Wednesday, April 14, 2010

అరంగేట్రం

నేనూ మొదలెడ్తున్నా... బ్లాగింగ్

మునుపు, అంటే చాలా కాలం క్రితం.. ఎప్పుడూ అంటే , తెలుగులో బరహా కూడా రాక మునుపు  మూడు సందర్భాలలో మూడుపేర్లతో ఇంగ్లీషు బ్లాగులు నడిపి...నాకొచ్చిన పిచ్చి ఆలోచనలన్నిటినీ క్రికెట్ స్కోరులా లైవ్ అప్డేడ్ చేసి తద్వారా కొందరు స్నేహితులనూ , ద్వేషితులనూ ( ఎవరూ పుట్టించకపోతే కొత్త పదాలెలా వస్తాయ్? ) సంపాదించుకుని నాకు మనసు బావోలేనప్పుడల్లా కాగితాలనూ పుస్తకాలనూ నలిపి , చించేసి , పారేసే ఎదిగీఎదగని మనస్తత్వం ఉన్న ఆ రోజుల్లో ఆ బ్లాగులనూ అలానే డిలీట్ చేసి... ఇకెప్పుడూ నిరంతరం చేస్తాను అన్న భరోసా రానిదే ఏదీ మొదలెట్టకూడదు అని నిర్ణయించుకున్నాక... ఇన్నాళ్ళకు...  ఆ స్థితికి చేరుకున్నానన్న నమ్మకంతో మళ్ళీ మొదలెడుతున్నాను.
   ఎలాగూ తెలుగు వ్రాసే సౌకర్యం ఉంది కనుక, ఎక్కువ భాగం తెలుగులో సాగినప్పటికీ నా భావావేశాన్ని అనుసరించి అప్పుడప్పుడూ ఇంగ్లీషూ , తెంగ్లీషు పోస్టులూ ఇక్కడ కనిపిస్తాయి.  ఇకపోతే ,  మరీ ఏదో నియమం పెట్టుకున్నట్లు... టపాలు , వ్యాఖ్యలు, నొక్కండి , తొక్కండి అని ప్రతిదీ తెలుగులోనే ఉండాలనే నియమం లేదు నాకు.  చేతికి వాచి లేనప్పుడు ఎదురుపడిన వ్యక్తిని "టైం" ఎంతయ్యిందని అడుగుతానే కానీ  మీ చేతి గడియారమందు సమయం ఏమని సూచింపబడుతోంది... అని అనగలిగే రోజునే ప్రతి పదమూ తెలుగులో ప్రచురిస్తాను.
     సరే ఇక విషయసూచిక :
 చిన్న పొట్టి కథలు , కవితలు
పుస్తక సమీక్షలు  ( నేను చదివినవి , చదవాలి అనుకున్నవి , చదవకుండా వొద్దనుకున్నవి కూడా )
సినీ సమీక్షలు
నేను తెలుసుకున్న ప్రపంచంలోని అత్యంత అద్భుతాలూ , ఘోరాలూ
సమాజం మీద ఆగ్రహావేశాలు
 గట్రాలు , వగైరాలు... ఇక్కడ అడ్డదిడ్డంగా కనిపిస్తాయి. నేనేవీ కూర్చి పెట్టను. ఎవ్వరిక్కావల్సినవి వారు వెదుక్కుని చదువుకోవచ్చు లేకపోతే నా బ్లాగు అస్తవ్యస్తంగా ఉందని తిట్టుకుని పోవచ్చు.
    ఒకటి మాత్రం ఇక్కడ నిషిద్ధం : కామెంట్ల సెక్షనులో ఊరూ పేరూ లేకుండా తిట్టుబోతు వ్యాఖ్యలను అస్సలు సహించను.  ఇదొక్కటే ఇక్కడి రూలు. రూలు నెంబరు రెండు ఏదీ లేదు కాబట్టి ఉన్న ఆ ఒక్క నియమాన్నీ పాటిస్తారనీ ఆశిస్తూ.......    
                                  విప్లవ్

3 comments:

Rajasekharuni Vijay Sharma said...

తెలుగు బ్లాగులోకానికి స్వాగతం. బాగుంది మీ బ్లాగు. సమిధ అనే పేరు కూడా.

మీ ఇంటికి వచ్చేవారికి ఓ నియమం పెట్టారు. మరి మీ ఇంటికి మరొకరు రావాలంటే మీ ఇంట్లోనూ కొన్ని నియమాలు ఉండాలి కదా? మీ ఇల్లు చిందరవందరగా ఉంటే వచ్చిన వారికి విసుగనిపించి కొన్ని రోజలకు రావడం మానేయవచ్చు. క్రమ బద్ధంగా ఉంటే మీ బాధ్యతకు ముగ్ధులవ్వ వచ్చు. :)

viplove said...

ఇల్లన్నాక ఇష్టం వచ్చినట్లు ఉండడానికే , నాకు నచ్చే నన్ను మెచ్చేవారు కానప్పుడు ఎవరూ రాకపోయినా నాకు పోయేదేమీలేదు. ఎవ్వరినీ ముగ్థులు చేయవలసిన అవసరమూ నాకు లేదు. అయినా సలహాలకు కృతఙ్ఞుడను.

Mohanatulasi said...

ఓయ్ ! భలే మొదలెట్టేసావు...అచ్చం నీతో మాట్లాడుతున్నట్టే వుంది. నీలో ఒక గరిటెడు ఆవేశంతో పాటు ఒక చెంచాడు కామెడీ కూడా వుందేం!

ఏది ఏమైనా గానీ... నీ flow వుంది చుసావు..అదే కట్టిపడేసేది చదివే వాళ్ళని...సరే మరి ఇక మిగిలినవి చదివి నిను మెచ్చుకోవాలో....సుత్తి కొట్టావని తిట్టుకోవాలో డిసైడ్ చేస్తా మిత్రమా..!!