం ఆలోచిస్తే చాలా కథలు ఉన్నాయి. ఎక్కువ అర్థాలు దర్శకుడు అనుసరించే బౌద్ధ జెన్ తత్వాలనుండి పుట్టాయి. మన హిందూ తత్వాలకు దగ్గరగానే ఉంటాయి . (చదువుతున్నవారెవరైనా అన్యమతాల వారూ , మతాలకు అతీతులు అయినప్పుటికీ ఈ దృశ్యకావ్యాన్ని అర్థం చేసుకోవాలంటే ఆ మతాన్నికోట్ చెయ్యక తప్పని నా నిస్సహాయ స్థితిని అర్థం చేసుకోమని అర్థిస్తున్నాను )
అసలు సినిమా టైటిల్ ప్రకారం , ఇది తొలి భాగం అయిన వసంత ఋతువు. బాలుడితో మొదలయ్యే ఈ కథలో , ఆ ఇల్లు అలా ఎందుకు ఉండాలి ? ఏం అడవిలోని పూరి గుడిసె ఎందుకు కాకూడదు ? అలా నీటి మధ్యలో తేలుతున్నట్లు కన్పించే ఇల్లే ఎందుకు కావాలి ?  కేవలం మన కంటికి అందంగా కనిపించడం కోసమే కాదు. అక్కడ దర్శకుడి ఆలోచన , మనం ఉన్న ప్రపంచం , అనగా భూమి, నీటి మధ్యలో ఒక ద్వీపం వంటిదే అని. కనుక, ఈ ప్రపంచంలోని మనిషి జీవితం గురించి చెప్పాలి అనుకుంటే అందుకు అనువైన అతగాడి ఇల్లు ఇలా మూడొంతుల నీటి మధ్య ఉంటేనే సరి అనుకున్నాడు దర్శకుడు.
 ఇక్కడ మనుష్యులుగా ఉన్న పాత్రలు ఇద్దరు. (ఇల్లూ, నీరూ, ఋతువూ, జంతువులూ కూడా ఒకరకంగా పాత్రలే అయినప్పటికీ ) కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే , హిందూ / బౌద్ధ ధర్మాల ప్రకారం గురువు భగవంతుడు. ఆ విధంగా చూస్తే ఇక్కడ పిల్లవాడు మాత్రం మానవాడు, అతగాడి గురువు భగవంతుడు. ప్రతిక్షణం తనను ఎవరూ చూడటం లేదు అనుకుని సాటి జీవుల పట్ల నిర్దయగా ప్రవర్తించే మనిషికి తనను భగవంతుడు నిరంతరం గమనిస్తూనే ఉంటాడని గుర్తుంచుకోవాలి. ( చదువుతున్నవారెవరైనా నాస్తికులయితే నన్ను తిట్టకండి, ఆ దర్శకుడి భావం అది )
 ఇక ఆ అబ్బాయి ఎంచుకున్న జీవులు వరుసగా : చేప , కప్ప, పాము . ఏం ఆ వరుసలోనే ఎందుకు ఉండాలి ? పాము , చేప , కప్ప ఎందుకు కాకూడదు ? జువాలజీ ప్రకారం అయినా బౌద్ధ సిద్దాంతం ప్రకారం అయినా నీటిలో ఉండే జీవి మొదటిది , ఉభయచరం తర్వాతది, నేలమీద మన్నేది మూడవది. మరి పక్షిని ఎందుకు వదిలేసినట్లు ? మనిషి , విమానం వంటి సాంకేతిక ఙ్ఞానం పక్కనబెడితే , నేలమీద ఉండగలడు , చాలా సేపు ఈత కొట్టగలడు కానీ ఎప్పటికీ ఎగరలేడు. అందుకే గాలిలో ఎగిరేవి మనిషి జీవితాన్ని గురించి చెప్పడానికి సరిపోవని దర్శకుడు ఆ మూడు జీవాలతో తన భావప్రకటన ఆపాడు. అప్పటికీ పక్షి కాకపోయినప్పటికీ, మొట్టమొదటగా ఆ బాలుడి చేతులు ఎగురుతున్న చిన్న సీతాకోకలమీదకే వెళ్తాయి, కానీ అవి అందని కారణంగానే అతను తనకు సంబంధించిన భూమీ, నీటిమీద ఉండే జంతువులమీదే తన ప్రతాపం చూపుతాడు.
 ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది మూడవ జీవి అయిన పాము. భూమిపై చరించే ప్రాణిని చూపించాలి అనుకుంటే సర్పాన్నే ఎందుకు చూపించాలి ? కుక్క, పిల్లి, ఉడుత లాంటి సాధు జంతువులో లేక పులి,సింహంవంటి క్రూర జంతువులో ఎందుకు కాకూడదు ?పాము, ఒక రకంగా సాధు జంతువూ మరో రకంగా ప్రమాదకరమైనదీనూ. అచ్చంగా మనిషిలానే. కానీ ఈ పాము, ఒక కరవని పాము. అంటే నిస్సహాయమైన పాము. భూమి మీద చరించగలిగేదీ , కరిచేంత విషమున్నదీ , అయినా ఒక పసివాని చేతిలో నిస్సహాయంగా దొరికిపోతుంది. ఇక్కడ పాము ఆ శిశువుకు(అనగా మనిషికి )  ప్రతిరూపం. హిందూ/బుద్ధిస్ట్ తత్వం ప్రకారం, పాము కర్మ కు సూచకం. నిరంతరం కుబుసం విడుస్తుంది కనుక దాని జీవితాన్ని పుట్టుక, మరణం , పునర్జన్మ అనే ఒక సుడిలో తిరిగే "కర్మ"గా చూస్తారు. అందుకే ఇక్కడ పామును ఎంచుకున్నాడు దర్శకుడు. 
 ఇక పోతే , రాయి కట్టబడ్డాక మూడు జంతువులకూ వివిధరకాలయిన మృత్యువు. నాకు ఇప్పుడు సరిగా గుర్తు లేదు కానీ, వాటి వెనుక కూడా ఏదో బౌద్ధ తత్వాలు ఉన్నాయి. ఒకసారి ఆ పాము చనిపోయిన విధానం గమనించండి. దాని శరీరం నీటినీ,నేలనూ తాకుతూనే ఉంది. పామును ఇక్కడ మనిషితో పోల్చాడు కనుక, ఆ పాము మృత్యువు మరింత భయంకరంగా జరిగినట్లు , రక్తం ఓడుతూ, నేలకూ నీటికీ రెండిటికీ చెందకుండా పోయింది. ఒకరకంగా అది మిగతా జీవులందరికన్నా సాటి మనిషిని హింసిస్తే మరింత పాపం చేకూరుతుంది అని చెప్పడానికి ఆ శిశువు తట్టుకోలేక విలపించినట్లు చూపడం.
   ఇదేమీ నా సొంత పైత్యం కాదు. ఒక ప్రసిద్ధుడయిన సినీగురువు చెప్పగా విన్నాను. ఈ చిత్రం గురించి ఇలా వివరంగా వ్రాసిన పుస్తకమూ చూసాను. ఈ సినిమా గొప్పది అని కీర్తించిన ప్రపంచ దేశాల్లో , విమర్శకులందరూ ఒప్పుకునే అర్థాలే ఇవి. ఇంకొందరు ఇంకొక అడుగు ముందుకు వేసి , వాళ్ళు వేసుకున్న బట్టల రంగులకూ , చెప్పుల రంగులకూ కూడా ఏవో తత్వాలు ఆపాదించారు కానీ అవన్నీ చెప్పుకుపోతే అదొక అడవి అని నేను ఇంతటితోనే ఆపుతున్నాను.
ఇదంతా చా...లా... "అతి" అనిపించినా కిం కీ డుక్ సినిమాలన్నిట్లోనూ ఇలాంటి  గుప్త సందేశాలు చాలా ఉంటాయి. పైన పేర్కొన్నవన్నీ కథతో సంబంధించిన "మెటోఫర్" మాత్రమే అయితే, ఇంకా గొప్ప దర్శకులు అని కీర్తింపబడేవారి చిత్రాల్లో , ఫ్రేములోని పాత్ర ఎడమనుండి కుడి వైపుకు చూస్తున్నాడా, కుడినుండీ ఎడమకా, లైటు అతడి కళ్ళ్కు మాత్రమే ఉందా, ముఖం మొత్తం ఉందా, సగమే ఉందా, ఎడిటింగ్ స్మూత్‍గా ఉందా జంప్ కట్‍తో సాగిందే అంటూ, ప్రతి గ్రామరు అంశంతోనూ అర్థం మార్చగలరు.
 అకీరా కురుసోవా సినిమాలను ఎన్నెన్నె రకాలుగా విశిదీకరిస్తారో...చివరకు, షాట్ల సంఖ్యలు , వాటి నిడివిని కూడా లెక్కలు వేసి , అనేందుకు ఉదాహరణగా ఈ లంకె చూడగలరు. http://www.theauteurs.com/notebook/posts/391 .  మన రే సినిమాల్లో ఋతువుల గురించి కానీ, షాట్ కంపోజిషన్‍లో ఉయ్యాలవంటివి ఉంచడం ద్వారా సందిగ్ధాన్ని చెప్పడం గానీ, ఆదూర్ గారి సినిమాలను(ఎలియపతెంలో మనిషిని ఎలుకతో పోల్చడం ) కూడా ఇలా చూసే కొద్దీ లోపలి కథలు ఎన్నో బయటపడ్తాయి.
 ఇదంతా నాణానికి ఒకవైపు. మరోవైపు ఉన్న కఠోర సత్యం , విమర్శకులు లేక సినీప్రేమికులు , ఇప్పటికే పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్న దర్శకుల సినిమాలను అయితే ఇంత ఓపికగా విశిదీకరించి / చీల్చిచెండాడి వాళ్ళు ఆపాదించని అర్థాలను కూడా వెతికిపట్టుకుని పొగడటానికి సిద్ధంగా ఉంటారు. ( అప్రస్తుత ప్రసంగంలా అనిపించినా చెప్పక తప్పట్లేదు . మిస్టర్ బీన్స్ హాలిడే అనే చిత్రంలో..కేన్స్ ఫెస్టివల్‍లో ఒక దర్శకుడి చిత్రం ప్రదర్శితమవుతుండగా బీన్ వలన జరిగిన ఒక తప్పిదాన్ని ప్రేక్షకులు సినిమా ప్రక్రియలో భాగం అని తలపోసి ఆహా ఓహో అని పొగుడుతారు ) తెలుగులో శంకరాభరణం ఒక కల్ట్ స్టేటస్ సంపాదించుకున్నప్పుడు కొన్ని పత్రికల్లో ఇలాంటివి వచ్చాయట. ఉదాహరణకు, ఒక షాట్‍లో శంకరశాస్త్రి పడుకున్న భంగిమ వీణలా కనిపించడం, విశ్వనాథ్‍గారు అదే పనిగా కంపోజ్ చేసిన భంగిమ అనీ..వగైరా.. కానీ మర్యాదస్థులు, తమ పరిమితులు తెరిసినవారు ఆ పెట్టుడు భుజకీర్తులను తిరస్కరించడం జరిగింది. ఇలా, చాలా సార్లు, పెద్ద దర్శకుల సినిమాలలో ప్రతి షాట్‍లో అంతరార్థం వెదకడం ఒక పిచ్చిగా ఉండేవాళ్ళూ ఉన్నారు. అదే ఒక వృత్తి కూడా. ఇంటర్నెట్‍లో ఏ పేరు పొందిన ప్రపంచ సినిమా బ్రేక్ డౌన్ గురించి వెదికినా బోలెడు యూనివర్సిటీ పేపర్ శాంపుల్స్ ఉంటాయి, అన్నీ పెయిడ్ సైట్లే!  కానీ , ఒక కొత్త దర్శకుడు ఇలా ప్రయత్నిస్తే ఆ కళను గుర్తించేంత వ్యవధీ , ఓపికా ఈవేళ్టి ప్రపంచానికి లేదేమో అనిపిస్తుంది. ఋజువుగా, నేను ప్రయత్నించి ఎవ్వరూ గుర్తించక నిరాశతో వదిలేసుకున్న షార్టు ఫిలిమూ, నాకు తెలిసినవారు కొందరు వెర్రిఆరాటంతో అలాంటి సినిమాలు తీసినప్పుడు ఏ గుర్తింపూ రాక ఇక జన్మలో కళాత్మక సినిమా జోలికి వెళ్ళకూడదు అని విసిగిపోవడం చూసాను.  ఈ నిరాశ కొత్తవారికే కాదు  ఒక ఇమేజ్ చట్రంలో ఇరుక్కున్న ప్రఖ్యాత దర్శకులకూ తప్పదు.
 ఉదాహరణకు, ఆల్ఫ్రెడ్ హిచ్‍కాక్ సైకో దాదాపు మనందం చూసి ఉంటాం. అందులోని షవర్‍లోని హత్య సన్నివేశంలోని భయం అనుభవించాం. ఒక ఇంటర్వ్యూలో హిచ్‍కాక్ చెబితేనే తెలిసింది అందులో ఒక షాట్‍ వెనుక ఆయన ఉద్దేశ్యం. షవర్‍లోని మహిళను సైకో పొడిచినప్పుడు , కాళ్ళకు ఒక క్లోజప్ షాట్. ఆ షాట్‍లోనే ,  ఆమె కాళ్ళను కదుగుతున్న నీటిలో రక్తం కలిసి టబ్బులో ఇంకిపోవడం. క్రైస్తవ ధర్మాన్ని ఆచరించే ఆల్ఫ్రెడ్ , "బాప్టిజం" కు సంకేతంగా ఆ షాట్ డిజైన్ చేసారట. దొంగతనం అనే పాపం చేసిన ఆ పాత్రయొక్క పాపం అలా రక్తంతో కరగబడడమే దైవం విధించిన శిక్ష అని ఆయన మనోభావం అట. కానీ హిచ్‍కాక్‍ను కమర్షియల్ దర్శకుడిగానే చూసే విమర్శకులెవ్వరూ ఆ ఆలోచనను గుర్తించే ప్రయత్నమే చేయలేదు.
ఇంకో ఉదాహరణ : రెండేళ్ళ క్రితం మణిరత్నంతో పనిచేసే ఒక అత్యుత్తమ సాంకేతిక నిపుణుడు చెప్పాడు. " యువ" చిత్రంలో , మాధవన్ పాత్ర దారీతెన్నూ లేనిదిగానూ ,డిస్టర్బ్డ్‌‍గానూ ఉంటుంది కనుక అతని సన్నివేశాలన్నీ హేండ్‍హెల్డ్ కెమెరాతో , జెర్కీగా తీయగా, ఒక స్థిరత్వం కలిగిన సూరియ పాత్ర ఉన్న సన్నివేశాలు ట్రాక్‍లూ, స్టాటిక్  కెమెరాతోనే ..స్థిరంగా చిత్రీకరించినట్లు. కానీ మణిరత్నం సినిమాలో ఇలా గూడార్థాలు వెదకడం ఏమిటని మన విమర్సకుల చిన్నచూపు. అలాగే గీతాంజలి చిత్రంలో , గిరిజను ప్రేమించాలి అని నిర్ణయించుకున్నాక సిగిరెట్టు పారేసి , చెట్ల మధ్య, సూర్యుడు వెనుకరాగా నాగార్జున నవ్వుముఖంతో పరుగుతీసే షాట్ వెనుక గూడార్థం కొంచెం ఆలోచించి చూస్తే మీకే తెలుస్తుంది.
   సరే  గొప్ప సినిమాలూ , మంచి సినిమాలూ, మరీ అంత గొప్పవి కాని సినిమాలూ కాదుగానీ, చివరాఖరుకి పరమ చెత్త సినిమా అనుకునేవాటిలో కూడా దర్శకుడు కళ్ళకు కనిపించేది , చెవులకు వినిపించేది కాక ఇంకేదో చెప్పాలి అనుకుంటాడు. బూతు పాటను తీసేందుకు కూడా , తెల్లటి మేనిఛాయ ఉన్న అమ్మాయిని ఎర్రటి రంగు డ్రస్సులో చూపితేనే మగ ప్రేక్షకుడికి కిక్కొస్తుంది అని నమ్మే దర్శకుడు ఎర్ర చీర , ఎర్రటి లిప్స్టిక్, ఎర్రటి ఆపిల్ పళ్ళు, సాహిత్యంలో ఎరుపు అనే మాట , ఇంత ఎర్ర చేసే రకాలూ ఉన్నారు. ఏం నల్ల డ్రస్సులో ఆ అమ్మాయి బావోదా అని అడక్కండి. ఆ డైరెక్టరు ఫాంటసీ అలా తగలడింది మరి.
    ఇంతకీ ఇదంతా చెప్పడం ఏమిటంటే , సంభాషణలతో తెలిసే కథ కాకుండా సినిమాలోని ప్రతి అంశం వలనా ఒక కథ చెప్పొచ్చు. కానీ , ఆ కథను అర్థం చేసుకోవడానికి ప్రేక్షకుడి అవగాహన ముఖ్యం. ఛంథోబద్ధమైన ఒక అచ్చతెలుగు పద్యాన్ని వినిపిస్తే అర్థం చేసుకోలేని "తెలుగు"లో ఉన్నాం మనం. మనకు అర్థం కాలేదు కనుక, ఈనాటి మన దైనందిక జీవితానికి పనికిరాదు కనుక  . తెలుగు ఛందస్సు వృధా అని , సామాన్యుడికి అక్ఖర్లేని ఆ పద్యాలూ, ప్రబంధాలు ఎందుకనీ అంటే కొన్నాళ్ళకు వాటి ఉనికి ఉండదు. అలాగే , మన తెలుగులో ఏ ఆటోవాడికో (క్షమించాలి, వృత్తిని కించపరచడం నా ఉద్దేశ్యం కాదు, అంత చదువులేని వాడు అనే అసంప్షన్‍తో అంటున్నాను ... దీనికి నా ఆధారం ఒకసారి రాంగోపాల్‍వర్మ ఇంటర్వ్యూలో నెల్లూరులో రిక్షావాడికి నా సినిమా అర్థం కాకపోతే నాకేం నష్టం లేదు అనడమే ) లేక సాఫ్టవేర్ ప్రోగ్రామ్ లాంగ్వేజీ తప్ప ఇంకేమీ రాక కేవలం డ్యాన్సుల కోసం , బ్రహ్మానందం హాస్యం కోసం సినిమా చూసేవారికో , లేక ఎవరెవరికో అర్థం కానంత మాత్రాన కళాత్మక సినిమా అనేదే మనకు అనవసరం అనే మన సంకుచిత స్వభావం వలనే ఇన్నేళ్ళ తెలుగు చరిత్రలోనూ ప్రపంచ సినిమాతో నిలబెట్టి చూసుకోగల సినిమాలు లేకపోవడానికి కారణం.  మన దేశంలో ఎంత ఎక్కువమంది సినిమాను , దాని గ్రామర్‍ను చదువుకుంటే ( క్షుణంగా కాకపోయినా ప్రాథమికంగా అయినా ) అంతగా గొప్ప సినిమాలు వచ్చేందుకు ఆస్కారం ఉంది. మనం ప్రస్తుతానికి అంత విద్య లేనివాళ్ళం అనే నిజాన్ని ఒప్పుకుని, మనకు తెలిసిన విఙ్ఞానాన్ని సరి అయిన చర్చలతో పంచుకుంటే మనకు కనీసం భవిష్యతులో అయినా తెలుగునుండి ఒక గొప్ప సినిమా ఆవిర్భవించే అవకాశం ఉంటుంది.
       

4 comments:

విజయవర్ధన్ (Vijayavardhan) said...

విప్లవ్ గారు, చాలా మంచి విషయాలు చెప్పారు. ఇలాగే వ్రాస్తూవుండండి.

Rajasekharuni Vijay Sharma said...

కళాత్మక సినిమాలు మనం ఆదరించాలంటే సినీ గ్రామరును కొంత చదువుకోవాలన్నారు. అంతవరకు బాగుంది. కానీ మన తెలుగు ప్రేక్షకులకు అంత విద్యలేదన్నారే అది నేను సమ్మతించలేను. తీసే వాడిలో దమ్ముండాలి. దాన్ని ప్రేక్షకుడు ఆదరించేలా, నిర్మాతకు నష్టం రాకుండా తీయగల విశ్వాసముండాలి. అలా తీయ గలమన్న నమ్మకం లేకనే కమర్షియల్ సినిమాలవైపు మొగ్గుతున్నారు దర్శకులు.

ఇప్పుడున్న వారిలో దమ్మున్న దర్శకుడంటే నా దృష్టిలో శేఖర్ కమ్ముల నే. అతడు అనుకున్న కథను అనుకున్నట్లు తీయగలడు.

viplove said...

రాజశేఖర్ గారూ
తెలుగు ప్రేక్షకులు సినిమా విద్యలో ఏమీ తెలుసుకోలేదు అనే నా ఆలోచనకు ఊతం ఇస్తున్నాయి మీ వ్యాఖ్యలు.
నిర్మాత గురించి డబ్బు గురించి ఆలోచిస్తే కళాత్మక సినిమాలు రావు. నేను చెప్పిన కొరియన్ సినిమా కూడా ఆ దేశంలో కమర్షియల్ రిలీజు ఉండదు... ఏదో ఒకటో రెండో థియేటర్లలో తప్ప.
కళ కళ కోసమే కానీ డబ్బు కోసం కాదు. సినిమాలో కళ కూడా అంతే.
ఇప్పుడు తెలుగులో ఏ దర్శకుడి గురించీ నేను చర్చించుకోదలచలేదు.

viplove said...

రాజశేఖర్ గారూ
తెలుగు ప్రేక్షకులు సినిమా విద్యలో ఏమీ తెలుసుకోలేదు అనే నా ఆలోచనకు ఊతం ఇస్తున్నాయి మీ వ్యాఖ్యలు.
నిర్మాత గురించి డబ్బు గురించి ఆలోచిస్తే కళాత్మక సినిమాలు రావు. నేను చెప్పిన కొరియన్ సినిమా కూడా ఆ దేశంలో కమర్షియల్ రిలీజు ఉండదు... ఏదో ఒకటో రెండో థియేటర్లలో తప్ప.
కళ కళ కోసమే కానీ డబ్బు కోసం కాదు. సినిమాలో కళ కూడా అంతే.
ఇప్పుడు తెలుగులో ఏ దర్శకుడి గురించీ నేను చర్చించుకోదలచలేదు.